ఎన్నికల గంట మ్రోగే వరకు ఏపీలో బీజేపీ నేతల హడావుడి కనబడుతూనే ఉండేది. కానీ సీట్లు దక్కని సోము వీర్రాజు, పీవీఎన్ మాధవ్, జీవీఎల్ నరసింహారావు, విష్ణువర్ధన్ రెడ్డి వంటి పలువురు సీనియర్ నేతలు ఎన్నికల ప్రచార సమయంలోనే పెద్దగా కనబడలేదు.
కనుక ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి సొంత పార్టీ నేతలకంటే టిడిపి, జనసేన నేతలనే ఎక్కువగా నమ్ముకొని ఎన్నికల ప్రచారం చేసుకోక తప్పలేదు. బీజేపీ కోసం టిడిపి, జనసేనలు కొన్ని సీట్లు త్యాగాలు చేశాయి. వాటిని బీజేపీ గెలుచుకోలేకపోతే అవి వైసీపికి వెళ్ళిపోతాయి. కనుక టిడిపి, జనసేనలు దగ్గుబాటి పురందేశ్వరికి ఎన్నికల ప్రచారంలో పూర్తిసహాయ సహకారాలు అందించాయి.
కానీ పోలింగ్ ముందు రోజు వరకు కూడా కనబడిన ఏపీ బీజేపీ నేతలు ఆ తర్వాత ఎక్కడ కనపడటం లేదు! పోలింగ్ రోజు వరకు రాజకీయ పార్టీలు చురుకుగా ఉండటం సహజమే. కానీ ఈసారి పోలింగ్ ముగిసిన తర్వాత కూడా టిడిపి-వైసీపిలు పరస్పరం కత్తులు దూసుకుంటుండటం ఆశ్చర్యం కలిగిస్తుంది. వాటి పోరాటాల కారణంగా రాష్ట్రంలో యుద్ధ వాతావరణం నెలకొని ఉంది.
టిడిపి కూటమిలో బీజేపీ కూడా ఉన్నప్పటికీ ఆ పార్టీ నేతలెవరూ ఈ యుద్ధంలో కలుగజేసుకోవడం లేదు. కనీసం తమ పార్టీ గెలుపోటముల గురించి కూడా ఎవరూ మాట్లాడటం లేదు. టిడిపి, జనసేనలు ఎన్నికలలో గెలిచి తప్పకుండా అధికారంలోకి వస్తామని ధీమాగా మాట్లాడుతున్నప్పుడు, వాటితో పొత్తు పెట్టుకుని ఎన్నికలలో పోటీ చేసిన బీజేపీ మౌనంగా ఉండిపోవడం ఆశ్చర్యం, అనుమానం కలిగిస్తోంది.
అంటే పట్టుపట్టి టిడిపి, జనసేనల నుంచి తీసుకున్న సీట్లలో గెలుస్తామనే నమ్మకం లేకపోవడం వలనేనా?లేదా ఇప్పుడే వైసీపి గురించి నోరు జారితే రేపు ఒకవేళ వైసీపి ఎక్కువ ఎంపీ సీట్లు గెలుచుకుంటే కేంద్ర ప్రభుత్వం ఏర్పాటుకి దాని మద్దతు అవసరం ఉంటుందనే దూరాలోచనతోనే ఈ యుద్ధాలను దూరంగా ఉంటోందా? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.
ఒకవేళ టిడిపి, జనసేనలు రెండూ గెలిచి, బీజేపీ ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా గెలుచుకోలేకపోతే సంకీర్ణ ప్రభుత్వంలో బీజేపీకి చోటు లభిస్తుందో లేదో?అనే అనుమానం కూడా ఏపీ బీజేపీ నేతలలో ఉండే ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ పోలింగ్ పూర్తవగానే ఏపీలో బీజేపీ హటాత్తుగా మాయం అయిపోవడం మంచి సంకేతం కాదనే చెప్పాలి.






