వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈ మధ్య కాలంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రభుత్వ విధానాల మీద సోషల్ మీడియాలో వ్యతిరేకత వస్తుంది. కరోనా సమయంలో ఎన్నికలు కావాలని అడగడం, ముఖ్యమంత్రి అయ్యుండి కులం పేరుతో ప్రెస్ మీట్ పెట్టడం, ఆ తరువాత ఆయనను తప్పించడం, కరోనా సమయంలో ప్రెస్ మీట్లలో తప్పులు దొర్లడం, ఆ తరువాత రికార్డెడ్ ప్రెస్ మీట్లు పెట్టడం వంటివి ప్రభుత్వానికి ఇబ్బందిగా మారాయి.
దీనితో సోషల్ మీడియాలో ప్రతిపక్షాలు యాక్టీవ్ అయ్యాయి. అయితే సోషల్ మీడియా ఎఫెక్ట్ ఏంటో వైఎస్సార్ కాంగ్రెస్ నాయకత్వానికి తెలిసినంత ఎవరికీ తెలీదు. అప్పట్లో టీడీపీ ప్రభుత్వం పై వైఎస్సార్ కాంగ్రెస్ సోషల్ మీడియా వింగ్ ముప్పేట దాడి చేసి చంద్రబాబుని గద్దె దించాయి. నిజంగా సోషల్ మీడియాలో వ్యతిరేకత వచ్చినా, పనిగట్టుకుని దుష్ప్రచారం చేసినా సోషల్ మీడియా వల్ల జరిగే నష్టం అపారం.
దీనితో అధికార పార్టీ జాగ్రత్త పడింది. ఆ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి తన మీద, ముఖ్యమంత్రి జగన్ దుష్ప్రచారం చేస్తున్నారంటూ విజయవాడలో సైబర్ క్రైమ్ కు కంప్లయింట్ చేశారు. అందులో టీడీపీ, జనసేన కార్యకర్తలకు సంబంధించిన ఐడీలను జతపరిచారు. అరెస్టుల పేరుతో వారిని భయపెట్టి సైలెంట్ చెయ్యాలని ప్రభుత్వ వ్యూహంగా కనిపిస్తుంది.
పోలీసులు కూడా వారిని పట్టుకునే పనిలో పడ్డారు. గతంలో ఏకంగా మండలి మీదే బూతు కార్టూన్లు వేశారనే కంప్లయింట్ మీద ఒక వైఎస్సార్ కాంగ్రెస్ కార్యకర్త మీద అప్పటి ప్రభుత్వం కేసు పెట్టి అరెస్టు చేస్తే జగన్, విజయ సాయి రెడ్డి స్వయంగా రంగంలోకి దిగారు.
సోషల్ మీడియా గొంతు నొక్కుతున్నారు… బాబుకి ముఖ్యమంత్రిగా కొనసాగే అర్హత లేదు అంటూ మీడియా ముందు ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చారు. ఇప్పుడు వాటికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో సర్క్యూలేట్ చేస్తున్నారు ఇతర పార్టీ అభిమానులు. అప్పుడు చెప్పిన నీతులేంటి ఇప్పుడు ఇంత దిగజారడమేంటి? అంటూ ఎద్దేవా చేస్తున్నారు



