ఆకాశవాణిలో మన్ కీ బాత్ ధారావాహికం 74వ అధ్యాయం నేడు పూర్తయింది. ఈ కార్యక్రమంలో ప్రతీ నెల ఆఖరు ఆదివారంనాడు ప్రధాని మోడీ దేశ ప్రజలనుద్దేశ్యించి మన్ కీ బాత్ (మనసులో మాట) చెపుతుంటారు.
దేశానికి, ప్రజలకు సంబంధించి పలు అంశాలపై ఆయన ఈ కార్యక్రమంలో తన మనసులో ఆలోచనలను ప్రజలతో పంచుకుంటారు. కనుక ఈ కార్యక్రమానికి మన్ కీ బాత్ (మనసులో మాట) చాలా చక్కటి పేరే.
అయితే ప్రధాని మోడీ తన మనసులో మాట అందరూ వినాలని కోరుకొన్నప్పుడు దేశ ప్రజలు ఏమనుకుంటున్నారో కూడా వింటే బాగుంటుంది కదా? ఎన్నికల సమయంలో ప్రధాని మోడీతో సహా కేంద్ర మంత్రులు ఆయా రాష్ట్రాలకు వెళ్ళి అక్కడి ప్రజల సమస్యలను ప్రస్తావిస్తున్నప్పుడు, ఎన్నికలు లేనప్పుడు కూడా మాట్లాడవచ్చు కదా?
సువిశాలమైన భారతదేశంలో 150 కోట్ల మంది అభిప్రాయాలు తెలుసుకోవడం, వారి సమస్యలు పరిష్కరించడం అసాధ్యమే. అందుకు ఆయన సమయం కేటాయించ లేకపోవచ్చు. కానీ ఎక్కడో విదేశాలలో ప్రకృతి విపత్తులు సంభవిస్తే తక్షణమే స్పందిస్తున్నప్పుడు, దేశంలోనే ఏదో ఓ రాష్ట్రంలో ప్రజలు ఇబ్బంది పడుతున్నప్పుడు కూడా ఇంకా త్వరగా స్పందించాలి కదా?
సోషల్ మీడియా, ఇతర మాధ్యమాల ద్వారా ప్రజల అభిప్రాయాలు ఆయన దృష్టికి వస్తూనే ఉంటాయి. కనుక వాటిపై ఆయన స్పందన తెలియజేస్తే ప్రజలు కూడా సంతోషిస్తారు కదా?
ఉదాహరణకు లాక్ డవున్ సమయంలో లక్షలాది మంది ప్రజలు కాలి నడకన వందల కిలోమీటర్లు నడుచుకుంటూ స్వగ్రామాలకు చేరుకున్నారు. దారిలో వారు అష్టకష్టాలు అనుభవించారు. కానీ అప్పుడు వారి గోడు వినే నాధుడే లేడు.
నేటికీ ఆంధ్రాతో సహా దేశంలో పలు రాష్ట్రాలలో మారుమూల గ్రామాలలో నివసించే ప్రజలకు రోడ్లు, విద్య, వైద్యం, విద్యుత్, ఇళ్ళు వంటి కనీస సౌకర్యాలు లేవు.
కనుక ప్రధాని మోడీ, కేంద్ర మంత్రులు ఢిల్లీలో కూర్చొని మన్ కీ బాత్ అంటూ తమ మనసులో మాటలు ప్రజలు వినాలని కోరుకునే బదులు మారుమూల గ్రామాలలో పర్యటించి వారి సమస్యలు స్వయంగా తెలుసుకొని పరిష్కరించవచ్చు.
ప్రధాని మోడీ విదేశాలు వెళ్ళి వస్తుంటారు కానీ పెరట్లో ఉన్న గ్రామాలకు వెళ్ళాలనుకోరు. కనుక ప్రజల సమస్యలు అలాగే అపరిష్కృతంగా ఉండిపోతాయి. అలాగే ప్రధాని మోడీ మన్ కీ బాత్ ధారావాహికం విజయవంతంగా కొనసాగుతూనే ఉంటుంది. ప్రధాని మోడీ తన మనసులో మాటని వినిపిస్తూనే ఉంటారు. కానీ ప్రజల మనసులో మాట కూడా వినగలిగితే బాగుంటుంది.




