మరో నాలుగు రోజుల్లో ఎన్నికలు జరగనున్న తమిళనాడు రాష్ట్రంలో ఓట్లను కొనే ఉద్దేశంతో వివిధ పార్టీల అభ్యర్థులు కోట్లాది రూపాయలను ప్రజలకు పంచుతుంటే, డీఎండీకే అధినేత విజయకాంత్ మాత్రం, తన దారి వేరన్నట్టు ఆలయంలో ప్రమాణం చేసారు.
చెన్నైలోని లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి వచ్చిన విజయకాంత్… దేవుడి ఎదుట నిలబడి ఎట్టి పరిస్థితుల్లోనూ ఓట్లను కొనుగోలు చేయనని, ఇది తన శపథమని అన్నారు. ఆపై ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ, సమస్యలను పరిష్కరించేందుకు పంచె పైకెత్తి యుద్ధ రంగంలో దిగానని, తనను ఎవరూ కదిలించలేరని కాస్త ఆవేశంగానే ప్రసంగించారు.
విజయకాంత్ కు సంబంధించిన ప్రతిజ్ఞ వీడియో తాజాగా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. రాజకీయాల్లో ‘ఓటుకు నోటు’కు సర్వసాధారణమైపోయిన నేపధ్యంలో ఎవరైనా ఒక్కరైనా ఇలా ముందుకు రావాలని ఆశించిన నేపధ్యంలో విజయకాంత్ చేసిన ప్రమాణం ప్రజలపై ఏ మేరకు ప్రభావితం చూపుతుందో చూడాలి.



