కవిత కొత్త పార్టీకి…జనసేన పాఠాలు..?

Kavitha New Party

తెలంగాణలో కవిత కొత్త పార్టీ ఎంట్రీ ఎవరిని రాజకీయంగా దెబ్బతీస్తుంది, ఎవరికీ రాజకీయంగా కలిసొస్తుంది అనే చర్చ తెలంగాణ రాజకీయాలలో ఊపందుకుంది. కవిత త్వరలో తెలంగాణ రాజకీయాలలోకి మరో కొత్త పార్టీని తీసుకువచ్చే పనిలో బిజీగా ఉందన్న వార్తలు మీడియాలు హల్చల్ చేస్తున్నాయి.

అయితే ఆ పార్టీ ముఖ్యంగా బిఆర్ఎస్ ని టార్గెట్ చేస్తుందా.? లేక లిక్కర్ కేసులో తన అరెస్టుకి మూలకారణమంటూ ఆరోపిస్తున్న బీజేపీ తో ఢీ కొడుతుందా.? లేదా ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ని గురి పెడుతుందా.? అనే విషయంలో కవితకు పూర్తి స్పష్టత ఉండాలి.

ADVERTISEMENT

లేకుంటే వైస్ షర్మిల రాజకీయం మాదిరి కవిత రాజకీయం కూడా గమ్యం తెలియని ప్రయాణం మాదిరి తయారవుతుంది, లేదా షర్మిల పార్టీ తరహాలో విలీనంతో ముగుస్తుంది. గతంలో జనసేన కూడా ఇదే తరహాలో అటు అధికార టీడీపీ ని ఇటు ప్రతిపక్ష వైసీపీ ని టార్గెట్ చేస్తూ ఒంటరి ప్రయాణం చేసి చేచేతులా గాజు గ్లాసుని ముక్కలు చేసుకుంది.

ఆ తరువాత తత్వం తెలుసుకుని రాజకీయం మొదలు పెట్టిన పవన్ ‘వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వను’ అంటూ పంతం పట్టి మరి కూటమి కట్టారు, గట్టిగా కొట్టారు. దీని బట్టి కొత్తగా పార్టీ పెట్టి రాజకీయంలోకి అడుగుపెట్టే వారికీ తన రాజకీయ టార్గెట్ ఎవరు.? ఎందుకు.? అనే స్పష్టత ఉండాలి, అలాగే ఆ స్పష్టత తనకు ఉండడమే కాదు అటు ప్రజలకు కూడా పూర్తి స్పష్టతతో వివరించగలగాలి అనేది తేటతెల్లమయ్యింది.

మరి అటువంటి పొలిటికల్ స్పష్టత కవితకు, కవిత కొత్త పార్టీకి ఉందా.? అలాకాకుండా కాసేపు అధికార కాంగ్రెస్ పై విరుచుకుపడి, మరికాసేపు తన మాజీ పార్టీ అయిన బిఆర్ఎస్ పై మండిపడి, అటుపిమ్మట ఎలానూ ఇంకా బీజేపీ ఉంది కదా దాని సంగతి కూడా కాస్త చూసేద్దాం అంటూ బీజేపీ పై విమర్శలు ఎక్కుపెట్టి,

తెలంగాణ సెంటిమెంట్ ని మరిచిపోయాం దాని కోసం మరోసారి టీడీపీ ని తెరమీదకు తెచ్చేద్దాం అంటూ అన్ని పార్టీల జెండాల పై బురద జల్లితే కవిత రాజకీయం ఆటలో అరటిపండు మాదిరి తయారవుతుంది. కాబట్టి కవిత భవిష్యత్ రాజకీయ ప్రయాణం పై కవితకు పూర్తి స్పష్టత ఉండాల్సిదే.

అంతే కాదు కవిత కొత్త పార్టీ ఉద్దేశం ఏమిటి.? అనే క్లారిటీ కూడా కవిత తెలంగాణ సమాజానికి ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పటికే తెలంగాణ సెంటిమెంట్ కి ప్రాంతీయవాద రాజకీయానికి బిఆర్ఎస్ బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటుంది. ఇక కాంగ్రెస్, బీజేపీ లు జాతీయ పార్టీలుగా అధిష్టానం ఆదేశాలతో అడుగులేస్తాయి.

ఇక కొత్తగా బీసీ నినాదంతో తెలంగాణలోకి కుల రాజకీయాలను తీసుకొచ్చిన తీన్మార్ మల్లన్న కుల రాజకీయాలకు కేరాఫ్ అడ్రెస్స్ గా తన TRP ని ఏర్పాటు చేసారు. మరి కవిత పెట్టబోయే పార్టీ కొత్త స్వరంతో పాత రాగం పాడుతుందా.? లేదా కొత్త రాగం ఎత్తుకుంటుందా.?

అయితే గత పదేళ్లుగా అధికారంలో ఉండి కూడా కవిత ఆ రాగాన్ని ఎందుకు తెరమీదకు తేలేకపోయింది.? బిఆర్ఎస్ వంటి బలమైన నాయకత్వం ఉన్న పార్టీతో సాధ్యం కాని ఆ మార్పు కవిత పార్టీ తో సాధ్యమవుతుందా.? అనే ప్రశ్నలకు కూడా కవిత వద్ద సరైన జవాబు ఉండాలి. ఆ జవాబు కూడా ప్రజామోదం పొందే విధానంగా ఉండాలి.

ADVERTISEMENT
Latest Stories