తెలుగుదేశం పార్టీ 40వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ కూడా పార్టీ కోసం పని చేయాలని సీనియర్ నేత బుచ్చయ్య చౌదరి అన్న మాటను టీడీపీ వ్యతిరేక పార్టీ ఎవరికి కావాల్సిన విధంగా వారు అన్వయించుకుంటున్నారు. ఇక ఇటువంటి విషయాన్ని అసలు వదిలిపెట్టారు వైఎస్సార్ కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి. దీనిపై ట్విట్టర్ లో ఆయన తనదైన శైలిలో విమర్శించారు.
“తండ్రీకొడుకుల ధృతరాష్ట్ర కౌగిలి నుంచి బయట పడేదెప్పుడు? పచ్చ పార్టీకి కొత్త నాయకత్వం వచ్చేది ఎప్పుడు బుచ్చన్నా? త్వరలో చీలికలు, పీలికలు అయి ఎవరి ముక్క వాళ్లు లాక్కెళ్తారని సూటిగా చెప్పొచ్చుగా. నూతన నాయకులు రావడానికి ఏం మిగిలిందని? ఎన్టీఆర్ స్థాపిస్తే బాబు సమాధి చేశాడు పార్టీని,” అంటూ ట్వీట్ చేశారు ఆయన. అయితే సోషల్ మీడియాలో దీనికి టీడీపీ వారు గట్టిగానే స్పందిస్తున్నారు.
టీడీపీ నాయకత్వం గురించి తరువాత… వైఎస్సార్ కాంగ్రెస్ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ ఏరి? అన్న న్యాయం చేయకపోవడం తో సొంతంగా పార్టీ పెట్టుకున్న షర్మిల పరిస్థితి ఏంటి? షర్మిల తో వేల కొద్దీ కిలోమీటర్లు నడిపించి ఆ తరువాత చేసిందేంటి? అసలు వైఎస్సార్ కాంగ్రెస్ అనే పార్టీ ఒరిజినల్ ఓనర్ ను పార్టీ నుండి ఎలా బయటకు పంపారో కూడా మాట్లాడండి అంటూ పంచ్లు విసురుతున్నారు.
నిత్యం తెలుగుదేశం పార్టీ పని అయిపోయింది అయిపోయింది అంటూ కలవరించే విజయసాయి రెడ్డి అవకాశం దొరికిందని వాడేసుకున్నారు. అయితే ఆయనకు ఎదురైన ప్రశ్నలు కూడా సరైనవే కదా అంటూ టీడీపీ అభిమానులు ఎద్దేవా చేస్తున్నారు. షర్మిల గురించి ఇప్పటిదాకా మాట్లాడను కూడా మాట్లాడలేకపోయారు ముఖ్యమంత్రి జగన్. విధానాల వరకు పరిమితమై మాట్లాడితే ఇటువంటి ఇబ్బందికరమైన ప్రశ్నలు ఎదురుకావేమో!





