
వైసీపి రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకట రమణ, బీద మస్తాన్ రావు ఇద్దరూ తమ పదవులకి, పార్టీ ప్రాధమిక సభ్యత్వాలకి రాజీనామాలు చేసి టిడిపిలో చేరిపోబోతున్నారు. మరో ఆరుగురు ఎంపీలు క్యూలో ఉన్నారని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు చెపుతున్నారు.
ఆయన జాబితాలో లేని ఇద్దరు వైసీపి ఎమ్మెల్సీలు బల్లి కళ్యాణ్ చక్రవర్తి, కర్రి పద్మశ్రీలు నేడో రేపో తమ పదవులకి, పార్టీకి రాజీనామా చేయబోతున్నట్లు తెలుస్తోంది.
Also Read – AI విప్లవం – విజ్ఞానమా? వినాశనమా?
సాధారణంగా రాజకీయ నాయకులు ఎవరూ పదవులకి రాజీనామా చేసేందుకు ఇష్టపడరు. అదీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అటువంటి ఆలోచన కూడా మనసులోకి రానీయరు. ఎందుకంటే ఆ పదవులతోనే వారికి కాస్తో కూస్తో ప్రజలు, మీడియా గుర్తింపు లభిస్తుంటుంది కనుక.
కానీ టిడిపిలో చేరేందుకు వైసీపి నేతలు తమ పదవులకు రాజీనామా చేసేందుకు సిద్దపడుతుంటం గమనిస్తే, వైసీపి నుంచి బయటపడటానికి వారు ఎంత ఆత్రంగా ఉన్నారో అర్దం చేసుకోవచ్చు.
Also Read – రివ్యూల దీపం ఆర్పేస్తే, సినిమా అంధకారంలో మునిగిపోతుంది.
ఈ లెక్కన వైసీపిలో చివరికి మిగిలేది ఎవరు? అని ప్రశ్నించుకుంటే జగన్, విజయసాయి రెడ్డి, పెద్దిరెడ్డి, చెవిరెడ్డి, వైవీ రెడ్డి, కొడాలి నాని, అంబటి, గుడివాడ, రోజా వంటి ఓ అరడజను పేర్లు కనబడతాయి. వీరందరూ నూటికి నూరు శాతం వైసీపిలోనే ఉంటారు. ఎందుకంటే మరే పార్టీలో వారికి అవకాశం లేదు కనుక!
అయితే ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు బయటకు వెళ్ళిపోతే ఇక ఆ పార్టీకి విలువ ఏముంటుంది?జగన్‌తో కలిపి 11 మంది ఎమ్మెల్యేలున్నప్పుడే శాసనసభలో అడుగుపెట్టేందుకు జంకుతున్నారు. ఉన్న ఆ కొద్దిమంది కూడా వెళ్ళిపోతే జగన్ అమరావతిలో కూడా ఉండకపోవచ్చు. బహుశః అందుకే జగన్ బెంగళూరు ప్యాలస్ సిద్దం చేసుకుంటున్నారేమో?
Also Read – అందగాడికే ఇన్ని కష్టాలు…!
ఇక వైసీపి నుంచి వస్తున్నవారు తప్పనిసరిగా తమ పదవులకు రాజీనామాలు చేసి రావాలనే సిఎం చంద్రబాబు నాయుడు షరతు టిడిపి, జనసేన, బీజేపీ మూడు పార్టీలకు వరంగా మారబోతోంది.
ఉప ఎన్నికలలో ఆ పదవులు మూడు పార్టీలకే దక్కుతాయి కనుక అవి మరింత బలపడతాయి. కనుక రాజీనామాలతో ఓ వైసీపి బలహీనపడుతుంటే, మరోవైపు టిడిపి కూటమి క్రమంగా బలడుతుంటుంది. అంటే ఒకే దెబ్బకు రెండు పిట్టలన్న మాట!