వైసీపీ తో విడాకులు తీసుకుని కొత్త పార్టీ ఏర్పాటుకు రంగం సిద్ధం చేసుకుంటున్న విజయసాయిరెడ్డి తన కొత్త పార్టీ ఏర్పాటుకు ముందు మీడియాలో, సోషల్ మీడియాలో చేస్తున్న రాజకీయం గమనిస్తే సాయి రెడ్డి దృష్టిలో ఏపీలో జనసేన ఉన్నట్టా.? లేనట్టా.? అన్న సందేహం కలుగుతుంది.
ఆంధ్రప్రదేశ్ లో ఒకపక్క టీడీపీ, మరోపక్క వైసీపీ మధ్యే రాజకీయ పోరు జరుగుతుందని, ఈ రెండు పార్టీలకు మూడో ప్రత్యామ్నాయంగా తన పార్టీ ఏర్పాటు ఉంటుందంటూ అసలు ప్రభుత్వంలో భాగమైన జనసేన ఊసే ఎత్తడం లేదు సాయి.
రాష్ట్రంలో కమ్మ – రెడ్ల సామాజికవర్గం నేతలే సీఎం గా ఉండాలా.? మరొకరికి అవకాసం ఇవ్వరా.? అంటూ గళం విప్పిన సాయి ఏపీ రాజకీయాలలో కీలక పాత్ర పోషించే కాపు సామాజికవర్గం ను, ఆ వర్గం నుంచి నాయకుడిగా ఎదిగి, రాష్ట్ర ఉపముఖ్యమంత్రి స్థానంలో ఉన్న పవన్ ను పక్కన పెట్టేశారా.?
తాజాగా నేడు మీడియా ముందుకొచ్చిన సాయి రెడ్డి వైసీపీ పార్టీ మీద మతతత్వ ఆరోపణలు చేస్తూనే 2029 లో టీడీపీ కి ఓటేస్తే లోకేష్ సీఎం అవుతాడు, వైసీపీ కి ఓటేస్తే జగన్ సీఎం అవుతాడు, కానీ మా పార్టీకి ఓటేస్తే సామాన్యుడి లో ఒకడు సీఎం అవుతాడు అంటూ 2024 ఎన్నికలలో 100 % స్ట్రైక్ రేట్ తో దేశ రాజకీయాలలో రికార్డు సృష్టించిన జనసేన పార్టీ ప్రస్తావనే తీసుకురాలేదు.
2029 ఎన్నికలకు కూడా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగానే పోటీకి సిద్ధమంటూ బాబు నుంచి పవన్ వరకు పదేపదే ప్రకటిస్తున్నా, ఆ ప్రకటనలను లోకేష్ సమయం చిక్కినప్పుడల్లా తన ప్రసంగాలతో బలపరుస్తున్నా సాయిరెడ్డి 2029 ఎన్నికల్లో కూటమి ద్వారా టీడీపీ అధికారంలోకి వస్తే సీఎం స్థానంలో లోకేష్ ఉంటాడంటూ ప్రకటించడంతో టీడీపీ, జనసేన రాజకీయ బంధాన్ని విచ్ఛిన్నం చేయదలచారా.? అన్న ప్రశ్న తలెత్తుతుంది.
రాష్ట్రంలో మూడో ప్రత్యామ్నాయంగా టీడీపీ, వైసీపీ తరువాత ఒకరకంగా చెప్పాలంటే ప్రస్తుతం వైసీపీ, జనసేన రాజకీయ బలంతో సరిచేసుకుంటే వైసీపీ ని మించి జనసేన పై చేయి సాధించిందనే చెప్పాలి. అలాగే అటు బీజేపీ అధిష్టానం లో కూడా పవన్ కు ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది.
మరి అటువంటి జనసేన పేరు ప్రస్తావన లేకుండా సాయిరెడ్డి తన రాజకీయ ప్రకటనలు చేస్తున్నారంటే సాయిరెడ్డి ముందుగా జనసేనను మానసికంగా దెబ్బకొట్టాలని భావిస్తున్నారా.? అధికారంలో ఉన్నా, లేకున్నా ఏపీలో జనసేన ఉనికి కనిపిస్తుంది. పవన్ కు ఉన్న అమితమైన ప్రజాదరణ ఏపీలో జనసేనను ఒకే ఒక్కసీటుతో ఐదేళ్లు వైసీపీ ప్రభుత్వం పై పోరాటం చేసేలా చేసింది.
2024 ఎన్నికలలో వైసీపీ ‘వై నాట్ 175’ అన్న నినాదాన్ని, జనసేన ‘హలో ఏపీ బై బై వైసీపీ’ అనే నినాదంతో బలంగా ఢీ కొడితే వైసీపీ 11 తో పాతాళానికి పడింది. రెండు చోట్ల ఓడిపోయాడు అనే ఓటమి అవమానాల నుంచి నేడు రాష్ట్ర ఉపముఖ్యమంత్రిగా, పంచాయితీ, గ్రామీణ, అటవీ, సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిగా ఎదిగిన పవన్ ఏపీలో రాజకీయాలలో సాయిరెడ్డి దృష్టిని ఆకర్షించలేకపోయారా.?
TDPకి ఓటేస్తే… Lokesh 2029లో CM అవుతాడు!
–@VSReddy_MP #NaraLokesh pic.twitter.com/CCUprRd2eI
— M9 NEWS (@M9News_) September 18, 2026





