వైఎస్సార్ కాంగ్రెస్ లో నెంబర్ టూ విజయసాయి రెడ్డి తనని తాను విశాఖపట్నం కు సామంతరాజు అనుకుంటారని ప్రత్యర్ధులు ఆరోపిస్తూ ఉంటారు. విశాఖలో ఇటీవలే జరిగిన విషవాయువు లీక్ విషయంలో పార్టీ మొత్తం డిఫెన్స్ లో పడింది. రాజధానిని విశాఖకు తరలించాలి అనుకుంటున్న సమయంలో ఇలా జరగడంతో నష్ట నివారణా చర్యలు చేపట్టారు.
దీనితో ఆ లీక్ ఎఫెక్ట్ ఇంకా ఉందని రాస్తున్న మీడియా పై విజయసాయి రెడ్డి విరుచుకుపడుతున్నారు. ఈ క్రమంలో ఆయన వేసిన ఒక ట్వీట్ ఆసక్తికరంగా ఉంది. “ఇసుక మాఫియాను సృష్టించి నదులను అడుగంటా ఊడ్చినందుకు గ్రీన్ ట్రిబ్యునల్ 100 కోట్ల పెనాల్టీ విధించింది నీ హయాంలోనే కదా? ప్రకాశం బ్యారేజిలో 15 ఎకరాల కృత్రిమ ద్వీపం ఏర్పాటుకు డ్రెడ్జింగుకు అనుమతిందీ నువ్వే. ఇప్పుడు మడ అడవుల పేరుతో పర్యావరణం ఖూనీ అని దొంగ ఏడుపులేడుస్తున్నావు!,” అంటూ ఆయన చంద్రబాబు పై విరుచుకుపడ్డారు.
విజయసాయి రెడ్డి ఆరోపించిన 100 కోట్ల పెనాలిటీ మాట నిజమే. అయితే ఆ తరువాత అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వం… అసలు ఇసుక మైనింగ్ జరగలేదని, 100 కోట్ల ఫైన్ వెయ్యడం సబబు కాదని గ్రీన్ ట్రిబ్యునల్ లో రివ్యూకు వెళ్లిన మాట వాస్తవం కాదా? అప్పుడు బాబు ప్రభుత్వానికి క్లీన్ చిట్ ఇచ్చింది జగన్ ప్రభుత్వమే కదా?
ఇది ఇలా ఉండగా.. కంపెనీ ఎదుట ఆందోళన చేసిన వారి మీద లాక్ డౌన్ ఉల్లంఘన కేసులు పెట్టారు స్థానిక పోలీసులు.అయితే అధికార పార్టీకి ఉండే.. రాజకీయ ఇబ్బందుల దృష్ట్యా చనిపోయిన వారి బంధువుల మీద మాత్రం కేసులు పెట్టలేదు. ఇప్పటికే ఇది టీడీపీ, జనసేనల ప్రోత్సాహంతో జరిగిన ఉద్యమం అని ఇప్పటికే అధికారపక్షం తేల్చి చెప్పింది.



