మెగా vs అల్లు వారి మధ్య పరోక్ష యుద్ధం ఒక తెలుగు సీరియల్ మాదిరి కొనసాగుతూనే వస్తుంది. ఒకప్పుడు చిరంజీవి పేరు చెప్పుకుని ఎదిగిన వారు ఇప్పుడు వారి ప్రస్తవన కూడా లేకుండా సొంత గుర్తింపు కోసం ప్రయత్నం చేయడం, అలాగే వారి కుటుంబానికి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకోవడం ఎంతవరకు సమంజసం అంటూ మెగా ఫాన్స్ అల్లు అర్జున్ ను టార్గెట్ చేస్తున్నారు.
అలాగే నచ్చిన వాడికి మద్దతు తెలిపే హక్కు, నమ్మిన వాడి కోసం నిలబడే తత్వాన్ని ప్రశ్నించడం అధర్మం అంటూ, అభిమానం అనేది మాటల్లో కాదు చేతల్లో ఉండాలి అంటూ అల్లు ఆర్మీ ఒకరి మీద ఒకరు కౌంటర్ వేసుకుంటూ సోషల్ మీడియా వార్ కు తెరలేపారు.
అయితే వాళ్ళు అలా ఉంటే ఇంకా మెగా ఫామిలీ హీరోలు ఇచ్చే స్టేట్మెంట్స్ పరోక్షంగా బన్నీ ఉద్దేశించినవిగా ఉండడం, దానికి అల్లు అర్జున్ చేసే వ్యాఖ్యలు కౌంటర్లుగా ఉండడం అగ్నికి ఆజ్యం పోస్తున్నట్లుగా మారుతున్నాయి.
మట్కా ప్రీ రిలీజ్ కార్యక్రమంలో వరుణ్ తేజ్ మాట్లాడిన కొన్ని వ్యాఖ్యలు అల్లు అర్జున్ ను ఉద్దేశించి చేసినవిగా భావిస్తూ వాటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు మెగా అభిమానులు. చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ ల గురించి నేను మాట్లాడతాను, నువ్వు ఎక్కడి నుంచి మొదలుపెట్టావ్, ఎవరి సపోర్ట్ తో ఇక్కడి దాకా వచ్చావ్ అనేది మరిచిపోతే నీ సక్సెస్ నిరుపయోగమవుతుంది అంటూ వరుణ్ చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు మళ్ళీ మెగా vs అల్లు వార్ కు పెట్రోల్ పోసింది.
అలాగే బాలకృష్ణ అన్ స్టాపబుల్ కార్యక్రమంలో పాల్గొన్న అల్లు అర్జున్ ప్రోమోను ఆహా విడుదల చేసింది. దీనిలో జాతీయ ఉత్తమ నటుడు అవార్డు విషయంలో బన్నీ చేసిన కామెంట్స్ కూడా మరో దుమారానికి తెరతీశాయి. ఇన్నేళ్ళుగా తెలుగు నటుడికి జాతీయ అవార్డు రాలేదని నాకు తెలియదు, దాన్ని రౌండ్ చేసి కొట్టాను అంటూ చేసిన వ్యాఖ్యలు కూడా వివాదంగా మారాయి.
అయితే ఇందులో ఎవరు ఎవరిని గిల్లుతున్నారు, ఎవరు ఎవరి మీద అలకపూని ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారో సగటు సినీ అభిమానికి అర్ధం కావడం లేదు. ఒకప్పుడు పాలు నీళ్లులా కలిసిపోయిన అల్లు, మెగా ఇప్పుడు ఉప్పు, నిప్పు మాదిరి తయారవ్వడానికి కారణమెవరు.? దీన్ని పెంచి పోషిస్తున్న ఉద్దేశం ఏమిటి.?
చెట్టు పేరు చెప్పుకుని ఇంకెన్నాళ్లు కాయలమ్ముకుంటాం, సొంత గుర్తింపు కోసం ప్రయత్నిద్దాం అనుకుంటూ ముందుకెళుతున్న మా హీరో మీద మీ ఏడుపేంటి అంటూ అల్లు ఫాన్స్, కృతజ్ఞతా భావం మరచి, నిలబెట్టిన కుటుంబాన్ని పడగొట్టాలని చూడడం ఎంతవరకు న్యాయం అంటూ మెగా అభిమానులు ఇలా ఎవరి ధోరణిలో వారు ఆలోచించుకున్నంత కాలం ఈ పరోక్ష యుద్దానికి ఒక ముగింపు దొరకదు.




