టీవీకే పార్టీతో తమిళనాడు ప్రత్యక్ష రాజకీయాలలో అడుగుపెట్టిన కోలీవుడ్ నటుడు విజయ్ సేతుపతికి మొదటి ఎదురు దెబ్బ నుంచి ఇంకా తేరుకోలేదు. ఇటీవల కరూర్ పట్టణంలో నిర్వహించిన ర్యాలీలో త్రొక్కిసలాటలో 41 మంది చనిపోగా మరో 50 మంది గాయపడ్డారు.
వచ్చే ఏడాది జరుగబోయే శాసనసభ ఎన్నికలలో ఒంటరిగా పోటీ చేసి ముఖ్యమంత్రి పదవి చేపట్టాలని ఆశపడుతున్న విజయ్‌కి ఈ ఘటన చాలా పెద్ద ఎదురుదెబ్బే.
ప్రభుత్వం జరిపిస్తున్న న్యాయ విచారణలో ‘విజయ్‌దే తప్పు… ఈ విషాద ఘటనకు ఆయనే బాధ్యుడు’ అని నివేదిక రావడం ఖాయమే… దానిని అధికారం డీఎంకే పార్టీ టీవీకే పార్టీపై అస్త్రంగా ప్రయోగించి రాజకీయంగా దెబ్బతీసే ప్రయత్నం చేయడం కూడా ఖాయమేనని భావించవచ్చు.
ఇటువంటి సమయంలో కేవలం అభిమానుల మద్దతుతో విజయ్ ఈ సమస్య నుంచి బయటపడలేరు. బలమైన పార్టీ మద్దతు చాలా అవసరం. అందుకు బీజేపి సిద్దంగా ఉందని స్పష్టమైన సంకేతాలు ఇస్తూనే ఉంది.
పోలీసులు, ప్రభుత్వ వైఫల్యం వల్లనే ఈ విషాద ఘటన జరిగిందని తమిళనాడు బీజేపి నేతలు వాదిస్తున్నారు. ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు, ప్రముఖ నటి కుష్బూ మరో అడుగు ముందుకు వేసి, ఈ ఘటనలో రాజకీయ కుట్ర ఉందని అనుమానం వ్యక్తం చేశారు. విజయ్ రాజకీయ ప్రవేశంతో డీఎంకే పార్టీకి ఎన్నికలలో నష్టం జరుగుతుందనే ఈ కుట్రకి పాల్పడి ఉండవచ్చని కుష్బూ అనుమానం వ్యక్తం చేశారు.
ర్యాలీలో అన్ని వేలమంది జనంతో కిటకిటలాడుతుంటే పోలీసులు లాఠీఛార్జి ఎందుకు చేశారని ఖుష్బూ ప్రశ్నించారు. ర్యాలీ నిర్వహణకు తగిన ప్రదేశం ఇవ్వకుండా, తగిన భద్రతా ఏర్పాట్లు చేయకపోవడం వల్లనే ఈ విషాద ఘటన జరిగిందని ఖుష్బూ ఆరోపించారు.
కనుక బీజేపితో విజయ్ ఎన్నికల పొత్తుకి సిద్దపడితే ఆయనకు అండగా కేంద్రం నిలబడుతుందని చాలా స్పష్టంగానే తమిళనాడు బీజేపి నేతలు సిగ్నల్స్ ఇస్తున్నట్లు భావించవచ్చు. కనుక విజయ్ వంటి క్యాచ్ చేసి బీజేపితో పొత్తుకి సిద్దపడితే రాజకీయాలలో ముందుకు సాగిపోవచ్చు. లేకుంటే అధికార డీఎంకే-కాంగ్రెస్ కూటమి, ప్రతిపక్ష అన్నాడీఎంకే-బీజేపి కూటమి మద్య విజయ్ లేగదూడలా నలిగిపోయే ప్రమాదం ఉంటుంది.




