రామాయణాన్ని… దానిని గ్రంధస్తం చేసిన వాల్మీకి మహర్షిని లోకానికి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కానీ ఏపీ, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలలో రాజకీయ నాయకులు ఈరోజు ‘వాల్మీకి జయంతి’ సందర్భంగా అయనని గుర్తుచేసుకుంటున్నారు. ఎందుకు?అంటే ఆయన బోయవాడు (బీసీ) కనుక!
ప్రస్తుతం తెలంగాణలో బీసీ రిజర్వేషన్స్‌పై అధికార, ప్రతిపక్షాల మద్య జోరుగా రాజకీయాలు సాగుతున్నాయి. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు, తర్వాత జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు ఉన్నాయి. బీసీ రిజర్వేషన్స్ అస్త్రంతో బీజేపి, బీఆర్ఎస్ పార్టీలను దెబ్బ తీయాలని అధికార కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తోంది. కనుక దానిని అడ్డుకునేందుకు హైకోర్టు, సుప్రీంకోర్టులో పిటిషన్లు పడ్డాయి. ఆ పంచాయితీలు ఇంకా నడుస్తున్నాయి.
ఏపీ రాజకీయాలో వైసీపీ ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి బీసీల కోసం టీడీపి, వైసీపీల మద్య పోటీ సాగుతూనే ఉంది. కనుక ఏపీలో నాయకులకు కూడా వాల్మీకి జయంతి అవసరం పడింది.
అయితే 126 అడుగుల ఎత్తైన డా.అంబేద్కర్ విగ్రహాలు పెట్టి, సచివాలయలకు, జిల్లాలకు ఆయన పేర్లు పెడితేనే పట్టించుకోని దళితులు, బీసీలు, వాల్మీకి మహర్షి ఫోటోతో సోషల్ మీడియాలో పోస్టులు పెడితే పడిపోతారా?అంటే కాదని వారికీ తెలుసు.
ఇది కొండకు వెంట్రుకతో ముడేసి లాగడం వంటిదే. కానీ ప్రయత్నిస్తే ఎంతో కొంత లాభమే తప్ప నష్టం ఉండదు కదా?అందుకే ఈ తాపత్రయం.




