వైసీపి అధినేత రాష్ట్ర ప్రజలందరినీ, అలాగే తన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు వైసీపి నేతలందరినీ కూడా ‘మా నమ్మకం నువ్వే జగన్’ అనుకోమంటారు. ప్రజలు నమ్ముతున్నారో లేదో మరో రెండు నెలల్లో తేలిపోతుంది. కానీ ఆయన ఎవరినీ నమ్మడం లేదని జాబితాలు, సస్పెన్షన్లు, బర్త్ రఫ్‌లు చూస్తే అర్దమవుతుంది.
వైసీపి నేతలు కూడా తమ అధినేత జగన్‌ను నమ్మడం లేదని పార్టీలో వలసలు, రాజీనామాలు చూస్తే అర్దమవుతుంది. తాజాగా ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ ఛైర్ పర్శన్ వాసిరెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు.
ఆమె మొదటి నుంచి జగన్మోహన్ రెడ్డినే నమ్ముకొని ఉన్నారు. కనుక గత ఎన్నికలలోనే ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి టికెట్ ఇస్తారని ఆశపడ్డారు కానీ వివిద సమీకరణాలలో జగన్ ఆమెను పక్కన పెట్టేశారు. ఆమె నొచ్చుకోవడంతో ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ ఛైర్ పర్శన్ పదవి ఇచ్చి శాంతింపజేశారు.
అప్పటి నుంచి ఆమె రాష్ట్రంలో మహిళల తరపు కంటే జగన్, వైసీపి తరపునే ఎక్కువగా పనిచేశారని చెప్పవచ్చు. టిడిపి, జనసేన అధినేతలు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్‌లకు నోటీసులు ఇవ్వడం ఇందుకు ఓ చిన్న నిదర్శనం కాగా వైసీపి నేతలు లేదా వారి అనుచరులు రాష్ట్రంలో మహిళలపై దౌర్జన్యాలు చేస్తున్నా, మంచి నీళ్ళు అడిగితే ట్రాక్టర్ల తొక్కించి చంపేస్తున్నా, ఆమె వారిని నిలదీయలేదు. అసలు రాష్ట్రంలో అటువంటి ఘటనలు జరుగుతున్నట్లు తెలియన్నట్లు ఉండిపోయారు.
ఈ విధేయతకు ప్రతిగా మైలవరం లేదా జగ్గంపేట టికెట్ ఆశించారు. కానీ జగన్ ఇవ్వలేదు. దీంతో మళ్ళీ నొచ్చుకున్న ఆమె తన పదవికి రాజీనామా చేశారు. తద్వారా జగన్‌కు చిన్న హెచ్చరిక చేసినప్పటికీ, ఇంకా ప్రకటించాల్సిన జాబితాలు ఉన్నాయి కనుక వాటిలో తన పేరు కనబడాలంటే, జగన్‌కు విధేయత చూపడం చాలా అవసరం.
కనుక జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ ముఖ్యమంత్రిని చేసుకొనేందుకు ఈ పదవి అడ్డుగా ఉందని భావించి రాజీనామా చేశానని, ఇకపై పార్టీ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటానని వాసిరెడ్డి పద్మావతి చెప్పుకొన్నారు.
జగన్ ఆమెకు టికెట్ ఇస్తారో లేదో తెలీదు కానీ ఆమె ఏ నియోజకవర్గంలో చురుకుగా పనిచేయడానికి బయలుదేరినా, అక్కడ నుంచి టికెట్ ఆశిస్తున్నవారు లేదా ఆ నియోజకవర్గానికి ఇన్‌చార్జిగా నియమించబడిన స్థానిక అభ్యర్ధులు ఆమె తమకు ఎసరు పెడతారనే భయంతో అడ్డుకోవడం ఖాయమే.
కనుక నియోజకవర్గాలలో తిరిగే బదులు ముందుగా తాడేపల్లి ప్యాలస్ చుట్టూ ప్రదక్షిణాలు చేయడం వలననే టికెట్ లభించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. టికెట్ సంపాదించుకుంటే, జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారా లేదా? అని తర్వాత తాపీగా ఆలోచించుకోవచ్చు.




