అమెరికాలో నేటికీ ‘గన్ కల్చర్’ బలంగానే ఉంది. చిన్నప్పటి నుంచి పిల్లలు కూడా అలాంటి వీడియో గేమ్స్ ఆడుతూ పెరుగుతారు. సగటు అమెరికన్స్ కూడా అటువంటి యాక్షన్ సినిమాలనే ఇష్టపడతారు.
అమెరికన్ ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడు అత్యాధునిక యుద్ధ విమానాలు, నౌకలు, రకరకాల క్షిపణులు, ఆయుధాలు తయారు చేసుకుంటుంటుంది.
అంటే అమెరికాకు శత్రువుల వలన ప్రమాదం పొంచి ఉన్నందున కాదు… అమెరికా రక్తంలో ‘గన్ కల్చర్’ బలంగా ఉన్నందునే అనుకోవచ్చు.
‘కర్రున్న వాడిదే బర్రె’ అన్నట్లు ప్రపంచ దేశాలపై అమెరికా ఆధిపత్యం నిలుపుకోవడానికే రక్షణ రంగంపై బిలియన్ల డాలర్లు ఖర్చు చేస్తుంటుంది.
బియ్యం మూట కొని నెలరోజులు వాడకపోతే పురుగు పట్టి పాడయిపోతుంది. అలాగే అంత ఖర్చుపెట్టి తయారు చేసుకున్న ఆ ఆయుధాలన్నిటినీ గోదాములలో దాచుకుంటే ‘ఎక్స్‌పైర్’ అయిపోతాయి.
కనుక అప్పుడప్పుడు ఇలా అప్పుడప్పుడు కుంటిసాకులతో యుద్ధాలు చేస్తూ వాటిని ప్రయోగించి, పరీక్షించి చూసుకుంటుంది. ప్రపంచ దేశాలకు కూడా వాటిని చూపించి ‘మార్కెటింగ్’ చేసుకుంటుంది.
దీనినే మరో విధంగా చెప్పాలంటే, ఫార్మా కంపెనీలు కొత్త మందులు కనిపెట్టేందుకు ముందుగా ప్రయోగశాలలో గిన్నీ పిగ్స్, కోతులు వగైరా జంతువులపై ప్రయోగాలు చేస్తూ పరీక్షించుకుంటాయి. వాటి ఫలితాలను బట్టి మందులు తయారుచేస్తాయి. అమెరికా కూడా ఇప్పుడు ఇరాన్ ప్రజల మీద చేస్తున్నది అదేనంటే అతిశయోక్తి కాదు.
ఇరాన్ మీద రకరకాల బాంబులు, క్షిపణులు ప్రయోగిస్తూ ఆ దేశాధినేత కుటుంబంతో సహా పలువురు అమాయక ప్రజల ప్రాణాలు హరించివేస్తుండటమే ఇందుకు నిదర్శనం కాదా?
ట్రంప్ మొదటిసారి అధ్యక్షుడైనప్పుడు “ఆఫ్ఘనిస్తాన్ కోసం మా సైనికుల ప్రాణాలు, మా ప్రజల కష్టార్జితం ఎందుకు ఖర్చు చేయాలంటూ,” అమెరికన్ దళాలను ఉపసంహరించారు.
భారత్-పాక్ యుద్ధం కొనసాగితే కోట్లా మంది చనిపోతారని, తనకు ప్రజల ప్రాణాలు కాపాడటమే ముఖ్యమని ట్రంప్ అన్నారు.
అదే ట్రంప్… అదే నోటితో ఇప్పుడు ఇరాన్ తనకు ఎదురు చెపితే భూమండలంపై కనబడకుండా చేస్తానని హెచ్చరిస్తున్నారు!
అమెరికన్ల రక్తంలోనే తుపాకీ సంస్కృతి ఉన్నందునే అధ్యక్షులుగా ఎవరు పగ్గాలు పట్టినా ఇలా యుద్ధాలు చేస్తూనే ఉన్నారని చెప్పక తప్పదు.
కనుక ట్రంప్ ఈ యుద్ధం ఎవరి కోసం ఎందుకు చేస్తున్నారు? తనలో యుద్ధ కాంక్షని చల్లార్చుకోవడానికా? గన్ సంస్కృతిని ఇష్టపడే అమెరికన్లను తృప్తి పరచడానికా?
ఇరాన్ చమురు కోసమా? తమ కొత్త ఆయుధాలు టెస్టింగ్ చేసుకోవడానికా? ఆ టెస్ట్ రిజల్ట్స్ చూపి వాటిని మార్కెటింగ్ చేసుకోవడానికా… దేనికి? అంటే అన్నీను అని చెప్పుకోవాలేమో?
కానీ రేపు ఇరాన్ లేదా మరో దేశం అమెరికా మీద ఇదే తరహాలో దాడి చేస్తే తప్పు పట్టకుండా ఉండగలరా?






