బిఆర్ఎస్ నుంచి అధికారిక సస్పెన్షన్ తో బయటకొచ్చిన కవిత ను వైసీపీ నుండి అనధికారికంగా బయటకు పంపబడ్డ షర్మిలతో సరిపోల్చి చూస్తున్నారు ప్రజలు. వైసీపీ ని కాదని బయటకొచ్చిన షర్మిల టి.వైసీపీ అంటూ రాజకీయంగా తన తొలి అడుగు వేశారు.
కానీ కవిత తెరాస తోనే తన మొదటి రాజకీయ ప్రయాణం మొదలుపెట్టేసారు. అప్పుడు షర్మిల పార్టీ స్థాపనకు షర్మిల వద్ద పార్టీ ప్రచార అనుభవమే తప్ప క్షేత్ర స్థాయి రాజకీయ అనుభవం లేదు. అందుచేతనే షర్మిల టి. వైసీపీ కాంగ్రెస్ లో విలీనం అయ్యి షర్మిల రాజకీయ ప్రయాణం తెలంగాణ నుంచి ఆంధ్రాకు మారింది.
అయితే ఇక్కడ అందరు గమనించాల్సిన ఒక విషయం ఏమిటంటే వైసీపీ లో వైస్ షర్మిల పాత్ర కేవలం ఒక రాజకీయ పార్టీ ప్రచారానికి మాత్రమే పరిమితమయ్యింది. కానీ ఇక్కడ బిఆర్ఎస్ లో కవిత పాత్ర ఇరవై ఏళ్ళ రాజకీయ ప్రయాణంతో ముడి పడిఉంది.
అక్కడ షర్మిల – జగన్ మధ్య రాజకీయ విభేదాల కంటే కుటుంబ ఆస్తి తగాదాలు వీరి బంధాన్ని ఎక్కువగా ప్రభావితం చేసాయి. కానీ ఇక్కడ కవిత విషయంలో పార్టీలో ఆధిపత్య ధోరణి కల్వకుంట్ల ఇంట రాజకీయ చిచ్చు రాజేశాయి.
అలాగే వైస్ షర్మిలకు వైసీపీ లో ప్రచార బాధ్యతలే తప్ప క్షేత్ర స్థాయిలో పెద్దగా రాజకీయ అనుభవం లేదు. అలాగే అటు వైసీపీ పార్టీలో కానీ ఇటు వైస్ జగన్ ప్రభుత్వంలో కానీ షర్మిల పాత్ర శూన్యం. కేవలం అన్న మీద ద్వేషం తండ్రి వైఎస్ఆర్ పేరుకున్న ఛరిష్మా తప్ప షర్మిల స్థాపించిన టి.వైఎస్ఆర్ పార్టీకి బలమైన పునాది లేదు.
కానీ కవిత విషయం ఇందుకు పూర్తి భిన్నంగా ఉంటుంది. కేసీఆర్ స్థాపించిన తెరాస నుంచి కేసీఆర్ మార్చిన బిఆర్ఎస్ వరకు గులాబీ కారు ప్రతి ప్రయాణంలో కవిత కేసీఆర్ తో కలిసి నడిచారు, కేటీఆర్ తో కలిసి గళం కలిపారు. అలాగే తెలంగాణ అంతటా అనేక కార్మిక సంఘాలకు కవిత నాయకత్వం వహించారు.
ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది సింగరేణి కాలరీస్ మరియు హింద్ మజ్జుర్ యూనియన్ వంటి భారీ సంఘాలు ఉన్నాయి. దానికి తోడు కవిత 2014 నుంచి 2019 మధ్య నిజామాబాద్ ఎంపీ గా కూడా గెలుపొంది ఇటు నిజామాబాద్ లో రాజకీయంగా క్షేత్ర స్థాయిలో అనుభవం సంపాదించారు.
అలాగే ఎంపీగా పార్లమెంట్ లో గళం విప్పుతూ అటు ఢిల్లీ స్థాయిలో రాజకీయ పరిచయాలు పెంచుకున్నారు. ఇక ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టయ్యి ఆరు మాసాలు తీహార్ జైల్లో ఉండి రాజకీయంగానూ బాగా రాటు తేలారు. ఇదంతా కవిత రాజకీయ ప్రస్థానం, తెరాస నుంచి బిఆర్ఎస్ వరకు ఆమె సంపాధించిన రాజకీయ అనుభవం.
ఇవి కాకుండా కవిత తన తండ్రి మాదిరి, తన అన్న లెక్క మంచి వక్త, అటు రాజకీయంగా కానీ ఇటు సామాజికంగా కానీ ఎటువంటి ఎదురు ప్రశ్నలకైనా కవిత అలవుకగా బదులు చెప్పగలరు, అలాగే ప్రత్యర్థుల నోరు మూయగలరు. ఇవన్నీ కవిత కు కొత్త పార్టీ పెట్టడానికి ఉన్న బలమైన పునాదులు.
ఇక ఇటు బిఆర్ఎస్ తో రాజకీయ ప్రయాణం చేస్తూనే అటు జాగృతి అని, బతుకమ్మ అంటూ తెలంగాణ సమాజంలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఐదేళ్లు ఎంపీ గా, మరో పర్యాయయం ఎమ్మెల్సీ గా, కార్మిక సంఘాల అధ్యక్షురాలిగా ఇటు పార్టీ అనుచరులతోను అటు కార్మిక సంఘాల నేతలతోనూ కవితకు మంచి తత్సబంధాలే ఉన్నాయి.
అలాగే జాగృతి, బతుకమ్మ అంటూ మహిళలతోను కవిత కు విడతీయలేని అనుబంధమే ఉంది. అయితే ఇక్కడ కవిత కు ఉన్న సమస్య ఏమిటంటే కవిత కాంగ్రెస్, బీజేపీ లతో ఏవిధమైన రాజకీయ యుద్ధం చేయదలచారో అదే స్థాయిలో బిఆర్ఎస్ పైన కూడా సాగించాలి.
అక్కడ రేవంత్, బీజేపీ నేతలను ఎలా అయితే రాజకీయంగా ఎండగడతారో ఇక్కడ తండ్రి కేసీఆర్, అన్న కేటీఆర్ పైన అదే స్థాయిలో విమర్శనాబాణాలు ఎక్కుపెట్టాలి. అంటే ఒకే ఓటు బ్యాంకును ఇటు కవిత అటు కేసీఆర్ ఇద్దరు పంచుకోవాల్సిన పరిస్థితి.
ఇన్నాళ్ళుగా తనకు రాజకీయ ఆశ్రయం అందించిన పార్టీని విమర్శిస్తూ, తనను రాజకీయంగా ప్రోత్సహించిన తండ్రికి ఎదురెళ్ళడం అంటే కత్తి మీద సాము లాంటిదే. ఇక్కడ హరీష్ ను దూషించినా, సంతోష్ ను విమర్శించినా, కేటీఆర్ పై ఆరోపణలు చేసినా అది కేసీఆర్ ను పరోక్షంగా ఇరుకునపెట్టినట్టే అవుతుంది.
మరి ఇటువంటి కఠిన పరీక్షలను తట్టుకుని కవిత కొత్త పార్టీ పెట్టి తెలంగాణ రాజకీయాలలో రాణించడం నిప్పుల మీద నడకే అవుతుంది. అందుచేతనే కవిత రాజకీయ ప్రయాణాన్ని షర్మిల రాజకీయ ప్రచారంతో సరిపోల్చడం తొందరపాటు చర్య అవుతుందేమో బహుశా…!




