మనిషి చేసిన పాపం ఎప్పుడో ఒకరోజు తనకే తిరిగి వస్తుంది. కానీ కొన్నిసార్లు జీవించడం కూడా శిక్షగా మారుతుంది.
మనుమరాలు వయసున్న బాలికపై అత్యాచారం చేయాలనుకున్న తాటిక నారాయణ రావు (62) బుధవారం రాత్రి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. కాకినాడ జిల్లా తునిలో జరిగిన ఈ ఘటనపై నిన్న మీడియాలో ప్రధానంగా వార్తలు వచ్చాయి. ప్రభుత్వం, ప్రతిపక్షం తీవ్రంగా స్పందించాయి. సోషల్ మీడియాలో ఈ వార్త వైరల్ అయ్యింది.
కనుక అతను ఇక సమాజంలో తలెత్తుకొని జీవించలేని పరిస్థితి ఏర్పడింది. అందుకే బుధవారం రాత్రి కోమటి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. గజ ఈతగాళ్ళు అతని మృతదేహాన్ని వెలికి తీయగా, పోలీసులు అతని శవాన్ని పోస్టుమార్టంకు తరలించారు.
అతను టీడీపికి చెందిన వ్యక్తి కనుక వైసీపీ వెంటనే దీనిపై రాజకీయాలు మొదలు పెట్టేసింది. ఈ హేయమైన ఘటనని కూటమి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు లభించిన గొప్ప అవకాశంగానే భావించింది. అయితే ఇటువంటి విషయాలలో అతిగా వ్యవహరించడం వల్ల ఆ బాలిక, ఆమె కుటుంబానికి కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఎదురవుతుందని భావించలేదు. ఈ అతి కారణంగానే అతను ఆందోళన, అవమానభారం భరించలేక ప్రాణాలు తీసుకున్నాడు.
సామాజిక న్యాయం పేరుతో రాజకీయాలు చొరబడినప్పుడు, బాధితుడు, నిందితుడు మద్య గీత మసకబారుతుంది. ఇలాంటి సంఘటనలు రాజకీయ కత్తిపోట్లుగా మార్చుకోకుండా మీడియా, రాజకీయ పార్టీలు, సమాజం అందరూ సంయమనం పాటించడం చాలా అవసరమని ఈ ఆత్మహత్య చెపుతోంది.
ఒకవేళ పోలీసులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోకపోతే, అప్పుడు వైసీపీ వారినీ, ప్రభుత్వాన్ని నిలదీసినా బాగుండేది. ప్రభుత్వం వెంటనే స్పందించి అతనిపై పోక్సో కేసులు నమోదు చేయించి, అరెస్ట్ చేసి, ఇటువంటి నేరాలు ఎవరు చేసినా ఉపేక్షించేది లేదని స్పష్టం చేసింది. అయినా వైసీపీ సంయమనం పాటించలేదు.
ఫలితంగా ఓ ప్రాణం పోయింది. అతనికి అదే తగిన శిక్ష అని అందరూ భావించవచ్చు. కానీ అతను జీవితాంతం జైలులో మగ్గుతూ, ఈ కేసులు, అవమానాలు భరిస్తూ జీవించి ఉండటమే పెద్ద శిక్ష కదా?




