అసలు ఆంధ్రప్రదేశ్ లో ఉనికే లేని బీజేపీ కమలానికి నారు పోసి నీరు పెట్టి ఉపిరిచ్చాయి టీడీపీ, జనసేన పార్టీలు. గత ఎన్నికలలో ఒంటరిగా పోటీ చేసిన బీజేపీ పార్టీ కనీసం నోటా ఓట్లను కూడా సాధించలేక పోయింది. పోటీ చేసిన 175 స్థానాలలో కనీసం డిపాజిట్లు కూడా రాబట్టలేకపోయారు బీజేపీ నాయకులు.
అటువంటి పరిస్థితి నుంచి సరిగ్గా ఐదేళ్లు తిరిగే సరికి టీడీపీ, జనసేన తో పొత్తు పెట్టుకుని పోటీ చేసిన 10 లో 8 స్థానాలలో విజయ కేతనం ఎగరవేసింది. అలాగే 3 ఎంపీ స్థానాలను దక్కించుకుంది. అసలు ఓటు బ్యాంకే లేని ఏపీలో బీజేపీ పార్టీకి ఈ స్థాయి విజయం అంటే వైసీపీ వంటి ప్రాంతీయ పార్టీతో పోటీ పడినట్టే.
ఒక ప్రాంతీయ పార్టీగా ఉన్న వైసీపీ 175 స్థానాలలో పోటీ చేస్తే 11 అసెంబ్లీ 25 స్థానాలలో పోటీ చేస్తే 4 పార్లమెంట్ స్థానాలను గెలుచుకుంది. అయితే గెలిచిన సీట్లను కాదు వచ్చిన ఓటు బ్యాంకును చూసి ఓటమిని సమర్ధించుకుంటున్న వైసీపీ, తానూ గెలిచిన స్థానాలతో పోలిస్తే వైసీపీకి బీజేపీ పార్టీ కి పోటీగా నిలిచింది.
మరి బీజేపీ కి ఇంతటి స్థాయి విజయాన్ని కట్టబెట్టిన ఆంధ్రప్రదేశ్ ప్రజల ఋణం తీర్చుకోవడానికి, టీడీపీ, జనసేన పార్టీల కష్టం గుర్తించడానికి బీజేపీకి అవకాశం వచ్చింది. ఏపీ – తెలంగాణ రాష్ట్రాల విభజన సమస్యలకు పరిష్కారం చూపించి రెండు రాష్ట్ర ప్రజల మధ్య, ప్రభుత్వాల మధ్య అపోలకు తావులేని వాతావరణాన్ని సృష్టించాలి.
అలాగే ఏపీకి విభజన చట్టం ప్రకారం హక్కుగా దక్కాల్సిన ప్రతిదీ కేంద్ర ప్రభుత్వం నుండి మంజూరు చేయడం, రాష్ట్ర రాజధాని అమరావతి, పోలవరం నిర్మాణాలు పూర్తి చేయడానికి అవసరమైన నిధులు, అనుమతులు ఇష్యు చేసి ఏపీ పునర్నిర్మాణానికి అండగా నిలవాలి. ఇప్పుడు ఏపీ అభివృద్ధి బీజేపీ పార్టీ బాధ్యత కూడా అనేది బీజేపీ పెద్దలు విస్మరించరాదు.
అలాగే రాజకీయ అవసరాల నేపథ్యంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కుంటున్న వైసీపీ నాయకులకు ఆశ్రయం కల్పించి కూటమి బంధానికి భీటలు వేయకూడదు. బలం లేని ఏపీలో బీజేపీ బలం పెంచిన టీడీపీ, జనసేనలు కేంద్రంలో కూడా ఎన్డీయే ప్రభుత్వానికి బలమయ్యారు. మోడీ 3 .0 పాలనకు వెన్నెముకగా నిలబడ్డాయి.
విభజనతో దెబ్బ తిన్న రాష్ట్రం, జగన్ పాలనారాహిత్యంతో, అహంకారంతో మరోపదేళ్లు వెనక్కెళ్ళింది. ఇటువంటి దయనీయ స్థితిలో ఉన్న ఏపీని అన్నీతానై ఆదుకోవాల్సిన బాధ్యత, అక్కున చేర్చుకోవాల్సిన అవసరం కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బీజేపీ పై ఉంది.
త్వరలో కేంద్ర ప్రవేశ పెట్టనున్న బడ్జెట్ లో అమరావతి, పోలవరం కు నిధులతో పాటుగా విశాఖ రైల్వే జోన్, వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను ప్రయివేట్ వ్యక్తుల పరం కాకుండా చూడడం, నూతన పరిశ్రమలను ఏపీకి కేటాయించడం, అలాగే ఏపీని ఒక ప్రత్యేక రాష్ట్రంగా భావించి ఏపీ తన కాళ్ళ మీద తాను నిలదొక్కుకునే వరకు చేయూతనందిస్తే ఏపీలో కమల వికాసం కచ్చితంగా జరిగి తీరుతుంది.






