వైఎస్ విజయమ్మ, ఆమె కుమార్తె వైఎస్ షర్మిల నేడు హైదరాబాద్ పోలీసులపై చెయ్యి చేసుకొని దుర్భాషలాటంపై అప్పుడే తెలంగాణలో అధికార, ప్రతిపక్ష పార్టీల మద్య వాదోపవాదాలు, విమర్శలు మొదలైపోయాయి. కానీ ఏపీలోని వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ మౌన వహిస్తున్నారు. ఏపీ సిఎం జగన్మోహన్ రెడ్డి తల్లి, చెల్లి పొరుగు రాష్ట్రంలో పోలీసులపై చెయ్యి చేసుకోవడంతో వైసీపీ ప్రభుత్వానికి ఇబ్బందికరమే కనుక వైసీపీ నేతలు ఏమీ మాట్లాడలేకపోతున్నారనుకోవచ్చు.
అయితే ఏపీలో జగన్ ప్రభుత్వ వైఫల్యాలపై పోరాడకుండా ఇక్కడ తెలంగాణ ప్రజల కోసం కేసీఆర్‌తో ఎందుకు పోరాడుతున్నారని బిఆర్ఎస్ నేతలు చాలాసార్లు ప్రశ్నించారు.
తమ పోలీసులపై వారిరువురూ చెయ్యి చేసుకోవడంపై మాజీ కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి ముందుగా స్పందిస్తూ, “నేను ఖమ్మంలో ఏమీ చేయకముందే పోలీసులు నాపై కేసులు నమోదు చేశారు. కానీ తెలంగాణ పోలీసులపై చెయ్యి చేసుకొన్న విజయమ్మ, షర్మిలపై చర్యలు తీసుకొనే ధైర్యం కేసీఆర్ ప్రభుత్వానికి ఉందా?తెర వెనుక వారికీ, బిఆర్ఎస్‌కి మద్య ఏం జరుగుతోందో ఎవరికి తెలుసు?” అంటూ ఇది ఆ రెండు పార్టీలు కలిసి ఆడుతున్న డ్రామా అనే అభిప్రాయం వ్యక్తం చేసారు.
ఆంధ్రాకు చెందిన విజయమ్మ, షర్మిలా తెలంగాణ పోలీసులను కొట్టడమే కాకుండా వారిని “నా దగ్గరేందుకు కాపలా కాయడం?పనిలేకపోతే గాడిదలు కాసుకోండి…” అంటూ ఈసడించారు. దీంతో సహజంగానే తెలంగాణ ప్రజలకు ఆగ్రహం కలుగుతుంది. కనుక మళ్ళీ తెలంగాణ సెంటిమెంట్ రగిలించేందుకే ఈ డ్రామా ఆడుతున్నారని ఎంపీ రేణుకా చౌదరి సందేహం వ్యక్తం చేస్తున్నారనుకోవచ్చు.
ఇటీవల వైజాగ్ స్టీల్ ప్లాంట్ కొని కాపాడేస్తానంటూ కేసీఆర్ హడావుడి చేసి ఆంధ్రా సెంటిమెంట్ రగిలించిన్నట్లే, వైఎస్ విజయమ్మ, షర్మిలతో తెలంగాణ సెంటిమెంట్ రగిలించి కేసీఆర్ ప్రభుత్వం ఎదుర్కొంటున్న సమస్యలపై నుంచి ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నం చేస్తున్నారేమో?అనే సందేహం కలుగక మానదు.
హైదరాబాద్ పోలీసులు ఇప్పటికే వైఎస్ షర్మిలపై కేసు నమోదు చేశారు. డ్యూటీలో ఉన్న పోలీస్ అధికారులపైకి వాహనాన్ని నడిపించే ప్రయత్నం చేయడం, చెంప దెబ్బలు కొట్టడం, దుర్భాషలాటాడటం తీవ్రమైన నేరాలే. కనుక ఒకవేళ ఈ కేసులో వారిని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేస్తే ఏమవుతుంది?అంటే మళ్ళీ ఆంధ్రా, తెలంగాణ సెంటిమెంట్లు రగులుతాయి. ఆ తర్వాత ఆంద్రా, తెలంగాణ మంత్రుల మద్య మాటలయుద్ధం మొదలవవచ్చు. కనుక రేణుకా చౌదరి చెప్పిన్నట్లు ఇదేదో యదాలాపంగా మొదలైన గొడవ కాదనే భావించవచ్చు.



