తెలంగాణ సిఎం కేసీఆర్ నేతృత్వంలో జాతీయ రాజకీయాలలోకి ప్రవేశిస్తున్న బిఆర్ఎస్ పార్టీని చూస్తే ఇతర రాష్ట్రాలలో అన్ని పార్టీలకు భయమేనంటూ తెలంగాణ బిజెపి నేత విజయశాంతి సంచలన వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణలో దోచుకొన్న లక్షల కోట్లు అవినీతి సొమ్ముతో దేశంలో అన్ని పార్టీల ఎన్నికల ఖర్చుని మేమే భరిస్తామంటూ కేసీఆర్ దేశంలోని ప్రజాస్వామ్య వ్యవస్థను అవహేళన చేస్తున్నారని విజయశాంతి ఆరోపించారు. దీంతో దేశంలో మళ్ళీ నియంతృత్వ ఫ్యూడల్ వ్యవస్థ ఏర్పడుతుందేమో? అని సందేహం వ్యక్తం చేశారు.
విజయశాంతి తన ఆరోపణలను సమర్ధించుకొంటూ, జనసేన పార్టీకి వెయ్యికోట్లు ఇచ్చి లొంగదీసుకొనేందుకు కేసీఆర్ చేసిన ప్రయత్నం గురించి ఆంధ్రజ్యోతిలో వచ్చిన వార్తను పేర్కొన్నారు. కానీ పవన్ కళ్యాణ్ ప్రలోభాలకు లొంగలేదన్నారు.
అన్నా హజారే స్పూర్తితో ఢిల్లీ, పంజాబ్‌లో ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన ఆమాద్మీని కూడా లిక్కర్ స్కామ్‌లో ఇరికించి కేసీఆర్ సర్వనాశనం చేస్తున్నారని విజయశాంతి ఆరోపించారు.
మహారాష్ట్రలో చిన్న రైతుసంఘం ఎన్నికలలో కోట్ల రూపాయలు విచ్చలవిడిగా ఖర్చు చేసినా బిఆర్ఎస్ పార్టీ ఒక్క స్థానం కూడా గెలవలేకపోయిందని విజయశాంతి ఎద్దేవా చేశారు.
ఈవిదంగా కేసీఆర్ విచ్చలవిడిగా డబ్బు ఖర్చు చేస్తూ ఇతర రాష్ట్రాలలో రాజకీయ పార్టీలు కూడా తప్పనిసరిగా బిఆర్ఎస్తో పోటీ పడి డబ్బు పంచాల్సిన భ్రష్టాచార వ్యవస్థను దేశమంతా వ్యాపింపజేస్తున్నారని విజయశాంతి ఆగ్రహం వ్యక్తం చేశారు.
విజయశాంతి చెప్పింది అక్షరాలా నిజమని రాజకీయ పరిజ్ఞానం ఉన్నవారందరికీ తెలుసు. లేకుంటే ఏపీ, యూపీ, పంజాబ్, బిహార్, మహారాష్ట్ర, గుజరాత్, ఒడిశా తదితర రాష్ట్రాల నుంచి రాజకీయ నిరుద్యోగులు, రైతులు ప్రగతి భవన్‌కు ఎందుకు క్యూకడుతున్నారు?వారి రాష్ట్రాలలో రాజకీయ పార్టీలు లేకనేనా?
ఆంధ్రా విషయానికి వస్తే, టిడిపి, వైసీపీలు కలలో కూడా ఊహించలేని విదంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్‌లో వేలకోట్లు పెట్టుబడులు పెట్టేందుకు కేసీఆర్ సిద్దమయ్యారు. ఆ తర్వాత వెనక్కు తగ్గారు అది వేరే సంగతి. కానీ దాంతో ఏపీలో పార్టీలకు ‘తన కెపాసిటీ ఏమిటో’ కేసీఆర్ చూపారు.
ఏపీలో 175/25 సీట్లకు బిఆర్ఎస్ పోటీ చేస్తుందని చెప్పుతున్నారు. ఏపీ ఒక్కటే కాదు… మహారాష్ట్రతో సహా ఇంకా పలు రాష్ట్రాలలో బిఆర్ఎస్ అన్ని స్థానాలలో పోటీ చేస్తుందని బల్లగుద్ది మరీ చెపుతున్నారు. తెలంగాణలో ఎన్నికలను ఎదుర్కోవడానికే బిఆర్ఎస్ వేలకోట్లు ఖర్చుపెట్టాల్సి ఉంటుంది. ఇతర రాష్ట్రాలలో కూడా పోటీ చేయాలంటే ఇంకెన్ని వేలకోట్లు ఉండాలి? కానీ చేసేందుకు సిద్దపడుతోందంటే అంత ఖర్చుకి సిద్దమేనని అర్దమవుతోంది కదా?అందుకే డబ్బు మూటలు పట్టుకొస్తున్న బిఆర్ఎస్ పార్టీని చూసిఇరుగు పొరుగు రాష్ట్రాలలో అన్ని పార్టీలు భయపడుతున్నాయని విజయశాంతి అన్నారనుకోవచ్చు.



