అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారత్‌తో మైండ్ గేమ్స్ ఆడుతూనే ఉన్నారు. ‘మోడీ నా మిత్రుడు, ఆయనతో భేటీ కోసం ఎదురుచూస్తున్నా…’ అంటూనే, రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నందుకు భారత్ అదనపు సుంకాలు విధించాలని జీ-7 దేశాలపై ఒత్తిడి చేస్తున్నారు. ఆయన ఒత్తిడికి తలొగ్గి అవి కూడా సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. భారత్ పట్ల ట్రంప్ ద్వంద వైఖరికి ఇది చక్కటి నిదర్శనమే కదా?
ట్రంప్ ద్వంద వైఖరిని ప్రధాని మోడీ కూడా పసిగట్టారు. కనుకనే ట్రంప్ సుంకాలతో ఏర్పడిన నష్టాన్ని భర్తీ చేసేందుకు జీఎస్టీ తగ్గించారు.
తద్వారా వివిధ ఉత్పత్తులు, సేవలు అందించే పరిశ్రమలు, సంస్థలపై కొంత ఆర్ధిక భారం తగ్గించారు. పండుగల సీజన్ మొదలయ్యే ముందు జీఎస్టీ తగ్గింఛి వివిధ వస్తువుల ధరలు తగ్గేలా చేయడం ద్వారా వాటిని ప్రజలు విరివిగా కొనుగోలు చేసేందుకు వీలు కల్పించారు.
కనుక ఈసారి పండుగ సీజనులో అన్ని కంపెనీలు ఇబ్బడి ముబ్బడిగా లాభాలు ఆర్జించే అవకాశం ఉంది. జీఎస్టీ తగ్గించడం వలన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆ మేరకు ఆదాయం కోల్పోయినప్పటికీ, ఈసారి వివిధ వస్తువుల ధరలు తగ్గడం వలన కొనుగోళ్ళు పెరిగితే ఆ మేరకు జీఎస్టీ వసూళ్ళు కూడా పెరుగుతాయి. తద్వారా దేశీయ పరిశ్రమలను, సంస్థలను ట్రంప్ దెబ్బల నుంచి కాపాడుకొంటూనే సామాన్య ప్రజలకు కూడా ఉపశమనం కలిగించారు. కనుక ట్రంప్‌ని ఎదుర్కోవడంలో ప్రధాని మోడీ చాలా తెలివిగా వ్యవహరించారని చెప్పవచ్చు.
అయితే ట్రంప్ కూడా చేతులు ముడుచుకొని కూర్చోలేదు. జీ-7 దేశాల చేత భారత్‌పై అదనపు సుంకాలు విధింపజేయబోతున్నారని స్పష్టమయ్యింది.
కనుక ట్రంప్ సృష్టిస్తున్న ఈ కొత్త సమస్యని కూడా ఎదుర్కోవడానికి ప్రధాని మోడీ మరో ఉపాయం ఆలోచించక తప్పదు. అయితే ఇటువంటి తాత్కాలిక నష్ట నివారణోపాయాలతో పాటు శాశ్విత ఉపాయాలు కూడా ఆలోచించి అమలుచేసి దేశీయ పరిశ్రమలను, సంస్థలను, దేశ ప్రజలను కాపాడుకోవలసి ఉంది.
ఏది ఏమైనప్పటికీ తన బెదిరింపులకు ప్రధాని మోడీ లొంగరనే విషయం ట్రంప్‌కు బాగా అర్ధమయ్యేలా చేయగలిగారు.




