‘క్లాస్’కు నిలువుటద్దం శేఖర్ కమ్ముల అని ప్రత్యేకంగా చెప్పుకోవలసిన పనిలేదు. ‘ఫిదా’ సినిమాతో మరోసారి యూత్ నుంచి ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి మంచి మార్కులు కొట్టేశాడు. దీంతో శేఖర్ తదుపరి సినిమా విషయంలో రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. ఆయన నెక్స్ట్ మూవీ హీరోలుగా రానా .. నాని .. శర్వానంద్ పేర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి.
ఈ క్రమంలో తాజాగా మరో వార్త బయటికి వచ్చింది. ‘అర్జున్ రెడ్డి’తో మాస్ యాక్టింగ్ కు ఫేవరేట్ హీరోగా విజయ్ దేవరకొండ నిలిచాడు. మరి వీరిద్దరి కాంభినేషన్ ఊహించుకోవడానికే అసాధ్యంగా ఉంది కదా! కానీ అదే జరగబోతోంది అంటున్నారు సినీ జనాలు. ఇటీవల విజయ్ దేవరకొండను కలిసి శేఖర్ ఓ లైన్ వినిపించారట.
అది విజయ్ కి నచ్చడంతో, వీరి కాంబో కార్యరూపం సిద్ధించుకోబోతోందని టాక్. విజయ్ ప్రస్తుతం ఆల్రెడీ పరశురామ్ తో ఓ సినిమా చేస్తుండగా, ఆ తర్వాత క్రాంతిమాధవ్ .. నందినీ రెడ్డి .. రాహుల్ దర్శకత్వంలో వరుస సినిమాలు చేయనున్నాడు. ఈ నేపథ్యంలో శేఖర్ కమ్ముల సినిమా చేయడం నిజమే అయితే, ఆ ప్రాజెక్టులు పూర్తయ్యేవరకూ ఆగుతాడా? ఈ లోగా మరో కథతో మరో హీరోతో ఇంకో సినిమాను లాగించేస్తాడా? అనేది చూడాలి.



