ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా సాధన కోసం అన్ని రాజకీయ పార్టీలతో కలిసి ‘జేఏసీ’ ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనలు ‘జనసేన’ అధినేత పవన్ కళ్యాణ్ వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఇందుకోసం లోక్ సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ్ మరియు ఉండవల్లి అరుణ్ కుమార్ వంటి వారిని కూడా కలుపుని పోతానని పవన్ చెప్పిన కాసేపటికే దీనిపై ఉండవల్లి కూడా స్పందించారు.
పవన్ కళ్యాణ్ తనకు ఫోన్ చేసారని, నాకు ఏ విధంగానూ పరిచయం లేని పవన్ కళ్యాణ్ తన పేరు చెప్పడాన్ని గౌరవంగా భావిస్తానని, ప్రత్యేక హోదా కోసం కలిసి పని చేయాలని పవన్ కోరారని చెప్పిన ఉండవల్లి, ప్రస్తుతం తాను రాజకీయాలకు దూరంగా ఉంటున్న విషయం స్పష్టం చేసానని అన్నారు. అందరినీ కలుపుకుపోతానని పవన్ చేసిన ప్రతిపాదన ఆహ్వానించదగ్గ పరిణామం అని అన్నారు.
రాజమండ్రి వచ్చి తనను కలుస్తానని పవన్ చెప్పగా, వద్దు తానే హైదరాబాద్ వచ్చి కలుస్తానని చెప్పానని, ఈ నెల 11వ తేదీన హైదరాబాద్ లో పవన్ కళ్యాణ్ తో తాను సమావేశం అవుతున్నట్లుగా ఉండవల్లి స్పష్టం చేసారు. తెలంగాణా సాధనలో జేఏసీ పోషించిన కీలకపాత్ర తరహాలోనే ఏపీ ప్రత్యేక హోదా సాధనలో ఈ జేఏసీ ఉండాలన్న అభిప్రాయాన్ని పవన్ కళ్యాణ్ వ్యక్తపరిచిన విషయం తెలిసిందే.



