Vijayasai Reddy Met Sharmila

విజయసాయి రెడ్డి తన ఎంపీ పదవికి, పార్టీకి రాజీనామా చేసి రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని, ఇక నుంచి వ్యవసాయం చేసుకుంటానని చెప్పారు. అయితే ఆ మర్నాడే ఆయన హైదరాబాద్‌లో వైఎస్ షర్మిల ఇంటికి వెళ్ళి ఆమెతో మూడు గంటలు సమావేశమయ్యి అక్కడే భోజనం చేసి వెళ్ళారు.

వారిద్దరూ ఎంత రహస్యంగా భేటీ అయినప్పటికీ ఈ విషయం బయటకు పొక్కింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బహుశః వైసీపీలో కూడా ప్రకంపనలు మొదలయ్యే ఉంటాయి. కనుక నేడో రేపో వైసీపీ నేతల రియాక్షన్ మొదలవుతుంది.

Also Read – తండేల్ కాంబోస్..!

జగన్‌-షర్మిల ఆస్తుల పంపకాల విషయంలో, వివేకా హత్య కేసు విషయంలో విజయసాయి రెడ్డి జగన్‌ పక్షాన్నే నిలబడి వైఎస్ షర్మిలపై విమర్శలు చేశారు. కనుక ఆమె కూడా ఆయనపై ఎదురుదాడి చేశారు.

ఇద్దరూ పరస్పరం ఇంతగా విమర్శించుకున్న తర్వాత భేటీ అవడం, అదీ… వైసీపీ నుంచి రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించిన తర్వాత ఆయన ఆమె ఇంటికి వెళ్ళి కలవడం తేలికగా కొట్టి పడేసే విషయం కాదు.

Also Read – జగన్‌ 2.0: ఏపీకి, చంద్రబాబుకి మరింత కష్టమే!

వారిద్దరూ జగన్‌, వైసీపీ కోసం ఎంతగానో కృషి చేసినవారే. కానీ జగన్‌ ఇద్దరినీ పూర్తిగా వాడుకొని అవసరం తీరిన తర్వాత అవమానించారు. అందుకే మొదట వైఎస్ షర్మిల, ఇప్పుడు విజయసాయి రెడ్డి వైసీపీ నుంచి బయటకొచ్చేశారు.

ఇద్దరూ జగన్‌ బాధితులే. జగన్‌తో ఇప్పటికే షర్మిల రాజకీయ యుద్ధాలు చేస్తున్నారు. బహుశః విజయసాయి రెడ్డి కూడా ఆమెతో చేతులు కలిపి యుద్ధం మొదలుపెట్టబోతున్నారేమో?అందుకే జగన్‌ విదేశంలో ఉన్నప్పుడు విజయసాయి రెడ్డి వైసీపీతో తెగతెంపులు చేసుకొని బయటపడి ఉండవచ్చు.

Also Read – విశాఖ రైల్వే జోన్‌కి ఇన్ని తిప్పలా?

కానీ ఇప్పటికిప్పుడు వారిరువురూ బహిరంగంగా చేతులు కలపకపోయినా ఆమె వెనుక విజయసాయి రెడ్డి ఉంటారని స్పష్టమైంది.

విజయసాయి రెడ్డికి తాడేపల్లి ప్యాలస్‌ రహస్యాలన్నీ తెలుసు. వివేకా హత్య కేసు గురించి చాలా విషయాలు తెలుసు. కనుక ఆయన రాజకోట రహస్యాల గురించి నోరు విప్పితే చాలా ప్రమాదమే.

ఇదీగాక ఆయన ఆక్రమాస్తుల కేసులలో ఏ-2గా ఉన్నారు. కనుక వాటి నుంచి తాను బయటపడేందుకు అప్రూవరుగా మారితే జగన్‌ జైలుకి వెళ్ళక తప్పదు.

బహుశః ఈ భయంతోనే ఆయన వైసీపీ నుంచి హటాత్తుగా తప్పుకున్నట్లు ప్రకటించినా వైసీపీ నేతలు ఎవరూ ఇంతవరకు ఆయనని పల్లెత్తు మాట అనలేదని అనుకోవచ్చు.

అయితే తనపై కత్తి దూసినందుకు సొంత చెల్లినే జగన్‌ ఉపేక్షించలేదు. ఇప్పుడు విజయసాయి రెడ్డి వలన తనకు, పార్టీకి ప్రమాదం కలుగుతుందని అనిపిస్తే జగన్‌ ఉపేక్షిస్తారా?అంటే కాదనే చెప్పొచ్చు. కానీ అది నిప్పుతో చలగాటమే అవుతుంది. కనుక జగన్‌ చాలా ఆచి తూచి పావులు కదపాల్సి ఉంటుంది.

ఇంతకీ విజయసాయి-షర్మిల ప్లాన్ ఏమిటో తెలియాలంటే, వారి భేటీపై వైసీపీ రియాక్షన్ ఏవిదంగా ఉంటుందో చూస్తే కొంత స్పష్టత రావచ్చు.