వైఎస్ రాజశేఖర రెడ్డి 2003 పాదయాత్ర ఆధారంగా తీసిన సినిమా యాత్ర. గత వారం విడుదలైన ఈ సినిమా బాక్స్ ఆఫీసు వద్ద నెమ్మదించింది. నిర్మాతల సొంత విడుదల కావడంతో సినిమా వసూళ్లు పెద్దగా లేకపోయినా ఇబ్బంది లేదు. అయితే వైఎస్ అభిమానులకు మాత్రం ఈ చిత్రం బాగా నచ్చింది. దీనితో వైఎస్ అభిమానులు కావడం చిత్రం యూనిట్ కూడా ఆనందంగా ఉంది. దర్శకుడు మహి వి రాఘవ్ ఆనందానికైతే అవధులు లేవు. అయితే కొంత మంది వైఎస్ అభిమానులు సోషల్ మీడియాలో సెలెబ్రిటీలు తమ సినిమాను పొగడటం లేదని నొచ్చుకుంటున్నారు.
వైఎస్ వల్ల లాభపడిన నాగార్జున, కృష్ణ కుటుంబంలోని వారు కూడా స్పందించకపోవడం వారిని బాధ కలిగించింది. ఎన్టీఆర్ సినిమాను ఆకాశానికి ఎత్తిన వారు తమ సినిమాను ఎందుకు పట్టించుకోవడం లేదని వారి ఆవేదన. కొందరైతే దీనికి కులాన్ని కూడా ఆపాదించి సెలెబ్రిటీలపై సోషల్ మీడియాలో దాడి చేస్తున్నారు. దీనిపై దర్శకుడు స్పందించారు. “నేను తీసిన సినిమా నా తరువాత కూడా బ్రతికి ఉంటుంది. అయితే ఇలా సెలెబ్రిటీలను ఈ సినిమాను పొగడమని అడగడం నా పనిని, నా జీవన శైలిని అవమానించడమే,” అని ఆయన ఒకింత ఘాటుగానే స్పందించారు.
“నా కంటే కూడా ఇది వైఎస్ గారి కథ. ఇలా అడగడం ఆయనకు నచ్చదు. ఇది ఆయనను అవమానించడమే. నేను జీవితం ఒకరినే అడుక్కుంటా. అది విశ్వాన్ని నాకు మంచి కథ ఇవ్వమని. విశ్వం ఆ విషయంలో నా మీద ఎప్పుడూ దయ చూపింది. ఆ తరువాత ధన్యవాదాలు చెప్పడం తప్ప ఇంకేదీ చెయ్యను,” అని అన్నారు మహి. మరోవైపు ఈ చిత్రాన్ని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చూడాల్సి ఉంది. ఇప్పటికే వైఎస్ సతీమణి విజయమ్మ చిత్రాన్ని తిలకించారు. ఈ వారంలో కుటుంబ సభ్యులతో కలిసి చూస్తారని సమాచారం.




