ప్రతిపక్షాలు ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాటాలు చేస్తూ ప్రజలకు చేరువయ్యేందుకు ప్రయత్నిస్తుంటాయి. ఆ పోరాటాల ద్వారానే అవి తమ రాజకీయ ప్రత్యర్ధి (అధికార పార్టీ)పై రాజకీయంగా పైచేయి కూడా సాధించాలనుకుంటాయి. కనుక ప్రతిపక్షాలు తమ పోరాటాలకు ఎటువంటి ప్రజా సమస్యలను ఎంచుకున్నాయి? ఎటువంటి విధానంతో ముందుకు సాగుతున్నాయనేది చాలా ముఖ్యం.
ఈ రెండు అంశాలు సరిగా ఉన్నప్పుడే అవి ఆశించిన ఫలితాలను సాధించగలవు. ప్రజా సమస్యల ఎంపికలో స్పష్టత, ఉన్నప్పుడే ప్రజలు కూడా వాటితో ఏకీభవిస్తారు. కనుక రాజకీయ లాభం కంటే ప్రజల మద్దతు సాధించాలనే ఆలోచన బలంగా ఉండాలి. అప్పుడే వాటి పోరాటాలకు ఆశించిన ఫలితాలు లభిస్తాయి. .
ఇందుకు ఉదాహారణలుగా ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ, తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న తాజా పోరాటాల గురించి చెప్పుకోవచ్చు.
వైద్య కళాశాలలను ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్య పద్ధతిలో నిర్మించాలనే ప్రతిపాదనని వ్యతిరేకిస్తూ వైసీపీ అధినేత జగన్ నేడు నర్సీపట్నం పర్యటనకు బయలుదేరారు. పోలీసులు ఆంక్షలు విధించినా, ఆయన వాటిని బెఖారు చేస్తూ రోడ్డుమార్గంలో వేలాదిమందితో భారీ ర్యాలీ నిర్వహిస్తున్నారు.
వైసీపీ శ్రేణులు ఎప్పటిలాగే జగన్ ఫొటోలతో ‘రప్పా రప్పా’ పోస్టర్లు ప్రదర్శిస్తూ ఆయన వెంట సాగుతున్నారు. ఇది ఓ ప్రజా సమస్యపై పోరాటంగా కార్యక్రమంలో, ప్రభుత్వంపై వ్యతిరేకతతో చేస్తున్న రాజకీయ బలప్రదర్శనగా ప్రజలు భావించేలా చేస్తున్నారు.
తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ హైదరాబాద్‌లో సిటీ బస్సు ఛార్జీల పెంపును వ్యతిరేకిస్తూ ‘ఛలో బస్ భవన్’ కార్యక్రమాన్ని ప్రకటించింది. ఆ పార్టీ నేతలు బస్సుల్లో ప్రయాణిస్తూ ప్రయాణికుల అభిప్రాయాలు తెలుసుకున్నాక టీజీఎస్ ఆర్టీసీ ఎండీకి వినతిపత్రం ఇవ్వాలని నిర్ణయించారు. కానీ పోలీసులు ముఖ్య నేతలందరినీ గృహనిర్బంధం చేశారు. కనుక మిగిలినవారు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు.
ఈ రెండు పార్టీలు ఎంచుకున్న ప్రజా సమస్యలు, వాటి పోరాటాల తీరు నిశితంగా గమనిస్తే బీఆర్ఎస్ సరైన దిశలో ముందుకు సాగుతోందని స్పష్టమవుతోంది. బస్సు ఛార్జీల పెంపు పట్ల సామాన్య ప్రజల ఆగ్రహం స్పష్టంగా కనిపిస్తోంది. వారిపై నేరుగా తీవ్ర ప్రభావం చూపే అంశం ఇది కావడంతో సహజంగానే వారు బీఆర్ఎస్ పార్టీతో ఏకీభవిస్తారు.
ఈ సమస్యపై పోరాడటం ద్వారా ఆ పార్టీ ప్రజల ఆదరణను పొందగలదు. ఆ ఆగ్రహాన్ని ఓట్ల రూపంలో మార్చుకోగలిగితే రాబోయే జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో బీఆర్ఎస్ ఘన విజయం సాధించే అవకాశం ఉంది. సరైన ప్రజా సమస్య ఎంపిక ఎంత ముఖ్యమో ఇది తెలియజేస్తుంది.
ఏపీలో వైసీపీ ఎంచుకున్న వైద్య కళాశాలల నిర్మాణం అంశం సామాన్య ప్రజలకు అంతగా సంబంధం లేని విషయం. దీనిపై హైకోర్టులో పిటిషన్ వేయగా, ప్రభుత్వ నిర్ణయం, విధానం రెండూ చట్టవిరుద్ధం కావని కోర్టు తేల్చి చెప్పింది. కనుక అప్పుడే జగన్ ఈ ఆలోచన విరమించుకొని ఉంటే హుందాగా ఉండేది.
మాజీ ముఖ్యమంత్రిగా చేసిన జగన్ పోలీసుల ఆంక్షలను లెక్కచేయకుండా ర్యాలీ నిర్వహించడం ద్వారా చట్టాలను గౌరవించరనే తప్పుడు సంకేతాలు పంపిస్తున్నారు. పైగా అయన ప్రజల సమస్య కోసం కాక వ్యక్తిగత బలప్రదర్శన కోసమే బయలుదేరారని ప్రజలు భావించడం సహజం. ఆయన వెంట నడుస్తున్నవారు శాంతి భద్రతలు సమస్యలు సృష్టిస్తే కేసులలో పోలీస్ చిక్కుకుకోవడం ఖాయం.
ఇక్కడ వైసీపీ, అక్కడ బీఆర్ఎస్ రెండు పార్టీలు ఎంచుకున్న అంశాలు, వాటి విధానాలు, ప్రజలపై ఆ ప్రభావం, అన్నీ పూర్తి భిన్నంగానే ఉన్నాయని అర్ధమవుతోంది. కనుక వాటి ఫలితాలు లేదా పర్యవసానాలు కూడా అందుకు అనుగుణంగానే ఉంటాయి. కనుక ప్రజా సమస్య పేరుతో పార్టీ శ్రేణులను వెంటబెట్టుకొని రోడ్లపైకి వచ్చేసినంత మాత్రాన్న ప్రయోజనం ఉండదు. సరైన సమయం, సమస్య, విధానం కూడా చాలా ముఖ్యమే…. అని జగన్ ఇంకా ఎప్పుడు గ్రహిస్తారో?




