ఒకప్పుడు ఏ సినిమా చూసినా తనే కమెడియన్ గా ఉండేటంత బిజీగా ఉన్న ‘నల్ల బాలు’ వేణుమాధవ్ ఇటీవల కాలంలో చాలా అరుదుగా మాత్రమే సిల్వర్ స్క్రీన్ పై కనిపిస్తున్నాడు. అయితే దీనికి గల కారణం ఏమిటో తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో వేణు వివరణ ఇచ్చారు. తన దగ్గరకు వస్తున్న ఎక్కువ శాతం సినిమాలలో బూతు కంటెంట్ ఎక్కువగా ఉంటోందని, అందుకనే తన వద్దకు వచ్చిన సినిమాలను నేను చేయట్లేదని, అలాగే తానూ ఉన్న సినిమాలు హిట్టవ్వట్లేదు అనే నమ్మకంతో మరికొందరు తనను దూరంగా పెడుతున్నారని… ఈ కారణాల వలనే తానూ ఈ మధ్య ఎక్కువ సినిమాలలో నటించడం లేదని అన్నారు.
అయితే ఈ స్టేజ్ లోనూ తానూ పవన్ కళ్యాణ్ హీరోగా నటించే రెండు సినిమాలలో నటిస్తున్నానని, ఒకటి ప్రస్తుతం సెట్స్ పైన ఉన్న “కాటమరాయుడు” కాగా, పవన్ నటించబోయే తదుపరి సినిమాలో కూడా చేస్తున్నానని ప్రకటించారు. అయితే ‘కాటమరాయుడు’ తర్వాత రెండు సినిమాలకు పవన్ పూజా కార్యక్రమాలు జరపడంతో ఏ సినిమాలో ఈ ‘నల్ల బాలు’ కామెడీ పండనుందో తెలియాలి. ఒకటి తమిళ దర్శకుడు నీసన్ చిత్రం కాగా, మరొకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించే సినిమా అన్న విషయం తెలిసిందే.
వేణుమాధవ్ కెరీర్ తొలినాళ్ళల్లో కూడా పవన్ కళ్యాణ్ తో చేసిన ‘తొలిప్రేమ’ సినిమా ఇండస్ట్రీలో ఎదిగేలా చేసింది. ఈ సినిమాలో వేణుమాధవ్ చెప్పిన ‘ఎ క్లాస్ అమ్మాయిలు, బి క్లాస్ అమ్మాయిలు…’ అనే డైలాగ్ ఒక ట్రెండ్ సెట్టర్ గా మారి, ఆ తర్వాత చాలా సినిమాలలో దానిని అనుకరించారు. చూడబోతుంటే… తన మలి ఇన్నింగ్స్ ను పవన్ కళ్యాణ్ సినిమానే మలుపు తిప్పేలా కనపడుతుందని సినీ జనాలు మాట్లాడుకుంటున్నారు. వరుసగా రెండు పవర్ స్టార్ సినిమాలు అవకాశాలు రావడంతో ‘నల్ల బాలు’ కామెడీని ఇష్టపడే అభిమానుల పంట పండినట్లే!



