సాధారణంగా వీకెండ్స్ లో హైదరాబాద్ వంటి సిటీలలో సెలబ్రేషన్స్ కు కొదవుండదు. అందులో భాగంగా నగరం చుట్టూ విశాలంగా పరుచుకున్న ఔటర్ రింగ్ రోడ్డుపై సెలవు రోజైన ఆదివారం నాడు జనమంతా చేరిపోయి, ఆటపాటలతో సందడి చేస్తారు. ఓ పక్కన చిత్ర, విచిత్రమైన క్రీడలను జనాలు ఆడుకుంటుంటే… మరో పక్కన డీజేలు హోరెత్తించే పాటలకు కాలు కదుపుతూ హుషారెత్తిస్తారు. పిల్లలతో కలిసి అక్కడికి వచ్చే పెద్దలు చేస్తున్న ఈ సందడికి ‘రాహ్ గిరి’ అనే పేరు ఉంది. ఇటీవల రాహ్ గిరిలో పాలు పంచుకుంటున్న వారి సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది.
అయితే ఇదే సంస్కృతిని ఏపీకి సెంటర్ హబ్ విజయవాడ నగరం కూడా పుణికిపుచ్చుకుంటోంది. రాష్ట్ర విభజన తర్వాత విజయవాడ నవ్యాంధ్రకు పొలిటికల్ కేపిటల్ గా మారింది. ఇక శాశ్వత రాజధాని లేని నేపథ్యంలో ఆ నగరం రాష్ట్రానికి పాలనా కేంద్రంగానూ మారింది. ఎప్పుడైతే రాజధానిగా అనధికార హోదా వచ్చిందో… అప్పుడే ఆ నగరంలో మార్పులు వచ్చేశాయి. హైదరాబాద్ లో ‘రాహ్ గిరి’ తరహాలో బెజవాడలో ‘హ్యాపీ సండే’ ఎంట్రీ ఇచ్చింది.
ప్రతి ఆదివారం నగరంలోని బందరు రోడ్డులో నిర్వహిస్తున్న ‘హ్యాపీ సండే’లో జనం సందడి ఎక్కువవుతోంది. ‘రాహ్ గిరి’ కంటే కూడా హై ఓల్టేజీలో సంబరాలకు తెరలేపుతున్నారు. ఇందులో భాగంగా తాజాగా జరిగిన ‘హ్యాపీ సండే’లో నగరంలోని సిద్ధార్థ కాలేజీకి చెందిన అమ్మాయిలు విచ్చేసిన వారిలో సరికొత్త జోష్ పుట్టించారు. డప్పులు చేత పట్టుకుని చిందేసిన అమ్మాయిలు అక్కడికి పిల్లాపాపలతో వచ్చిన జనంలో ఉత్సాహాన్ని నింపారు.



