ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నివశిస్తున్న వారితో సహా దేశ విదేశాలలో స్థిరపడ్డ ఆంధ్రా ప్రజలు సైతం తొలిసారిగా చకోర పక్షుల్లా ఎదురుచూసిన శాసనసభ ఎన్నికలు సోమవారం పూర్తయ్యాయి. ప్రజలు తీర్పు చెప్పేశారు. జూన్ 4వ తేదీన ఆ తీర్పు ప్రకటిస్తారు.
అంటే వైసీపికి ఇంకా మరో మూడు వారాలు సమయం ఉందన్న మాట! ఈ మూడు వారాలలో జగన్ ప్రభుత్వం ఎటువంటి ఆటంకాలు, ఆంక్షలు లేకుండా పనిచేసుకోవచ్చు.
ప్రజలకు సంక్షేమ పధకాలు అందనీయకుండా మూడు వారాల ముందే తమ గొంతు నొక్కేస్తున్నారంటూ జగన్ ఇటీవలే గగ్గోలు పెట్టారు. ఇప్పుడు ఎన్నికలు పూర్తయ్యాయి కనుక ఎన్నికల సంఘం అనుమతి తీసుకొని నిరభ్యంతరంగా ఆ పధకాలకు సొమ్ము రూ.14,165 కోట్లు విడుదల చేసుకోవచ్చు. లేకుంటే ఇప్పుడు ప్రతిపక్షాలే జగత్వాన్ని నిధులు ఎందుకు విడుదల చేయడం లేదని ఎదురు ప్రశ్నించవచ్చు కూడా.
అలాగే ఎన్నికల సంఘం అనుమతి తీసుకొని జూన్ 1వ తేదీన వాలంటీర్ల చేత యధాప్రకారం పింఛన్లు చెల్లించవచ్చు. అందుకు ఇప్పటి నుంచే ఏర్పాట్లు చేసుకోవచ్చు.
కానీ జగన్‌తో సహా ఆయన ప్రభుత్వంలో ఎవరూ కూడా బహుశః ఇప్పుడు అటువంటి ఆలోచనలు చేస్తున్నట్లు లేదు. ఎందుకంటే 5 ఏళ్ళపాటు సంక్షేమ పధకాల పేరుతో లక్షల కోట్లు పంచిపెట్టినా ప్రయోజనం లేకుండా పోయిందని జగన్ భావిస్తున్నారా?అంటే అవుననే అనుకోవాల్సి ఉంటుంది. బహుశః అందుకే పార్టీలో, ప్రభుత్వంలో అందరి కంటే ముందుగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నేడో రేపో లండన్, అమెరికా పర్యటనకి బయలుదేరడానికి సిద్దంగా ఉన్నారు. సీబీఐ కోర్టు అనుమతివ్వడమే ఆలస్యం.
పవన్ కళ్యాణ్‌ని ఎన్నుకుంటే హైదరాబాద్ వెళ్లిపోతారని దుష్ప్రచారం చేశారు. కానీ పోలింగ్ పూర్తవగానే జగన్ విదేశాలకు వెళ్ళిపోతున్నారు. తిరిగి వస్తారా లేదా అంటే వైసీపి గెలిస్తే వస్తారు లేకుంటే లేదని నెటిజన్స్ జోక్ చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎలాగూ రాజధాని లేదు. ఒకవేళ జగన్ విదేశీ యాత్రలకు బయలుదేరితే ఇప్పుడు ముఖ్యమంత్రి కూడా ఉండరు. మంత్రులు, ఎమ్మెల్యేలు తట్టాబుట్టా సర్దుకోవడంలో బిజీగా ఉంటారు.
ఇంతకాలం జగన్ ప్రభుత్వం కనుసన్నలలో పనిచేసిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు కూడా ఏపీలో ఉండే పరిస్థితి లేదు కనుక వారు కూడా ఢిల్లీకి బదిలీలు చేయించుకొని వెళ్లిపోయే ప్రయత్నాలు ముమ్మురం చేయవచ్చు.
కనుక 59 నెలల తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ మూడు వారాలు చాలా ప్రశాంతమైన వాతావరణం నెలకొని ఉండే అవకాశం ఉంది.






