తమిళనాడు ఎన్నికల ఫలితాలు ఒక రకంగా అందరిని ఆశ్చర్యానికి గురి చేశాయనే చెప్పాలి. ఆ ఆశ్చర్యానికి తమిళనాడు ప్రజలు కీలక పాత్ర పోషించారనే చెప్పాలి. DMK, AIADMK, BJP వంటి దిగ్గజ పార్టీలకు ఎదురురెళుతూ ఎన్నో రాజకీయ ఇబ్బందులను ఎదుర్కొన్నారు, మరెన్నో వ్యక్తిగత సమస్యలను ఎదురీదారు విజయ్.
అయినా ఒంటరి పోరుకే సై అంటూ ఎన్నికల కురుక్షేత్రంలో తలపడ్డారు. అనుకున్న లక్ష్యాన్ని అందుకోవడానికి ఒక్క అడుగు దూరంలో ఎదురుచూస్తున్నారు. అయితే కొత్తగా రాజకీయ పార్టీ పెట్టి అధికారంలోకి రావడం అంటే అది కత్తి మీద సామే అవుతుంది అనేది గత కొన్ని దశాబ్దాలుగా చూస్తూనే ఉన్నారు.
అటువంటి పరిస్థితుల నుంచి కొత్త పార్టీలకు అధికారం అసాధ్యం కాదు సుసాధ్యం అని రుజువు చేసిన నేత విజయ్. ఇప్పుడు విజయ్ TVK గెలుపు కవిత తెరాస పార్టీకి ఊపిరి పోస్తుందనే చెప్పాలి. ప్రజలలో నమ్మకం కలిగించగలిగితే గెలుపు అనేది ‘అందని ద్రాక్ష’ కాదని విజయ్ నిరూపించడంతో కవితకు కొత్త ఆశలు చిగురించే అవకాశం ఉంది.
అలాగే కవిత తెరాస ను ఇన్నాళ్లు తక్కువ అంచనా వేస్తూ వస్తున్నా కేసీఆర్ బిఆర్ఎస్ కి కూడా TVK విజయం కనువిప్పు కావాలి. కవిత కూడా దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న తండ్రి కేసీఆర్ పార్టీని కాదని, కాంగ్రెస్, బీజేపీ లాంటి జాతీయ పార్టీలను ఎదురిస్తూ తెరాస (తెలంగాణ రక్షణ సేన) అంటూ ఎన్నికల బరిలో దిగేందుకు సై అంటున్నారు.
తెలంగాణ తల్లిగా, రాబోయే ఎన్నికలలో అధికారం పీఠం అందుకునే నేతగా, కాబోయే సీఎం గా ప్రచారం మొదలు పెట్టిన కవిత ఇప్పుడు TVK విజయంతో రెట్టించిన ఉత్సాహంతో బిఆర్ఎస్ పై విరుచుకుపడే అవకాశం లేకపోలేదు. తెలంగాణ ఎన్నికలలో కూడా కవిత తెరాస గేమ్ ఛేంజర్ కావడానికో.? కింగ్ మేకర్ కావడానికో ఖచ్చితంగా తనవంతు ప్రయత్నాలు మొదలుపెడుతుంది.




