ఏపీ శాసనసభ, లోక్‌సభ ఎన్నికలలో 81.6 శాతం పోలింగ్ నమోదైనందని రాష్ట్ర ఎన్నికల సంఘం సీఈవో ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. దానిలో 1.10 శాతం పోస్టల్ బ్యాలట్ ద్వారా జరిగిందని చెప్పారు.
2014లో టిడిపి, జనసేన, బీజేపీల ప్రభంజనంలో 78.90 శాతం, 2019 వైసీపి ప్రభంజనంలో 79.80 శాతం పోలింగ్ నమోదు కాగా ఈసారి మరో 1.8 శాతం పెరిగింది.
ఇరుగు పొరుగు రాష్ట్రాలు, విదేశాల నుంచి కూడా భారీ సంఖ్యలో ఓటర్లు ఏపీకి తరలివచ్చి ఓట్లు వేసినందునే 1.8 శాతం అధికంగా పోలింగ్ జరిగిందని చెప్పవచ్చు. అలా వచ్చిన ప్రతీ ఒక్కరూ వైసీపికి, జగన్ పాలనకు వ్యతిరేకంగా ఓట్లు వేసేందుకు వచ్చారని వేరే చెప్పక్కరలేదు.
గత ఎన్నికలలో కూడా ఇలాగే అర్దరాత్రి వరకు ఓటర్లు క్యూలైన్లో నిలబడి ఓట్లు వేస్తున్నప్పుడు వారందరూ టిడిపికే వేస్తున్నారని ఆ పార్టీ నేతలు చెప్పుకున్నారు. కానీ పెరిగిన ఓటింగ్ వైసీపికి లబ్ధి కలిగించింది. అదేవిదంగా ఇప్పుడు కూడా పెరిగిన ఓటింగ్ కూటమికి లబ్ధి కలిగించబోతోంది.
పోలింగ్ శాతం పెరిగితే మాకే మంచిదని వైసీపి చెప్పుకుంటున్నప్పటికీ, అవన్నీ ప్రభుత్వ వ్యతిరేక ఓట్లే అని వైసీపికి కూడా తెలుసు. అందుకే కొన్ని ప్రాంతాలలో కూటమికి ఓట్లు వేసిన ప్రజలపై కూడా వైసీపి కార్యకర్తలు దాడులకు తెగబడ్డారు.
పోలింగ్ తర్వాత ఏపీలో జరుగుతున్న అల్లర్లు కూడా వైసీపి నేతలలో ఓటమి భయం, ఆందోళనలనే సూచిస్తున్నాయి. అయితే మరో 20 రోజుల తర్వాత తమకు ఈ పదవులు, అధికారం ఏవీ ఉండకపోగా, టిడిపి, జనసేన, బీజేపీల ప్రభుత్వం తమపై ప్రతీకార చర్యలకు పాల్పడుతుందనే భయం, ఆందోళన కూడా తోడవడంతో వైసీపి నేతలు ఉన్మాదుల్లా మారి దాడులకు ప్రోత్సహిస్తున్నట్లు భావించవచ్చు.
కానీ చివరి ఈ 20 రోజులలో వారు చేస్తున్న ఈ అరాచకాలకు ఇంకా భారీగా మూల్యం చెల్లించాల్సివస్తుందని మరిచిపోతున్నారు.
రాష్ట్రంలో పలు జిల్లాలలో శాంతి భద్రతల పరిస్థితి అదుపు తప్పుతుంటే, ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ నియంత్రించాల్సిన ఏపీ సిఎం జగన్మోహన్ రెడ్డి విదేశీ యాత్రలకు బయలుదేరి వెళ్ళిపోతున్నారు. కనీసం తమ వైసీపి నేతలను నియంత్రించే ప్రయత్నం చేయలేదు. కనీసం వీటిపై స్పందించలేదు కూడా.
పోలింగ్ పూర్తయిపోయింది కనుక ఈసీ కూడా తన బాధ్యత పూర్తయిపోయిందన్నట్లే వ్యవహరిస్తున్నట్లే ఉండి. కనుక రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా అదుపు తప్పకుండా ఉంచాలంటే, గవర్నర్ జోక్యం చేసుకొని ప్రభుత్వ పగ్గాలను తన చేతిలోకి తీసుకొని నియంత్రించక తప్పదేమో?




