తెలుగు సినిమా కధలకు సహజంగా టైటిల్స్ తో సంబంధం ఉండదు. సినిమా బాగుంటే మెచ్చుకుంటారు, లేదంటే తిట్టిపోస్తారు తప్ప… టైటిల్ కు, దర్శకుడు చెప్పిన కధకు ఎక్కడైనా మ్యాచ్ అవుతుందా? అనేది ప్రేక్షకులు కూడా ఆలోచించరు. కానీ కొన్ని సినిమాలకు మాత్రం ‘టైటిల్స్’ పర్ ఫెక్ట్ గా కుదురుతాయి. అలాంటి పర్ ఫెక్ట్ టైటిలే ఈ “ఊపేకుహ.” అదేలెండి… చిన్నపుడు స్కూల్ లో చెప్పుకున్న “ఊళ్ళో పెళ్ళికి కుక్కల హడావుడి.”
రాజేంద్రప్రసాద్ కీలకపాత్ర పోషించిన ఈ సినిమాలో కామెడీని సృష్టించడానికి కధారచయితలు, దర్శకుడు పడ్డ శ్రమ ఈ ట్రైలర్ లో ప్రతి ఫ్రేంలో కనపడుతుంది. విశేషం ఏమిటంటే… కనీసం ఒక్క షాట్ లో కూడా ఎవరికీ చిరునవ్వు రాకపోవడం. టైటిల్ కు తగ్గట్లే రాజేంద్రప్రసాద్ పెళ్లికి ఆయన తమ్ముళ్ళు చేసే హడావుడే… ఈ సినిమా కధగా కనపడుతోంది. ఇక్కడ పవన్ కళ్యాణ్ “కాటమరాయుడు” కధ గుర్తుకు రావడం సహజమే!
అందులో ‘హీరోయిజం’ ఎంచుకోగా, ఇందులో ‘కామెడీయిజం’ను ఎంచుకున్నారు. ఈ రెండింటిలో సారూప్యం ఏమిటంటే… అక్కడ హీరోయిజం ఎలా అయితే పండలేదో, ఇక్కడ కామెడీ కూడా అదే స్థాయిలో ఉండడం. దీనికి అనూప్ రూబెన్స్ సంగీతం అందించడం ప్లస్ పాయింట్ కాగా, ‘జబర్దస్త్’ బ్యాచ్ నంతా పెట్టుకుని “ఊళ్ళో పెళ్లికి కుక్కల హడావుడి”ని చేసినట్లుగా ట్రైలర్ చెప్తోంది. వాట్ ఎ టైటిల్…. వాట్ ఎ ట్రైలర్…! శభాష్..!



