విశాఖ పోర్టులో పట్టుబడిన మాదక ద్రవ్యాల కంటెయినర్ విషయంలో టిడిపి బలంగా వాదనలు వినిపిస్తుండటంతో వైసీపి ఆత్మరక్షణలో పడింది. టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఇటీవల కొన్ని ఫోటోలను మీడియాకు విడుదల చేశారు. వాటిలో సదరు కంపెనీ యజమాని, డైరెక్టర్లు వైసీపి ఎంపీ విజయసాయి రెడ్డితో సహా కొందరు వైసీపి నేతలతో దిగిన ఫోటోలు ఉన్నాయి.
దీంతో విజయసాయి రెడ్డి కూడా మాట్లాడక తప్పలేదు. కానీ ఈ వ్యవహారంలో ఆయన మాట్లాడిన మాటలు విన్నప్పుడు, ఆనాడు వివేకానంద రెడ్డి హత్య తర్వాత ఏవిదంగా అమాయకత్వం నటిస్తూ మాట్లాడారో గుర్తుకు రాక మానదు.
అసలు విశాఖ పోర్టుకి కంటెయినర్‌లో మాదక ద్రవ్యాలు వచ్చిన్నట్లు కానీ, వాటిని సీబీఐ పట్టుకొన్నట్లు కానీ తనకు తెలియదని విజయసాయి రెడ్డి అన్నారు. వాటిని తెప్పించిన ‘సంద్యా ఆక్వా కంపెనీ’, దాని డైరెక్టర్లు ఎవరో తనకు తెలియనే తెలియదన్నారు. కానీ ఈ వ్యవహారంలో చంద్రబాబు నాయుడు తన పేరు ప్రస్తావించడంతో, విషయం ఏమిటని ఆరా తీసి తెలుసుకున్నానని విజయసాయి రెడ్డి సింపుల్‌గా చేతులు కడిగేసుకున్నారు.
సంధ్యా ఆక్వా కంపెనీ కమ్మవారికి సంబందించినది కనుక అది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు, బాలకృష్ణ, దగ్గుబాటి పురందేశ్వరిలకు సంబందించినవారిదే అని వైసీపిలో సజ్జల వంటి మేధావులు, వారి మీడియా సీబీఐ కంటే ముందే కనుగొని చెప్పేశారు. కనుక విజయసాయి రెడ్డి కూడా అదే చెప్పారు. ఇదివరకు అమరావతిపై కూడా ఇలాగే కమ్మ ముద్ర వేసేశారు. ఇప్పుడూ అదే ఫార్ములా ఫాలో అవుతున్నట్లున్నారు.
ఆనాడు వివేకా గుండెపోటుతో చనిపోయారని విజయసాయి రెడ్డి చెప్పారు. కానీ సునీతా రెడ్డి పట్టుబట్టి పోస్టు మార్టం చేయించడంతో ‘గుండెపోటు కాదు… గొడ్డలి పోటు’ అని ఆయనే సవరణ ఇచ్చారు. ఇప్పుడూ అలాగే అమాయకత్వం నటిస్తున్నట్లు అనిపించడం లేదూ?
తాను బ్రెజిల్ అధ్యక్షుడుకి శుభాకాంక్షలు చెప్పడంపై స్పందిస్తూ, “బ్రిక్స్ కూటమిలో భాగస్వామిగా ఉన్న బ్రెజిల్లో అధ్యక్ష ఎన్నికలు జరిగితే, తాను ఓ చక్కటి సాంప్రదాయాన్ని పాటిస్తూ ఓ పార్లమెంట్ సభ్యుడుగా ఆ దేశాధినేతగా ఎన్నికైన వ్యక్తికి శుభాకాంక్షలు తెలియజేశానని,” విజయసాయి రెడ్డి చెప్పారు.
చంద్రబాబు నాయుడు దానిని కూడా ఈ మాదక ద్రవ్యాల వ్యవహారంతో ముడిపెట్టి, ‘వైసీపి-బ్రెజిల్ బంధం’ అంటూ తనపై, తమ పార్టీ, ప్రభుత్వంపై బురద జల్లుతున్నారని విజయసాయి రెడ్డి ఆరోపించారు.
సాధారణంగా ఇటువంటి సందర్భాలలో భారత్ తరపున కేంద్ర ప్రభుత్వం ఆయా దేశాధినేతలకు శుభాకాంక్షలు తెలుపుతుంది తప్ప ఎంపీలు కారు. కానీ పార్లమెంటులో ఒక్క విజయసాయి రెడ్డి ఒక్కరే శుభాకాంక్షలు తెలిపారు. అందుకే చంద్రబాబు నాయుడు అనుమానం వ్యక్తం చేశారనుకోవచ్చు.
గతంలో చంద్రబాబు నాయుడు అమరావతి రాజధాని డిజైన్స్, ప్రణాళికల కోసం సింగపూర్ వెళ్లిన్నప్పుడు, ఆ దేశ ప్రతినిధులు విజయవాడ వచ్చి చంద్రబాబు నాయుడుని కలిసి మాట్లాడినప్పుడు, ఆయనకు సింగపూర్‌లో భారీగా నల్లధనం దాచారని, అక్కడ ఆయనకు అనేక ఆస్తులున్నాయని ఇదే విజయసాయి రెడ్డి, వైసీపి నేతలు చాలా మాట్లాడారు. అప్పుడు వారికి అది తప్పు అనిపించలేదు. కానీ ఇప్పుడు తిరిగి చంద్రబాబు నాయుడు ఆరోపిస్తే తప్పట!
అద్దాల మేడలో కూర్చొని దారిన పోయే వారిపై రాళ్ళు విసరకూడదని వైసీపి నేతలు ఇప్పటికీ గ్రహించక పోవడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది.
డ్రగ్స్ కేసులో ఉన్న సంధ్య ఆక్వా కంపెనీ చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన వారిదే..- విజయసాయిరెడ్డి #Visakhapatnam #sandhyaaqua #drugracket #drugs #VijayaSaiReddy #YSRCP #AndhraPradesh #NTVTelugu pic.twitter.com/ic1jz0IfUX
— NTV Telugu (@NtvTeluguLive) March 24, 2024




