టీవీకే పార్టీ అధినేత విజయ్‌కి అన్నాడీఎంకే మద్దతు తీసుకొని ప్రభుత్వం ఏర్పాటు చేస్తారని నేడు జోరుగా ఊహాగానాలు వినిపించినప్పటికీ కాంగ్రెస్, వామపక్షాలు, మరో మూడు చిన్న పార్టీల మద్దతుతోనే ప్రభుత్వం ఏర్పాటుకి సిద్దం అవుతున్నట్లు తాజా సమాచారం.
వాటి 15 మంది ఎమ్మెల్యే మద్దతుతో టీవీకే పార్టీ బలం 108 నుంచి ఒకేసారి 123కి పెరిగింది. దానిలో విజయ్ పోటీ చేసిన రెండు స్థానాలలో ఒక దానికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. శాసనసభ స్పీకర్ పదవికి మరొక ఎమ్మెల్యేని వదులుకుంటే టీవీకే పార్టీ బలం 2 12 అవుతుంది.
ప్రభుత్వం ఏర్పాటుకి మ్యాజిక్ ఫిగర్ 118 కనుక మరో ముగ్గురు ఎమ్మెల్యేలు ఎక్కువే ఉన్నారు. ఈ లెక్కలతో విజయ్ దళపతి నేడు తమిళనాడు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్‌తో భేటీ కాబోతున్నారు. ఇప్పటికే ఆయన సానుకూలంగా స్పందిస్తూ విజయ్‌ని ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా ఆహ్వానించారు.
ప్రభుత్వం ఏర్పాటు చేసిన రెండు వారాలలోగా శాసనసభలో బాలీవుడ్ నిరూపణ చేసుకుంటాననే విజయ్ అభ్యర్ధనని గవర్నర్ అంగీకరించినట్లు తెలుస్తోంది. కనుక గవర్నర్‌తో విజయ్ భేటీ కేవలం ప్రమాణ స్వీకారం ముహూర్తం ఖరారు చేసుకునేందుకే అని భావించవచ్చు.
ఈ నెల 7న చెన్నైలోని జవహార్ లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో “విజయ్ అనే నేను…” ప్రమాణ స్వీకారం కోసం చకచకా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ యువరాజు రాహుల్ గాంధీ కూడా హాజరు కాబోతున్నట్లు తెలుస్తోంది.
ఇంత తక్కువ బలంతో ప్రభుత్వ ఏర్పాటు చేయడమంటే ‘టైట్ రోప్ వాక్’ సర్కస్ చేయడం వంటిదే అని చెప్పవచ్చు. రాజకీయాలలో కొమ్ములు తిరిగిన నాయకులైతే ఇలాంటి పరిస్థితిని లౌక్యంగా హ్యాండిల్ చేయగలరు. కానీ సినిమాలు తప్ప బొత్తిగా రాజకీయ, పరిపాలనానుభవం లేని విజయ్ ఈ పరిస్థితిని ఏవిధంగా హ్యాండిల్ చేస్తారో చూడాలి.
బిజేపి అధిష్టానం ఢిల్లీ, ఒడిస్సా, బిహార్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలపై దృష్టి పెట్టి ఒకటొకటిగా అన్నిటినీ వశపరుచుకుంది. జయలలిత చనిపోయిన తర్వాత అన్నాడీఎంకే పార్టీని దాని ద్వారా తమిళనాడు రాజకీయాలను కూడా పరోక్షంగా శాశిస్తూనే ఉంది.
విజయ్ పూర్తి మెజార్టీతో అధికారంలోకి వచ్చి ఉండి ఉంటే బిజేపి అధిష్టానం తప్పకుండా 5 ఏళ్ళు వేచి చూసేది. కానీ కాస్త కదిపితే పేక మేడలా కూలిపోయే పరిస్థితిలో టీవీకే పార్టీ ఉంటే చేతులు ముడుచుకొని చూస్తూ ఊరుకుంటుందా?




