గత ఎన్నికలలో భారీ మెజార్టీతో ‘ఒక్క ఛాన్స్’ కొట్టేసిన జగన్, ఈసారి ఎన్నికలలో బోర్లాపడటం ఆశ్చర్యకరమే. తనను ఎవరో మోసం, అన్యాయం చేశారని జగన్ చెప్పుకున్నారు. ఆ ‘ఎవరో’ మరెవరో కాదు రాష్ట్ర ప్రజలే.
గుర్రాని చెరువు వరకు తీసుకువెళ్ళవచ్చు కానీ దాని చేత నీళ్ళు తాగించలేమన్నట్లు, ‘నువ్వే మా నమ్మకం… మా భవిష్యత్’ అని జగన్ ప్రజల చేత బలవంతంగా అనిపించగలిగారు కానీ నమ్మించలేకపోయారు.
సంక్షేమ పధకాల పేరుతో లక్షల కోట్లు అప్పులు తెచ్చి పంచిపెట్టేస్తూ ‘175 సీట్లు మాకే’ అని జగన్ అనుకున్నారే కానీ ‘మీకే’ అని లబ్ధిదారులు అనకపోవడం వలననే ఓడిపోయారు. అంటే జగన్ తనను తాను మోసం చేసుకుంటూ, పార్టీ నేతలను కూడా మోసగించారని అనుకోవచ్చు.
ముఖ్యంగా సంక్షేమ పధకాల పేరుతో డబ్బు అందుకున్న రాష్ట్రంలోని మహిళలందరూ తనకే గంపగుత్తగా ఓట్లు వేసేస్తారని జగన్ అనుకున్నారు. అందుకే ‘సైలంట్ ఓటింగ్’ జరిగిందని సజ్జల రామకృష్ణా రెడ్డి వంటివారు చెప్పుకున్నారు. ఆయన చెప్పిన్నట్లే సైలంట్ ఓటింగే జరిగింది కానీ వైసీపికి వ్యతిరేకంగా! కనుక జగన్‌ని మోసం చేసినవారి జాబితాలో రాష్ట్రంలో మహిళలు కూడా ఉన్నారు.
జగన్‌ని మోసం చేసినవారిలో ప్రధాని మోడీ కూడా ఉండే ఉంటారు. ఎందుకంటే, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్ళి మోడీని కలిసి పొత్తుల గురించి మాట్లాడుకొని వచ్చిన మర్నాడే జగన్ కూడా హడావుడిగా ఢిల్లీ వెళ్ళి ప్రధాని నరేంద్రమోడీని కలిశారు. ఆ తర్వాత కొన్ని రోజుల వరకు టిడిపితో పొత్తు విషయం తేల్చకుండా టిడిపి-వైసీపిల మద్య ఊగిసలాడుతున్నట్లు ఉండిపోయారు. కానీ చివరికి టిడిపివైపే మొగ్గు చూపారు.
అప్పటి నుంచే ఏపీలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల మార్పులు చేర్పులు, ఈసీ, రాష్ట్ర ఎన్నికల సంఘం ధోరణిలో మార్పులు మొదలయ్యాయని సజ్జల రామకృష్ణా రెడ్డి చెప్పుకున్నారు. కనుక మోడీ తమకు హ్యాండ్ ఇచ్చారని బయటకు చెప్పుకోలేక ఎవరో తమని అన్యాయం చేశారని జగన్ చెప్పుకున్నట్లు భావించవచ్చు.
జగన్‌ని మోసం చేసిన జాబితాలో ముఖ్యంగా సజ్జల రామకృష్ణా రెడ్డి, ఐప్యాక్ టీమ్, ఇంటలిజన్స్ అధిపతి పిఎస్ఆర్ ఆంజనేయులు తదితరులున్నారు. వారందరూ జగన్ నిర్ణయాలు తప్పని, వాటి వలన ప్రజలలో వ్యతిరేకత పెరుగుతోందని, ఆ వ్యతిరేకతలో వైసీపి మునిగిపోబోతోందని తెలిసి ఉన్నా చెప్పకుండా దాచిపెట్టి జగన్‌కు శల్యసారధ్యం చేశారు.
అలాగే జగన్ భజన చేస్తూ తప్పు ద్రోవ పట్టించినవారిలో విజయసాయి రెడ్డి, అంబటి రాంబాబు, గుడివాడ అమర్నాథ్, రోజా తదితర మంత్రులున్నారు.
భూకబ్జాలు, మాఫియాలతో కొందరు, బూతులతో మరికొందరు, రాసలీలలతో మరికొందరూ ఇలా వైసీపిలో ప్రతీ ఒక్కరూ ఉడతా భక్తిగా జగన్ కొంప ముంచేసి, సామూహిక రాజకీయ ఆత్మహత్య చేసుకున్నారని చెప్పక తప్పదు.
జగన్‌ని మోసగించినవారి జాబితాలో తల్లి విజయమ్మ, చెల్లి వైఎస్ షర్మిల చనిపోయిన వివేకానంద రెడ్డి కూడా ఉండటం విశేషమే. వారు కూడా ఆయనను ఓటమికి కారణమయ్యారు.
చివరిగా చెప్పుకోవలసిన మాట: జగన్ ఇలా ప్రతీ ఒక్కరినీ మోసం చేశారు. కనుక అందరూ ఆయనను మోసం చేసి ఓడించారు. కనుక బాకీ చెల్లు!






