తెలంగాణలో రాజకీయాలు మళ్ళీ రంజుగా సాగుతున్నాయి. రెండున్నరేళ్ళుగా ఫామ్‌హౌసులో కాలక్షేపం చేస్తున్న కేసీఆర్ రేపు జగిత్యాల పట్టణంలో జరుగబోయే బీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభకు హాజరుకాబోతుండటమే ఇందుకు కారణం.
కనుక అధికార కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మద్య రాజకీయ చదరంగం మొదలైపోయింది. రేపటి సభకు కేసీఆర్ వస్తున్నారని తెలిసి సిఎం రేవంత్ రెడ్డి భయంతో గజగజా వణికిపోతున్నారని, అందుకే సభకు ఆటంకం కల్గించేందుకు కుట్రలు చేస్తున్నారని బీఆర్ఎస్ నేతలు విమర్శిస్తున్నారు. గులాబీలకు సువాసన ఎంత సహజమో బీఆర్ఎస్ నేతలు ఈవిధంగా మాట్లాడటం కూడా అంతే సహజం.
ఇంకా గమ్మతైన విషయం ఏమిటంటే, నేడు బీఆర్ఎస్ ముఖ్య నేతలందరూ మేడిగడ్డకు వెళ్ళి బ్యారేజ్‌లో క్రుంగిపోయిన మూడి పియర్స్ పరిశీలించారు. అయితే వాళ్ళు వెళ్ళింది అందుకు కాదు. అక్కడ నిలబడి సిఎం రేవంత్ రెడ్డిని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించేందుకు.
మేడిగడ్డ బ్యారేజ్‌లో కేవలం మూడు పియర్స్ క్రుంగితే వాటికి మరమత్తులు చేయించకుండా సిఎం రేవంత్ రెడ్డి రెండున్నరేళ్ళు కాలక్షేపం చేశారని వారు ఆరోపించారు.
జగిత్యాల సభకు కేసీఆర్ వస్తున్నారని తెలిసి ఆయనపై బురద జల్లేందుకే సిఎం రేవంత్ రెడ్డి మేడిగడ్డ బ్యారేజ్ పర్యటనకు బయలుదేరుతున్నారని బీఆర్ఎస్ నేతలు ఎద్దేవా చేశారు.
ప్రపంచంలోని ఇంజనీరింగ్ అద్భుతాలలో కాళేశ్వరం ప్రాజెక్టు కూడా ఒకటని కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, బీఆర్ఎస్ పార్టీ నేతలు గొప్పలు చెప్పుకునేవారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండగానే అలాంటి ఇంజనీరింగ్ అద్భుతం మేడిగడ్డ బ్యారేజ్‌లో మూడు పియర్స్ క్రుంగిపోయాయి.
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగానే కట్టిన్న మరో రెండు మూడు బ్యారేజీల గోడలకు పగుళ్ళు ఏర్పడి ప్రమాదకరంగా మారాయి. కనుక బీఆర్ఎస్ పార్టీ నేతలు సిగ్గుతో తల దించుకోవాలి. కానీ తాము కట్టిన మేడిగడ్డ బ్యారేజ్‌లో క్రుంగిపోయిన పియర్స్ ముందు నిలబడి సిగ్గులేకుండా మాట్లాడుతున్నారని కాంగ్రెస్ నేతలు ఎద్దేవా చేశారు.
రేపటి సభలో కేసీఆర్ ఎలాగూ కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వం, సిఎం రేవంత్ రెడ్డిపై విమర్శలు చేస్తారు. వాటికి కాంగ్రెస్ నేతలు కూడా అంతే ఘాటుగా బదులిస్తారు.
ఒకవేళ కేసీఆర్ డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లు విషయంలో ప్రధాని మోడీని కేంద్రాన్ని విమర్శిస్తే వెంటనే తెలంగాణ బిజేపి నేతలు తగులుకుంటారు. ఒకవేళ విమర్శించకపోతే తెలంగాణ కాంగ్రెస్ నేతలు తగులుకుంటారు.
ఈ సభలో కూతురు కవిత రాజకీయాల గురించి ఏమైనా మాట్లాడితే ఆమె కూడా తండ్రిపై నిప్పులు చెరుగుతారు. కనుక జగిత్యాల సభ బీఆర్ఎస్ పార్టీకి ప్రతిష్టాత్మకంగా కంటే అగ్నిపరీక్షగా మారుతుందేమో?




