ఏపీ సిఎం జగన్మోహన్ రెడ్డి తన రాజకీయ ప్రత్యర్ధుల మీద సంధించిన బాణం వైఎస్ షర్మిల, వెనక్కు తిరిగి వచ్చి ఆయనకే గుచ్చుకుంది. ఆమె జనవరి 21న ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా బాధ్యతలు చేపట్టారు. మొదట్లో ఆమె అన్న జగన్మోహన్ రెడ్డిని ఏవిదంగా ఎదుర్కుంటారో అని చాలా ఆసక్తిగా ప్రజలు ఎదురుచూశారు.
ప్రజలు ఊహించిన దానికంటే చాలా ఘాటుగానే షర్మిల తన అన్నపై తీవ్ర విమర్శలు, ఆరోపణలు చేస్తుండటంతో మంచి స్పందన వచ్చింది. అది చూసి పదేళ్ళుగా కలుగుల్లో దాక్కొన్న కాంగ్రెస్ నేతలందరూ బయటకు వచ్చి ఆమె వెంట తిరగసాగారు. దీంతో ఏపీ కాంగ్రెస్‌కు మళ్ళీ పుంజుకుంటోందని, మంచి రోజులు వచ్చాయని అందరూ భావించారు.
కానీ వైఎస్ షర్మిల రోజూ అన్నని విమర్శిస్తూ, ప్రత్యేక హోదా గురించి మాట్లాడుతుండటంతో ప్రజలకు కూడా ఆమె ప్రసంగాలు బోర్ కొట్టేశాయి. బహుశః ఈవిషయం ఆమెకు, ఏపీ కాంగ్రెస్ నేతలకు కూడా తెలిసే ఉంటుంది. కానీ వారికి కొత్తగా చెప్పుకునేందుకు ఏమీ లేదు. కనుక పాడిందే పాటగా అదే పాడుతూ కాలక్షేపం చేస్తున్నారు.
వైఎస్ షర్మిల లక్ష్యం నిర్జీవమైన ఏపీ కాంగ్రెస్‌కు ప్రాణం పోసి బ్రతికించడం. వైసీపిలోకి వెళ్ళిపోయిన కాంగ్రెస్ నేతలను వెనక్కు తిరిగి రప్పించడం, శాసనసభ, లోక్‌సభ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీని సిద్దం చేయడం, ఎన్నికలలో ఓడినా కాంగ్రెస్ ఓటింగ్ శాతం మళ్ళీ పెంచడం అనే కొన్ని లక్ష్యాలు ఆమె ముందున్నాయి.
వాటిలో మొదటిది ఏపీ కాంగ్రెస్ ఇంకా బ్రతికే ఉందని వైఎస్ షర్మిల నిరూపించగలిగారు. కానీ మిగిలినవేవీ సాధించలేకపోయారు. ఈ రెండు నెలల్లో ఆమె వైసీపి నుంచి ఒక్క సీనియర్ నేతని ఆకర్షించలేకపోయారు. కర్నూలు జిల్లా కోడుమూరు మాజీ ఎమ్మెల్యే మురళీకృష్ణకు వైసీపి టికెట్ దక్కకపోవడంతో ఆయన ఒక్కరే కాంగ్రెస్ పార్టీలో చేరారు.
ఈసారి ఎన్నికలలో పోటీ చేసేందుకు ఏపీ కాంగ్రెస్ పార్టీలో ఎవరూ ఆసక్తి చూపడం లేదు. కనుక ఇంతవరకు ఒక్క అభ్యర్ధిని కూడా షర్మిల ప్రకటించలేకపోయారు. ఇటీవల విశాఖలో పర్యటించిన తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి ఏపీ కాంగ్రెస్‌కు 5 ఎంపీ, 25 ఎమ్మెల్యే సీట్లు ఇచ్చి గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఆమె ఎప్పటికైనా ముఖ్యమంత్రి అవుతారని అన్నారు. కానీ కాంగ్రెస్ అభ్యర్ధులు పోటీ చేయకపోతే ప్రజలు ఎవరిని గెలిపించాలి?
వైఎస్ షర్మిల ఎప్పటికైనా ఏపీ ముఖ్యమంత్రి అవ్వాలనుకుంటే శాసనసభకు పోటీ చేయాలి. కానీ ఆమె కడప నుంచి లోక్‌సభకు పోటీ చేయబోతున్నట్లు ప్రకటించారు. అంటే ఈ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఎలాగూ గెలవలేదు కనుక ఆమె ముందుగానే జాగ్రత్త పడుతూ తన దారి తాను చూసుకుంటున్నారన్న మాట!
ఆమె అన్న జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తూ వైసీపి ఓట్లు చీల్చేందుకు ప్రయత్నిస్తున్నారు. కనీసం ఆమె ఆ ఒక్క పని సక్రమంగా చేయగలిగితే దాని వలన టిడిపి, జనసేనలకు ఎంతో కొంత మేలు జరగవచ్చు.




