కొత్త పార్టీ పెడతా.. రాష్ట్రాన్ని ఉద్దరిస్తానంటున్న మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి శుక్రవారం మధ్యాహ్నం అనంతపురంలో ప్రెస్‌మీట్ పెట్టి మాట్లాడారు.
రాష్ట్రంలో కులం, మతం ఆధారంగా రాజకీయాలు చేస్తున్న అధికార, ప్రతిపక్షాల మద్య ప్రజలు నలిగిపోతున్నారు. ఈ రెండు పార్టీలకు ప్రత్యామ్నాయంగా జెన్-జీతో యువనాయకత్వం తయారు చేస్తాను.
అన్ని వర్గాలకు సమాన ప్రాధాన్యం ఇస్తూనే, రెడ్ల ఆత్మగౌరవాన్ని కాపాడే బాధ్యత నేను తీసుకుంటాను. రాయలసీమ ఒరిజినల్ రెడ్లు తలుచుకుంటే ఏమవుతుందో నేను ఆ రెండు పార్టీలకు చూపిస్తాను.
చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి ఇద్దరూ రాయలసీమకు చెందినవారే కానీ ఇద్దరూ సీమ జిల్లాలకు చేసిందేమీ లేదు. ఈ రెండు పార్టీల వలన సీమకు ఎన్నటికీ న్యాయం జరుగదు కూడా.
కనుక రాయలసీమ యువత తాము పుట్టి పెరిగిన ఈ గడ్డ కోసం పార్టీలు, కులమతాలు అన్నీ పక్కనపెట్టి ఏకం కావాలి. మన పార్టీ అధికారంలోకి వస్తే రాయలసీమని మళ్ళీ రతనాల సీమగా మార్చుతుందని హామీ ఇస్తున్నాను,” అని విజయసాయి రెడ్డి అన్నారు.
రాష్ట్రం, దేశం, జెన్-జీ అంటూ మొదలుపెట్టిన విజయసాయి రెడ్డి, తర్వాత రాయలసీమ అంటూ ప్రాంతీయవాదం వైపు వెళ్ళారు. అంటే తన రాజకీయ పార్టీ కొరకు రాష్ట్రంలో మళ్ళీ ఈ ప్రాంతీయవాదం రాయలసీమ ప్రజలను రెచ్చగొట్టాలనుకుంటున్నారా?అనే సందేహం కలుగుతుంది.
టీడీపి, వైసీపీలు కులమతాల పేరుతో రాజకీయాలు చేస్తున్నాయని, వాటికి అతీతంగా ప్రజలు ఆలోచన చేయలన్న విజయసాయి రెడ్డి, రాయలసీమ ఒరిజినల్ రెడ్లు… వారి పౌరుషం అంటూ వారి ఆత్మగౌరవం కాపాడే బాధ్యత తీసుకుంటానని చెప్పడం ఆశ్చర్యం కలిగిస్తుంది.
అంటే రాయలసీమ పేరుతో యువతని, రెడ్ల ఆత్మగౌరవం పేరుతో సీమ జిల్లాలోని వైసీపీలోని రెడ్లను, సీమలో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఓటర్లను ఆకట్టుకోవాలని విజయసాయి రెడ్డి ఆలోచనగా కనిపిస్తోంది. తద్వారా రాయలసీమ రెడ్లతో సులువుగా పార్టీని ఏర్పాటు చేసుకోవచ్చునని భావిస్తున్నట్లున్నారు.
అయినా గత ఏడాది రాజకీయాల నుంచి రిటైర్ అయ్యానని చెప్పి, హటాత్తుగా మళ్ళీ వచ్చి ఇప్పుడు జెన్-జీని తయారు చేస్తాననడం విచిత్రంగానే ఉంది.
ఒరిజినల్ రెడ్ల కోసం ఓ పార్టీ అవసరమన్నట్లు విజయసాయి రెడ్డి మాట్లాడటం, అయన ఆలోచనలకు అద్దం పడుతోంది. కనుక ఆయన వస్తోంది రాయలసీమ కోసమో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసమో.. రెడ్ల కోసం కాదనే అనిపిస్తోంది.
కనుక ఏపీలో షర్మిల, తెలంగాణలో కవితలా అయన కూడా రాజకీయ జాక్ పాట్ కొట్టాలని ఆశపడుతున్నారా?లేక రాష్ట్ర రాజకీయాలపై ఏదో అదృశ్యశక్తి సంధించిన బాణమా? బాణమే అయితే దానిని సంధించిన ఆ శక్తి ఎవరు? అది ఆయనను ఎందుకు బరిలో దింపుతోంది? అనే ప్రశ్నలకు క్రమంగా సమాధానం లభిస్తుంది.
రాయలసీమ "Original Reddys" పౌరుషాన్ని, ఆత్మగౌరవాన్ని కాపాడే పార్టీ మాది
'రెడ్డి' సామాజిక వర్గం అంతా కలిసి రండి…
–@VSReddy_MP pic.twitter.com/a7lIknZV7x
— M9 NEWS (@M9News_) September 18, 2026





