ఈసారి కేసీఆర్‌ బదులు రేవంత్‌ రెడ్డి వస్తారుగా ఏపీకి

Revanth Reddy

గత ఎన్నికల సమయంలో టిడిపి వ్యతిరేక శక్తులన్నీ ఏవిదంగా ఏకమయ్యాయో, ఈసారి ఎన్నికలలో వైసీపి వ్యతిరేక శక్తులన్నీ ఏకం అవుతున్నాయి. కనుక అప్పటిలాగే ఈసారి ప్రభుత్వం మారడం ఖాయంగానే కనబడుతోంది.

కర్ణుడు చావుకి వంద శాపాలన్నట్లు ఏపీలో వైసీపి గెలుపుకి కూడా అన్నే కారణాలున్నాయి. ఇప్పుడు ఓడిపోతే అంతకంటే ఎక్కువ కారణాలే ఉన్నాయి. అవి చెప్పుకోవడానికి ఇంకా చాలా సమయం ఉంది. కనుక అది అప్రస్తుతం.

ADVERTISEMENT

గత ఎన్నికలలో వైసీపి గెలుపుకి కేసీఆర్‌ కూడా ఓ కారణమని అందరికీ తెలుసు. కనుక ఈసారి కూడా తోడ్పడాలని జగన్‌ కోరారు. కానీ ప్రస్తుతం తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీ చెల్లాచెదురు అయిపోకుండా కాపాడుకోవడమే చాలా కష్టంగా మారింది. దానికి తోడు లోక్‌సభ ఎన్నికలు ముంచుకు వచ్చేస్తున్నాయి. కనుక కేసీఆర్‌ తెలంగాణ గుమ్మం దాటి బయట అడుగుపెట్టలేని పరిస్థితి కనబడుతోంది.

ఇదీగాక ఈసారి టిడిపి, జనసేన, బీజేపీ కూటమి గెలిచి మళ్ళీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని కేసీఆర్‌ కోరుకుంటున్నా ఆశ్చర్యం లేదు. అప్పుడే మళ్ళీ అమరావతి పనులు మొదలై, ఏపీకి పరిశ్రమలు, ఐ‌టి కంపెనీలు క్యూకట్టడతాయి. కనుక వాటిని చూపిస్తూ తెలంగాణలో రేవంత్‌ రెడ్డి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే అవకాశం బిఆర్ఎస్ పార్టీకి లభిస్తుంది.

ఈ పాయింట్ అర్దం చేసుకోవాలంటే ఇటీవల కేటీఆర్‌ చెప్పిన నాలుగు ముక్కల గురించి తెలుసుకోవలసిందే. ఆయన మీడియాతో మాట్లాడుతూ, “తెలంగాణలో 5 ఏళ్ళు కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలో ఉండాలి. ప్రజలు దాని అసమర్ధ పాలన కళ్ళారా చూడాలి. అప్పుడే గాడిదకు, గుర్రానికి తేడా తెలిసి వస్తుంది. చీకటి చూస్తేనే కదా వెలుగు విలువ తెలిసి వస్తుంది,” అని అన్నారు.

కనుక తెలంగాణలో ‘కాంగ్రెస్‌ ప్రభుత్వం గాడిద’ అని నిరూపించాలంటే ఏపీలో ప్రభుత్వం మారి అభివృద్ధిపధంలో పరుగులు తీయడం చాలా అవసరం…. అని కేసీఆర్‌ భావిస్తే, అది కూడా జగన్‌కు మరో శాపంగా మారుతుంది.

ఏది ఏమైనప్పటికీ ఈసారి తెలంగాణ నుంచి కేసీఆర్‌ రాలేకపోవచ్చు కానీ ఆయనకు చుక్కలు చూపిస్తున్న రేవంత్‌ రెడ్డి మాత్రం తప్పక వచ్చి, చెల్లెమ్మతో కలిసి ఫ్యాను రెక్కలు ఊడదీయకుండా ఉండరు. త్వరలోనే ఆయన షర్మిలతో కలిసి విశాఖలో భారీ బహిరంగ సభలో పాల్గొనబోతున్నట్లు సమాచారం.

ADVERTISEMENT
Latest Stories