ఈ ఎన్నికలలో కీర్తి శేషులు ఎవరో?

NRIs Vote

ఆంధ్రప్రదేశ్‌లో హత్యా రాజకీయాలు, భౌతిక దాడులు చాలా ఆందోళనకరంగా మారాయి. గత ఎన్నికలలో వైఎస్ వివేకా దారుణ హత్యకు గురయ్యారు. ఐదేళ్ళ తర్వాత నేటికీ అది ఎన్నికలలో చర్చాంశంగానే నిలిచి ఉంది.

ADVERTISEMENT

ఏపీ రాజకీయాలలో ప్రవేశించి కడప నుంచి కాంగ్రెస్‌ అభ్యర్ధిగా పార్లమెంట్‌కు పోటీ చేస్తున్న ముఖ్యమంత్రి సొంత చెల్లెలు వైఎస్ షర్మిల తన ప్రాణానికి ప్రమాదం ఉందని, భద్రత కావాలని పోలీసులను కోరడం రాష్ట్రంలో హత్య రాజకీయాలు ఏ స్థాయిలో ఉన్నాయో సూచిస్తున్నాయి.

తాజాగా సీబీఐ మాజీ జేడీ వివి లక్ష్మినారాయణ వైజాగ్ సిపి రవిశంకర్ అయ్యనార్‌ని కలిసి తనను హత్య చేసేందుకు కుట్ర జరుగుతున్నట్లు ఫిర్యాదు చేశారు.

ఆయన జైభారత్ నేషనల్ పార్టీ పెట్టుకొని, విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. ఒకవేళ ఆయన జనసేనలో ఉండి ఆ పార్టీ అభ్యర్ధిగా పోటీ చేస్తున్నట్లయితే ఆయన అనుమానాలను తేలికగా కొట్టిపడేయలేము. కానీ ఎవరికీ పెద్దగా తెలియని ఓ పార్టీ అభ్యర్ధిగా పోటీ చేస్తున్నారు. కనుక ఆయన ఎవరికీ పోటీ కూడా కాదనే చెప్పవచ్చు.

అక్రమ మైనింగ్ కేసు, ఆ కేసులో బెయిల్‌ కోసం న్యాయమూర్తికి లంచం ఇచ్చిన మరో కేసులో బళ్ళారికి చెందిన గాలి జనార్ధన్ రెడ్డి అని లక్ష్మినారాయణ తనను హత్య చేసేందుకు కుట్ర చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇప్పుడు ఆ కేసులపై చర్చను పక్కన పెడితే, ఈ ఎన్నికల సమయంలో ఎవరు ఎవరినైనా హత్య చేయించే అవకాశం ఉందనే విషయం ఆయన పిర్యాదుతో బయటపడింది. ఇది చాలా ఆందోళన కలిగించే విషయమే కదా?

జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ తనపై ‘బ్లేడ్ బ్యాచ్’ దాడులు చేస్తోందని స్వయంగా చెప్పారు. ఆయనను చంద్రబాబు నాయుడే లేపేసి ఆ నెపం వైసీపి వేసేసి ఎన్నికలలో లబ్ది పొందే ప్రయత్నం చేయవచ్చని వైసీపి సొంత మీడియా అనుమానం వ్యక్తం చేసింది.

ఇటీవలే జగన్మోహన్‌ రెడ్డి మీద ‘గులక రాయితో హత్యా ప్రయత్నం’ జరిగిన సంగతి తెలిసిందే. చంద్రబాబు నాయుడు, టిడిపి నేత బోండా ఉమా ఈ కుట్ర పన్నారని సిఎం జగన్‌ స్వయంగా ఆరోపించారు. చంద్రబాబు నాయుడు, నారా లోకేష్‌ మీద కూడా రాళ్ళ దాడులు జరిగాయి. ఇంకా జరిగినా ఆశ్చర్యం లేదు. కానీ వాటిని పోలీసులు హత్య ప్రయత్నాలుగా పరిగణించడం లేదు. అది వేరే విషయం.

కానీ ఏపీలో సిఎం జగన్మోహన్‌ రెడ్డి మొదలు చంద్రబాబు నాయుడు, నారా లోకేష్‌, పవన్‌ కళ్యాణ్‌, వైఎస్ షర్మిల, తాజాగా వివి లక్ష్మినారాయణ వరకు అందరూ తమకు ప్రాణహాని ఉందని చెపుతున్నారు. అంటే ఏపీలో హత్యా రాజకీయాలు జరుగుతున్నాయని ముఖ్యమంత్రితో సహా అందరూ ధృవీకరిస్తున్నారు. రాష్ట్రంలో ఇటువంటి ప్రమాదక పరిస్థితులు నెలకొని ఉన్నాయని ఇంత మంది చెపుతున్నప్పుడు మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ఎన్నికల కమీషన్‌, రాష్ట్ర ఎన్నికల సంఘం, పోలీస్ శాఖ ఎవరూ ఎందుకు స్పందించడం లేదు?

ADVERTISEMENT
Latest Stories