
తెలంగాణలో తాజాగా బిఆర్ఎస్ పార్టీలో జరుగుతున్న కొన్ని పరిణామాలు గతంలో వైసీపీ పార్టీ ఎదుర్కున్న సంక్షోభాలను గుర్తు చేస్తున్నాయి. కేటీఆర్ మీద కవిత వినిపిస్తున్న వ్యతిరేఖ స్వరం, షర్మిల, జగన్ మీద ఎక్కుపెట్టిన విమర్శనా బాణాలను జ్ఞప్తికి తెస్తుంటే,
హరీష్ రావు బీజేపీ కోవర్ట్ అంటూ జరుగుతున్న ప్రచారంతో వైసీపీ లో బీజేపీ విధేయుడిగా పేరొందిన విజయసాయి రెడ్డి ని స్మరణకు తెస్తున్నాయి. వైసీపీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఆ పార్టీ అధినేతను కేసుల భయం చుట్టుముట్టినప్పుడు వైసీపీ రాజ్యసభ సభ్యుడిగా విజయసాయి ఢిల్లీలో బీజేపీ తో తెరచాటు రాజకీయం నడిపి వైసీపీ ని ఒడ్డున పడేసారు అనేది వైసీపీ నేతలు సైతం ఒప్పుకునే వాస్తవమే.
Also Read – ఇలా అయితే ఎలా కవితక్కా?
అయితే సరిగ్గా ఇప్పుడు బిఆర్ఎస్ పరిస్థితి, ఆ పార్టీ అధినేత కేసీఆర్ దుస్థితి ఇలానే కనిపిస్తుంది. ఒకపక్క పార్టీ ఓటమి భారం, మరో పక్క కూతురు తిరుగుబాటు స్వరం, ఇక కాళేశ్వరం పై విచారణ అంటూ కేసీఆర్ కే నోటీసులు…ఇలా గులాబీ కారు ఎటువైపు నుంచి చూసినా రాజకీయ సంక్షోభంలో కురుకుపోవడానికి సిద్ధంగా ఉంది.
ఇక ఇటు వంటి సమయంలో పార్టీని, పార్టీ అధినేత కేసుల భయాన్ని తొలగించడానికి బీజేపీ పెద్దలతో రాజకీయ రాయబారం చేయడానికి హరీష్ రావు వెనకుండి చక్రం తిప్పుతున్నారు అనేది తెలంగాణ రాజకీయాలలో పెద్ద ఎత్తున ప్రచారమవుతుంది. అయితే ఇక్కడ వైసీపీలో విజయసాయి, అక్కడ బిఆర్ఎస్ లో హరీష్ రావు ఇద్దరు కూడా ఆయా పార్టీల అధినేతలు జగన్, కేసీఆర్ కు వీర విధేయులే.
Also Read – కేసుల వలయంలో కేసీఆర్ కుటుంబం..!
కానీ 2024 వైసీపీ ఓటమి విజయసాయిని వైసీపీ కి దూరంగా జగన్ కు వెన్నుపోటుదారునిగా మార్చేశాయి. మరి 2023 బిఆర్ఎస్ ఓటమి హరీష్ రావు ని బిఆర్ఎస్ కు కోవర్ట్ గా కేసీఆర్ కు కట్టప్ప గా మార్చబోతున్నాయి అనేది కేసీఆర్ కుమార్తె, బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఆరోపణ. మరి కవిత ఆరోపణలు నిజమైతే వైసీపీలో ఎం జరుగుతుందో బిఆర్ఎస్ లో కూడా అదే విధమైన రాజకీయం జరుగబోతోంది అనేది స్పష్టమవుతుంది.
వైసీపీ, బిఆర్ఎస్ రెండు పార్టీలు ఒకేసారి ప్రత్యర్థి పార్టీల చేతులలో చిత్తుగా ఓటమి చెందాయి. అలాగే రెండు పార్టీలలోనూ ఇంటి ఆడపడుచు పార్టీ పై విమర్శల నిప్పులు జల్లుతుంది. ఇటు ఏపీలో లిక్కర్ స్కాం కేసులో జగన్ అరెస్టు అంటూ వైసీపీలో అలజడి మొదలయ్యింది. అటు తెలంగాణలో కాళేశ్వరంలో అవినీతి అంటూ కేసీఆర్ ని నోటీసులు నీడలా వెంటాడుతూ బిఆర్ఎస్ ను భయపెడుతున్నాయి.
Also Read – జైల్లో సౌకర్యాలు లేవు… ఇలా అయితే ఎలా?
మరోపక్క జగన్ కు విజయసాయి మాదిరి కేసీఆర్ కు హరీష్ అనే ఆందోళన గులాబీ సైన్యాన్ని ముళ్ళు లా గుచ్చుతోంది. ఇక వైసీపీ ఫ్యాన్ కి గులాబీ కారుకి కాషాయ కమల దళ విలీనం అనే అభయం భయంగా మారుతుంది. ఈ ఐదేళ్లు జగన్, కేసీఆర్ ఇద్దరు ఒకేరకమైన రాజకీయ సంక్షోభాలను ఎదురుకోనున్నారా అనేలా పరిస్థితులు ఎప్పటికప్పుడు అధినేతల చేతులు జారుతున్నాయి.