‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ ద్వారా టాలీవుడ్ లోకి మల్టీస్టారర్ చిత్రాలను నిర్మించిన ఘనతను టాలీవుడ్ ‘ఏస్’ ప్రొడ్యూసర్ దిల్ రాజు సొంతం చేసుకున్నారు. అదే ట్రెండ్ ఇప్పటివరకు కొనసాగుతుండగా, తాజాగా మరో మల్టీస్టారర్ సినిమాకు దిల్ రాజు శ్రీకారం చుట్టబోతున్నారు. విక్టరీ వెంకటేష్ – మెగా వారసుడు వరుణ్ తేజ్ లు హీరోలుగా నటిస్తున్న ఈ సినిమా టైటిల్ పోస్టర్ ను శ్రీరామనవమి సందర్భంగా చిత్ర యూనిట్ విడుదల చేసింది.
బాక్సాఫీస్ వద్ద వరుసగా కమర్షియల్ సక్సెస్ లు కొడుతోన్న అనిల్ రావిపూడి దర్శకత్వం వహించనున్న ఈ సినిమాకు “ఎఫ్ 2” అని నామకరణం చేసారు. ‘ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్’ అనేది ఈ సినిమా ట్యాగ్ లైన్. టైటిల్ కు తగ్గట్లే పోస్టర్ డిజైనింగ్ కూడా ‘ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్’గా ఉంది. ఇటీవలే ‘నందమూరి + మెగా’ మల్టీస్టారర్ సినిమా ప్రకటన రాగ, ఇప్పుడు ‘దగ్గుపాటి + మెగా’ మల్టీస్టారర్ వార్త సినీ అభిమానులకు నిజంగానే పండగలా మారింది.



