మారాల్సింది ఎవరు? చంద్రబాబా… జగనా?

ys-jagan-chandrababu-naidu

ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు 2014, 2019,2024 మూడుసార్లు కూడా సంచలనమైన తీర్పులే ఇచ్చారు. ప్రతీ తీర్పుతో తమ అభిప్రాయాలు చాలా స్పష్టంగానే చెపుతున్నారు. కానీ ప్రజల తీర్పుని రాజకీయ పార్టీలే అర్దం చేసుకోలేకపోతున్నాయా? అనే సందేహం కలుగుతుంది.

తమ అభీష్టానికి విరుద్దంగా రాష్ట్ర విభజన చేసినందుకు 2014లో ప్రజలు కాంగ్రెస్‌ పార్టీని నామరూపాలు లేకుండా తుడిచిపెట్టేశారు. అదే సమయంలో తమ ఆకాంక్షలను చంద్రబాబు నాయుడు మాత్రమే అర్ధం చేసుకోగలరని, ఆయనకు మాత్రమే ఆంధ్రప్రదేశ్‌ని గాడిన పెట్టగల సామార్ధ్యం ఉందని గట్టిగా నమ్మి అధికారం కట్టబెట్టారు.

ADVERTISEMENT

ఆయన అందుకు అనుగుణంగానే వెళ్ళినా, చివరిలో రాజకీయంగా కొన్ని తప్పటడుగులు, ఆ తర్వాత కొన్ని అనూహ్యమైన రాజకీయ సమీకరణాల వలన అధికారం కోల్పోయారు.

2019లో ప్రజలు చంద్రబాబుని కాదని జగన్‌కు పూర్తి మెజార్టీతో అధికారం కట్టబెట్టారు. అది దేనికో ఆయన చివరి వరకు కూడా గ్రహించలేదు. ఆ ఒక్క ఛాన్స్ విలువ ఆయన అర్దం చేసుకోకుండానే కుర్చీలో నుంచి దిగిపోయారు.

నాడు చంద్రబాబు నాయుడుని, పవన్‌ కళ్యాణ్‌ని కాదనుకున్న ప్రజలే ఈసారి అఖండ మెజార్టీతో గెలిపించి అధికారం అప్పగించారు. కాంగ్రెస్ పార్టీ విషయంలో తమ వైఖరిలో ఎటువంటి మార్పు లేదని మరోసారి స్పష్టం చేశారు.

కనుక ఓ దారుణమైన ఓటమి, రెండు ఘనవిజయాల తర్వాత టిడిపి, చంద్రబాబు నాయుడులో ఏమైనా మార్పులు ఉంటాయా? ఓ విజయం, రెండు ఓటములను చవి చూసినందున వైసీపిలో, దాని అధినేత జగన్‌లో ఏమైనా మార్పు వస్తుందా? అసలు ఇద్దరిలో ఎవరు మారాలి?

జగన్మోహన్‌ రెడ్డి: 2014 ఎన్నికలలో ఓటమి తర్వాత జగన్‌ క్రుంగిపోకుండా తన పార్టీలో లోపాలను, బలహీనతలను సరిదిద్దుకొని, పార్టీని బలోపేతం చేసుకున్నారు. చంద్రబాబుని ఎలాగైనా గద్దె దించి తాను ఆ కుర్చీలో కూర్చోవాలనే ఏకైక లక్ష్యంతో ఆయన శత్రువులను మిత్రులుగా చేసుకొని పోరాడి విజయం సాధించారు.

కానీ ఈసారి ఓటమి నుంచి పాఠాలు నేర్చుకొని, చేసిన తప్పులను ఒప్పుకొని, జరిగిన లోపాలను సరిదిద్దుకొని హుందాగా ప్రజాతీర్పుని అంగీకరించి ఉండాలి. కానీ సరిడ్డుకునే ఆలోచన చేయకపోగా ‘కళ్ళు మూసుకుంటే 5 ఏళ్ళు ఇట్టే గడిచిపోతాయి. మళ్ళీ మనమే అధికారంలోకి వస్తామంటూ’ పార్టీ నేతలను, కార్యకర్తలను ఇంకా మభ్యపెడుతున్నారు.

జగన్‌ భవిష్యత్తే ఆగమ్యగోచరంగా కనిపిస్తున్నప్పుడు, ఆయన తన పార్టీకి, రాష్ట్ర ప్రజలకు భరోసా ఇస్తానని చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉంది.

చంద్రబాబుని జగన్‌ జైల్లో పెడితే, నారా లోకేష్‌, భువనేశ్వరి, బ్రాహ్మిణి, నందమూరి బాలకృష్ణ, ఇంకా చాలా మంది టిడిపి నేతలు ధైర్యంగా పోరాడారు. కానీ రేపు జగన్‌ జైలుకి వెళితే వైసీపిని ఎవరు నడిపిస్తారు? అంటే ఆయన సతీమణి భారతి ఒక్కరే కనిపిస్తున్నారు. కానీ ఆమెకు అంత శక్తి ఉందా? ఆమెను ప్రజలు అంగీకరిస్తారా?అంటే అనుమానమే.

కనుక వైసీపి మళ్ళీ గాడిన పడాలనుకుంటే, ఆనాడు వైఎస్సార్ తనను తాను సమూలంగా మార్చేసుకున్నట్లు జగన్‌ కూడా తనని తాను సమూలంగా మార్చుకోగలగాలి.

నారా లోకేష్‌ ఆవిదంగా తనని తాను మార్చుకొని విజయం సాధించి అందరి మన్ననలు అందుకుంటున్నారు. కానీ అహంభావం నరనరాన్న ఉన్న జగన్‌ మారగలరా? అంటే అనుమానమే. ఆయన మారలేకపోతే వైసీపి భవిష్యత్‌ ‘మరోలా’ మారిపోతుంది.

చంద్రబాబు నాయుడు విషయానికి వస్తే ఆయన ఎప్పుడూ తన తప్పులు, లోపాలు, బలహీనతలు, సమస్యల, సవాళ్ళు అన్నిటి నుంచి పాఠాలు నేర్చుకొంటూనే ఉంటారు. ఎప్పటికప్పుడు తనను తాను మార్చుకుంటూనే ఉన్నారు. ఇదే ఆయన విజయ రహస్యం.

గతంలో తమను వ్యతిరేకించిన జనసేనతో, తాము తీవ్రంగా వ్యతిరేకించి, విమర్శించిన మోడీతోనే రాజీపడి పొత్తులు కుదుర్చుకోవడమే ఇందుకు చక్కటి నిదర్శనం. దీనిని జగన్‌ అవకాశవాదం అని పేరు పెట్టినప్పటికీ, ఓ లక్ష్యం కోసం మార్పుగా అభివర్ణించవచ్చు.

ఇక రాష్ట్రాభివృద్ధి ముఖ్యంగా అమరావతి, పోలవరం విషయంలో చంద్రబాబు నాయుడుకి ప్రజల ఆకాంక్షలు బాగా తెలుసు. నిజానికి ఈ రెండు కూడా ఆయన డ్రీమ్ ప్రాజెక్టులే. కానీ మరో 5 ఏళ్ళ తర్వాత ఆరోగ్యం, రాజకీయ పరిస్థితులు ఏవిదంగా ఉంటాయో తెలీదు. కనుక ఈసారి ఎన్ని ఆటుపోటులు ఎదురైనా ఆగకుండా శరవేగంగా నిర్మాణ పనులు జరిపిస్తూ వచ్చే ఎన్నికలలోగా దాదాపుగా అయినా పూర్తి చేసి చూపాల్సి ఉంటుంది.

ఇక రాజకీయంగా చూస్తే చంద్రబాబు నాయుడులో మరికొంత మార్పు అవసరమే అనిపిస్తుంది. గతంలో జగన్మోహన్‌ రెడ్డి సంగతి తెలిసి కూడా చాలా ఉపేక్షించి దానికి చాలా భారీ మూల్యం చెల్లించారు. కనుక ఈసారి జగన్, వైసీపి విషయంలో కటినంగానే వ్యవహరించే అవకాశం ఉంది.

ముఖ్యంగా చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నప్పుడు టిడిపి ఎంత బలహీనంగా కనపడిందో గుర్తుంచుకొని, భవిష్యత్‌లో ఎటువంటి క్లిష్ట పరిస్థితులు ఎదురైనా పార్టీ వాటిని తట్టుకొని ఎదురొడ్డి పోరాడేలా తీర్చి దిద్దుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది.

వచ్చే ఎన్నికల నాటికి మళ్ళీ ఎటువంటి సమస్యలు, సవాళ్ళు, కొత్త శత్రువులు పుట్టుకొస్తారో తెలీదు. కనుక ఇప్పటి నుంచే టిడిపిని మరింత బలోపేతం చేసుకోవలసి ఉంటుంది. కనుక చంద్రబాబు నాయుడు రాజకీయాలలో, పార్టీ వ్యవహారాలలో కూడా నిష్కర్షగా వ్యవహరించక తప్పదు.

ADVERTISEMENT
Latest Stories