మన దేశంలో జరిగే ఇటువంటి విచిత్రాల గురించి అందరికీ తెలుసు.. ప్రతీ రోజూ చూస్తూనే ఉంటారు. ఓ ఉద్యోగం కోసం కనీస అర్హతలు, జ్ఞానం, అనుభవం వంటివన్నీ కావాలి. పరీక్ష లేదా ఇంటర్వ్యూలో పాస్ అవ్వాలి.
ఉద్యోగంలో చేరాక ప్రతీరోజూ క్రమం తప్పకుండా డ్యూటీకి హాజరుకావాలి. డ్యూటీలో సమర్ధంగా పని చేయాలి. దానిని బట్టి వారికి ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు ఉంటే ఉంటాయి… లేకుంటే లేదు.
ప్రభుత్వోద్యోగి అయితే 60-62 ఏళ్ళకు, ప్రైవేట్ ఉద్యోగులైతే కాస్త ముందో వెనుకో ఉద్యోగంలో నుంచి తప్పుకుంటారు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అంతటా ఇదే ఫార్ములా అమలులో ఉంది.
కానీ మన రాజకీయ నాయకులు ఈ ఫార్ములాకు అతీతులు! చాలా పదవులకు కనీస అర్హత, వయోపరిమితి, అనుభవం ఏదీ అవసరం ఉండదు. ఎన్నికలలో పోటీ చేసి గెలిస్తే చాలు!
శాసనసభ లేదా మంత్రివర్గ సమావేశాలకు తప్పనిసరిగా హాజరుకావలసిన ఆవసరం కూడా ఉండదు. హాజరు కాకపోయినా వారికి నెల నెలా లక్షల రూపాయల జీతభత్యాలు ముడుతూనే ఉంటాయి.
ఉద్యోగుల జీతాలను వారి పై అధికారులు లేదా సదరు సంస్థ యాజమాన్యం మాత్రమే పెంచగలదు. కానీ ప్రజా ప్రతినిధులుగా ఎన్నికైనవారు వారికి వారే (అంటే అధికార పార్టీ) జీత భత్యాలు పెంచేసుకోగలరు. ఎంత పెంచుకోవాలో కూడా వారికి వారే నిర్ణయించుకునే వెసులుబాటు ఉంది.
ఒక ప్రభుత్వోద్యోగి కనీసం 30 సంవత్సరాలు పని చేసి పదవీ విరమణ చేస్తేనే పెన్షన్ లభిస్తుంది. కానీ మన ప్రజాప్రతినిధులు ఒక్కసారి ఎన్నికైతే చాలు జీవితాంతం పెన్షన్ వస్తుంది. ప్రతీ ఎన్నికతో అది కూడా పెరుగుతుంటుంది.
ఒక ఉద్యోగి సమర్దంగా పనిచేయడం చాలా ముఖ్యం. కానీ మన ప్రజా ప్రనిధులకు మినహాయింపు ఉంటుంది. పని చేయక్కర లేదు. చేసినా చెయకపొయినా ఎవరికీ జవాబుదారి కారు. కానీ జీతభత్యాలు అందుకుంటూనే ఉంటారు.
సగటు ఉద్యోగి పరిస్థితి ఈవిదంగా ఉంటే రైతుల పరిస్థితి ఇంకా అద్వానంగా ఉంటుంది. అప్పులు చేసి రేయింబవళ్ళు కష్టపడి చెమటోడ్చి పండించిన పంటని, ఇంతకు అమ్ముకోవాలో నిర్ణయించుకునే అధికారం వారికి ఉండదు. దళారులు, వ్యాపారులు, ప్రభుత్వాలు నిర్ణయిస్తాయి. గిట్టితే అమ్ముకోవాలి లేకుంటే కాలువలో పారబోసుకోవాలి… వేరే దారి లేదు!
కోడి బ్రతికి ఉన్నప్పటి కంటే చనిపోయి చికెన్ బిర్యానీగా మారినప్పుడే దాని విలువ పెరిగినట్లు, రైతులు బ్రతికి ఉన్నప్పుడు వారి విలువ ‘జీరో’గా ఉంటుంది. కానీ అప్పులు బాధలు భరించలేక ఆత్మహత్య చేసుకుంటే వారి ప్రాణం ఖరీదు కనీసం రూ.5-6 లేదా 10 లక్షల వరకు ఉంటుందని ప్రభుత్వాలే లెక్కగట్టి ఇస్తుంటాయి.
ఇలా ఓ రాజకీయ నాయకుడు లేదా ప్రజా ప్రతినిధితో పోలిస్తే దేశంలో సామాన్యుల జీవితాలన్నీ శనగకాయల వంటివే. వాటికి ఎన్నికలప్పుడు తప్పితే మిగిలిన సమయంలో పెద్దగా విలువ ఉండదు!
కానీ భారతీయులు ఇవన్నీ చాలా సహజంగానే భావిస్తుంటారు. కనుక ఎవరూ బాధపడరు. వారిని దైవాంశ సంభూతులుగానే పరిగణిస్తుంటారు. కనుక పూర్వజన్మ సుకృతం ఉంటే తప్ప ఎవరూ రాజకీయ నాయకులు కాలేరు! అని మరో లైన్ కూడా జోడించుకుంటే ఇక ఎన్నడూ ఏ రాజకీయ నాయకుడిని మనం విమర్శించవలసిన అవసరం కూడా ఉండదు.







