బీజేపీలో బిఆర్ఎస్ విలీనం అవుతుందా?

BJP-Narendra-Modi-BRS-KCR

గత కొన్ని రోజులుగా బీజేపీలో బిఆర్ఎస్ పార్టీ విలీనం అవుతుందంటూ మీడియాలో వార్తలు వస్తూనే ఉన్నాయి. కానీ వాటిపై కేసీఆర్‌, కేటీఆర్‌, హరీష్ రావు ముగ్గురూ స్పందించడం లేదు. అంటే ఆ వార్తలు నిజమే అని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

కేసీఆర్‌ జీగ్రీ దోస్త్ మజ్లీస్ అధినేత అసదుద్దీన్‌ ఓవైసీ ఈ వార్తలపై స్పందిస్తూ, బీజేపీలో బిఆర్ఎస్ పార్టీ విలీనం అవుతోందా లేక బయట నుంచి మద్దతు ఇస్తుందా? కేసీఆర్‌ చెప్పాలని డిమాండ్ చేశారు. మాజీ ఎంపీ వినోద్ కూడా రాజకీయాలలో ఏదైనా జరుగవచ్చని అనడం కూడా అదే సూచిస్తోందన్నారు.

ADVERTISEMENT

బిఆర్ఎస్ పార్టీ ఇప్పటికే సగం ఖాళీ అయిపోయింది. మిగిలినవారు కూడా వెళ్ళిపోయేందుకు సిద్దంగా ఉన్నారు. మరో పక్క రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం కేసీఆర్‌ మీద అనేక కేసులు సిద్దం చేస్తోంది. వాటిలో ఏదో ఓ కేసులో కేసీఆర్‌ జైలుకి వెళ్ళకతప్పని పరిస్థితి కనిపిస్తోంది.

బిఆర్ఎస్‌ పార్టీలో కేసీఆర్‌ని అంటిపెట్టుకున్న ముఖ్య నేతలు కూడా ఆయనతో పాటు జైలుకి వెళ్ళాల్సివచ్చినా ఆశ్చర్యం లేదు. కనుక కేసులకు భయపడి వారు కూడా కేసీఆర్‌కు గుడ్ బై చెప్పేసి వెళ్లిపోయే సూచనలు కనిపిస్తున్నాయి. కనుక బిఆర్ఎస్‌ పార్టీ పరిస్థితి, భవిష్యత్‌ రెండూ అగమ్యగోచరంగా కనిపిస్తున్నాయి.

మరోపక్క కేసీఆర్‌ కూతురు కల్వకుంట్ల కవిత నాలుగు నెలలుగా తిహార్ జైల్లో మగ్గుతున్నారు. ఆమెను విడిపించుకోవడానికి కేసీఆర్‌ చేసిన ప్రయత్నాలు ఏవీ ఫలించడం లేదు.

ఈ నేపద్యంలో కేసీఆర్‌ బీజేపీతో దోస్తీకి ప్రయత్నిస్తే ఆశ్చర్యం కాదు. కానీ అధికారంలో ఉన్నప్పుడు ‘మోడీ.. గీడీ’ అంటూ విర్రవీగిన కేసీఆర్‌, ఇప్పుడు నిసహాయ స్థితిలో ఉన్నప్పుడు ఆయనతో స్నేహం చేయాల్సిన అవసరం బీజేపీకి లేనేలేదు. దాని వలన తెలంగాణలో బీజేపీ విశ్వసనీయత మళ్ళీ దెబ్బ తింటుంది కూడా. శాసనసభ, లోక్‌సభ ఎన్నికలలో తెలంగాణలో బీజేపీ చాలా పుంజుకుంది. కనుక ఒంటరిగానే ముందుకు వెళ్ళాలనుకుంటుంది తప్ప కేసీఆర్‌ కోసం తన విశ్వసనీయతని మరోసారి దెబ్బ తీసుకోవాలనుకోదు.

ఇక కేసీఆర్‌ విషయానికి వస్తే, బీజేపీ, బిఆర్ఎస్‌ కలిసి రేవంత్‌ రెడ్డి ప్రభుత్వాన్ని కూల్చేయబోతోందని, రాష్ట్రంలో మళ్ళీ మనమే అధికారంలోకి వస్తామని నమ్మబలుకుతున్నారు. మిగిలిన ఎమ్మెల్యేలు చేజారిపోకుండా కాపాడుకునేందుకే విలీనం పుకార్లు పుట్టిస్తున్నారేమో? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

కానీ అహంభావంతో విర్రవీగే కేసీఆర్‌ ఇప్పుడు పార్టీని బీజేపీలో విలీనం చేసి, ప్రధాని నరేంద్రమోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాల ముందు చేతులు కట్టుకొని వినయంగా నిలబడగలరా?అంటే కాదనే అర్దమవుతోంది. అందుకే “రాజ్యసభలో బీజేపీకి బయట నుంచి మద్దతు ఇస్తారా?” అని తన జిగిరీ దోస్త్ అసదుద్దీన్‌ ఓవైసీ చేత హింట్ ఇప్పించిన్నట్లున్నారు.

కనుక రాజ్యసభలో బీజేపీకి మద్దతుకి ప్రతిగా కూతురు కల్వకుంట్ల కవితకి విముక్తి లభిస్తే లభించవచ్చేమో కానీ రేవంత్‌ రెడ్డి ప్రభుత్వాన్ని కూలద్రోయడానికి బీజేపీ కేసీఆర్‌కు సహకరించకపోవచ్చు. ఒకవేళ అటువంటి ఆలోచన చేస్తే చంద్రబాబు నాయుడు చక్రం తిప్పి అడ్డుకోగలరు.

ADVERTISEMENT
Latest Stories