నాడు ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సమయంలో ఇటు రాష్ట్ర స్థాయి నాయకుల నుంచి అటు జాతీయ స్థాయి నేతల వరకు అలాగే తెలంగాణ గల్లీ నుండి అటు ఢిల్లీ గల్లీ వరకు ఉద్యమ స్ఫూర్తి తో కథం తొక్కిన కేసీఆర్ నేడు పార్టీ ఓటమితో ఫామ్ హౌస్ గడప దాటి కాలు బయటపెట్టలేకపోతున్నారా.? అన్న చర్చ విస్తృతంగా నడుస్తుంది.
రాష్ట్ర అసెంబ్లీ నుంచి దేశ పార్లమెంట్ వరకు కేసీఆర్ పోరాటాలు, బిఆర్ఎస్ త్యాగాలు నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ని రెండు ముక్కలు చేయగలిగింది. ఇక తన వాక్ చాతుర్యం తో, రాజకీయ చాణిక్యంతో ఇటు తెలంగాణ సమాజాన్ని తట్టి లేపిన కేసీఆర్ అలాగే అటు కేంద్రం మెడలు వచ్చి అనుకున్నది సాధించగలిగారు.
ఇక తెలంగాణలో పురుడు పోసుకుని, తెలంగాణను శాసించిన టీడీపీ ని తన ప్రాంతీయవాద రాజకీయంతో అదే తెలంగాణలో కనుమరుగు చేయగలిగారు. అలాగే ఇటు తెలంగాణ ను ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటించిన కాంగ్రెస్ ను సైతం తన రాజకీయ చాకచక్యంతో దశాబ్దం పాటు పాతాళానికి తొక్కగలిగారు.
అయితే నాడు తన చుట్టూ ఉన్న ప్రతికూల పరిస్థితులను సైతం తనకు, తన పార్టీకి అనుకూలంగా మార్చుకోగలిగిన కేసీఆర్ నేడు తన పార్టీకి అనుకూలంగా ఏర్పడుతున్న పరిస్థితులను సైతం నిలబెట్టుకోలేని నిస్సహాయుడిగా మిగిలారా.? అయితే ప్రస్తుతం తెలంగాణలో బిఆర్ఎస్ పరిస్థితి చూస్తే అవుననే సమాధానమే వినిపిస్తుంది.
గతంలో ప్రత్యేక తెలంగాణ ప్రకటిస్తే బిఆర్ఎస్ ను కాంగ్రెస్ లో విలీనం చేస్తాను అంటూ సోనియా గాంధీ ని నమ్మించగలిగిన కేసీఆర్ చివరికి అదే కాంగ్రెస్ ను పదేళ్ల పాటు తెలంగాణలో నామరూపాలు లేకుండా చేయగలిగారు. మరి నేడు బిఆర్ఎస్, బీజేపీ లో విలీనం కాబోతుంది, కాంగ్రెస్ తో పొత్తుకు సిద్దమయ్యింది అనే పరిస్థితిలో బిఆర్ఎస్ క్యాడర్ ను నిలబెట్టారు.
నాడు బిఆర్ఎస్ కు వ్యతిరేకంగా ఏ ఒక్క రాజకీయ నాయకుడు గళం విప్పినా అది తెలంగాణ సమాజానికి వ్యతిరేకమని, అతను తెలంగాణ ద్రోషి అంటూ ప్రత్యర్థి పార్టీల నేతల మీద విరుచుకుపడిపోయిన కేసీఆర్ ఇప్పుడు తన సొంత కూతురు కవిత ఆరు మాసాలు తీహార్ జైల్లో ఉన్నప్పటికీ నోరు విప్పలేకపోయారు.
అలాగే తన కుమార్తే బిఆర్ఎస్ ఉంటే ఎంత పొతే ఎంత అంటూ పార్టీ ఉనికినే ప్రశ్నించే స్థాయికి వచ్చినా కేసీఆర్ తన మౌనం వీడలేకపోతున్నారు. కేటీఆర్ పై ఫోన్ టాపింగ్ ఆరోపణలు వెల్లువెత్తినా, ఈ ఫార్ములా కేసులు నెత్తిన పడినా కేసీఆర్ మాత్రం మిన్నకుండిపోతున్నారు.
చివరికి కాళేశ్వరం లో అవినీతి అంటూ రేవంత్ సర్కార్ కేసీఆర్ పై సీబీఐ విచారణకు ఆదేశించినా కేసీఆర్ నుంచి ఎటువంటి స్పందన కనిపించలేదు. ఇక ఈ ఏడాది సంక్రాంతి తరువాత కేసీఆర్ ప్రజా క్షేత్రంలోకి వస్తున్నారు, కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల పై ప్రభుత్వాన్ని నిలదీయడానికి సిద్ధమయ్యారు అంటూ బిఆర్ఎస్ నానా హంగామా చేసినా అవి కేవలం ప్రకటనకు మాత్రమే పరిమితమయ్యాయి.
హైడ్రా తో బిఆర్ఎస్ కు అందివచ్చిన అవకాశాన్ని కూడా కేసీఆర్ అందిపుచ్చుకోలేకపోయారు. కనీసం ఇటు పార్టీ నాయకులకు కానీ పార్టీ క్యాడర్ కు కానీ అందుబాటులో లేకుండా కేసీఆర్ అజ్ఞాత జీవితాన్ని గడుపుతున్నారు. ఇక తాజాగా తెలంగాణలో మొదలైన జూబ్లీహిల్స్ ఉపఎన్నిక తంతులో కూడా కేసీఆర్ జాడ కనిపించడం లేదు.
అటు రాష్ట్ర అసెంబ్లీకి రాక, ఇటు ప్రజాక్షేత్రంలో లేక, పార్టీ బాధ్యతలు పట్టించుకోక కేసీఆర్ తెలంగాణ రాజకీయాల నుంచి అంచలంచెలుగా కనుమరుగవుతున్నారు. 2019 ఎన్నికల సమయంలో తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను కూడా రిటర్న్ గిఫ్ట్ తో శాసించగలిగిన కేసీఆర్ ఇప్పుడు కనీసం తన పార్టీ నేత ఆకస్మిక మరణంతో సంభవించిన ఉపఎన్నికలను సైతం రూల్ చేయలేకపోతున్నారు.
కేసీఆర్ లో వచ్చిన ఈ రాజకీయ శూన్యత, నిస్సహాయతో మొదలయ్యిందా.?ఓటమితో వచ్చిందా.? లేక పార్టీలో మొదలైన కుటుంబ సభ్యుల అంతర్గత పోరాటాల ఫలితామా.? లేక వయస్సుతో వస్తున్న ఆరోగ్య సమస్యలే కేసీఆర్ ను గడప దాటనివ్వడం లేదా.? ఇలా కేసీఆర్ మౌనం వెనుక ఎన్నో ప్రశ్నలు తెలంగాణ రాజకీయాలను వేధిస్తున్నాయి. మరి వాటికీ సమాధానం దొరికేదెప్పుడు.?




