కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇటీవల విశాఖలో పర్యటించినప్పుడు ఏపీలో అవినీతి, అరాచకం తాండవిస్తోందని అన్నప్పుడు వైసీపీ నేతలందరూ గగ్గోలు పెట్టారు. చంద్రబాబు నాయుడు వ్రాసిచ్చిన స్క్రిఫ్ట్‌నే అమిత్ షా చదివారని, టిడిపి ఉచ్చులో బిజెపి చిక్కుకొందని వాదించారు.
అయితే అమిత్ షా ఆ వ్యాఖ్యలు చేసి వెళ్ళిన రెండు రోజులకే విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కుమారుడు శరత్, ఆయన భార్య జ్యోతి, వారి కుటుంబ స్నేహితుడు, ఆడిటర్ గన్నమనేని వెంకటేశ్వరరావు (జీవీ)లను కొందరు దుండగులు కిడ్నాప్ చేసి, రెండు రోజులపాటు దారుణంగా హింసించారు.
వారి నుంచి బలవంతంగా రూ.1.75 కోట్లు, వారి ఇంట్లో, వారి ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలు దోచుకొన్నారు. రెండు రోజులపాటు వారిని ఋషికొండలోని ఎంపీ కుమారుడు శరత్ ఇంట్లోనే బందించి తమ అధీనంలో ఉంచుకొని చిత్రహింసలు చేశారు. చివరికి హైదరాబాద్‌లో ఉన్న ఎంపీ ఎంవీవీ సత్యనారాయణకు ఎందుకో అనుమానం కలిగి విశాఖ పోలీస్ కమీషనర్ త్రివిక్రమ్ వర్మకు ఫోన్ చేసి వారి ఆచూకీ తెలుసుకోవాలని కోరారు. అప్పుడే ఈ కిడ్నాప్ కధ వెలుగులోకి వచ్చింది!
పోలీసులు వెంటనే రంగంలో దిగి వారి ముగ్గురి ఫోన్లు ట్రాకింగ్ చేస్తూ వారిని పట్టుకొనేందుకు బయలుదేరారు. కిడ్నాపర్లకు కూడా పోలీసులు తమ ఉనికిని గుర్తించి ఉండవచ్చని అనుమానం కలగటంతో, వారు ముగ్గురినీ శరత్ వాడే ఆడీ కారులోనే బందించి పద్మనాభం మీదుగా విజయనగరం వైపు బయలుదేరారు.
కానీ అప్పటికే పోలీసులు వారి ఫోన్లను ట్రాకింగ్ చేస్తుండటంతో వారిని వెంటాడుతూ పద్మనాభం సమీపంలో అడ్డగించి నిందితులను పట్టుకొన్నారు. అయితే జ్యోతీ, శరత్, జీవీలను దారిలోనే బాకురుపాలెం వద్ద విడిచిపెట్టేశామని కిడ్నాపర్లు చెప్పడంతో పోలీసులు అక్కడకు చేరుకొని వారిని కమీషనర్ కార్యాలయానికి తరలించారు.
పోలీసులు బాధితులను కాపాడారు… కిడ్నాపర్లను పట్టుకొన్నారు. కధ సుఖాంతం అయ్యింది. అయితే ఈ మొత్తం వ్యవహారం ఏపీలో అరాచక పరిస్థితులు నెలకొని ఉన్నాయని ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు నిజమే అని మరోసారి ధృవీకరించింది కదా?కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ఏపీలో పరిస్థితులు తెలుసుగాబట్టే ఆమాట అని ఉండవచ్చు. కానీ ఆయనకి కూడా చంద్రబాబు నాయుడే స్క్రిప్ట్ వ్రాసి ఇచ్చారంటే జనాలు నవ్వరా?



