అమ్మా భోజనాలు పెడతాం… వెనక్కు వచ్చి పెద్దాయన మాటలు వినండి!

vijaysai-reddy-nellore-campaign

నెల్లూరు నుంచి వైసీపి అభ్యర్ధిగా పోటీ చేయబోతున్న విజయసాయి రెడ్డి నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారానికి వెళ్ళినప్పుడు ఆయనకు చేదు అనుభవం ఎదురైంది. గురువారం ఉదయగిరి నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం చేయడానికి విజయసాయి రెడ్డి వెళ్ళినప్పుడు ఆయనను చూసి మహిళలు వెనక్కు తిరిగి వెళ్ళిపోయారు.

వారు వెళ్ళిపోతుంటే వాహనంలో విజయసాయి రెడ్డి పక్కనే ఉన్న మరో వైసీపి నేత మైక్ అందుకుని, “అమ్మా ఆగండి ఆగండి.. ఒకసారి వెనక్కు తిరిగి చూడండి. పెద్దాయన మాట్లాడుతుంటే అలా వెళ్ళిపోవద్దు. అందరూ దయచేసి వెనక్కు రండి. మీ అందరికీ భోజనాలు కూడా ఏర్పాటు చేశాము. పెద్దాయన చెప్పేది విన్నాక అందరూ భోజనాలు చేసి వెళ్ళండి,” అంటూ విజ్ఞప్తి చేశారు.

ADVERTISEMENT

వైసీపిలో జగన్మోహన్‌ రెడ్డి తర్వాత విజయసాయి రెడ్డి రెండు లేదా మూడో స్థానంలో ఉన్నారు. ఢిల్లీలో ఉన్నప్పుడు తరచూ ప్రధాని నరేంద్రమోడీతో భేటీ అయ్యి ఫోటోలు దిగుతుంటారు. ఎప్పుడైనా రాజ్యసభ ఛైర్మన్‌ రానప్పుడు విజయసాయి రెడ్డి రాజ్యసభ నడిపిస్తుంటారు కూడా.

అంతటి పెద్దాయన తమ గ్రామంలోకి వస్తే మహిళలు ఆయనని చూసి వెళ్ళిపోతుండటం గమనిస్తే నెల్లూరులో ఆయన పరిస్థితి ఏవిదంగా ఉందో, వైసీపి పట్ల ప్రజలలో ఎంత వ్యతిరేకత ఉందో అర్దమవుతుంది.

ఐదేళ్ళుగా జగన్మోహన్‌ రెడ్డి నెలనెలా బటన్ నొక్కి వారికి సంక్షేమ పధకాల పేరుతో లక్షల రూపాయలు ముట్టజెప్పుతున్నప్పటికీ వైసీపి నేతల సభలకు మహిళలు ఎందుకు మొహం చాటేస్తున్నారు? సంక్షేమ పధకాల లబ్ధిదారులను వాలంటీర్లతో ఒత్తిడి చేయించి బలవంతంగా సభలకు తీసుకువస్తున్నప్పటికీ, జగన్మోహన్‌ రెడ్డి మాట్లాడుతున్నా మద్యలో లేచి ఎందుకు వెళ్ళిపోతున్నారు?అని వైసీపి నేతలు ఆలోచిస్తున్నారో లేదో తెలీదు.

కానీ జగన్మోహన్‌ రెడ్డి ఇటీవల ఓ సభలో ఓ మాట అన్నారు. రాష్ట్రంలో 98 శాతం ప్రజలకు ‘మేలు’ చేశాము కనుక 50 శాతం మంది ప్రజలు మనవైపే ఉన్నారన్నారు.

రాష్ట్రంలో దాదాపు ప్రజలందరూ సంక్షేమ పధకాలతో లబ్ధి పొందినప్పుడు వారిలో 50 శాతం మంది మాత్రమే వైసీపి వైపు ఉన్నారని జగన్‌ స్వయంగా చెప్పారు. అంటే లబ్ధిదారులలో సగం మంది మాత్రమే వైసీపికి ఓట్లు వేస్తారని జగన్‌ అప్పుడే ఓ అంచనాకు వచ్చిన్నట్లున్నారు.

గమ్మతైన విషయం ఏమిటంటే, జగన్‌ ప్రభుత్వం ఈ ఐదేళ్లుగా ఇన్ని లక్షల కోట్లు పంచిపెట్టినా కేవలం 50 శాతం ప్రజలు మాత్రమే వైసీపికి మద్దతు ఇస్తుంటే, మిగిలిన 50 శాతం ప్రజలు ప్రతిపక్ష పార్టీలు ఏమీ చేయకుండానే వాటి వైపు ఉన్నారు… ఎందుకు?అని ఆలోచిస్తే ప్రజలు మార్పు కోరుకుంటున్నారని అర్దమవుతుంది. కానీ ఇది గ్రహించకుండా 175 సీట్లు మావే అని భ్రమలో ఉండాలనుకుంటే ఎవరు కాదంటారు?

ADVERTISEMENT
Latest Stories