వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డికి సీబీఐ మళ్ళీ నోటీసులు ఇవ్వడంతో ఆయన ముందస్తు బెయిల్ కొరకు మళ్ళీ సుప్రీంకోర్టుని ఆశ్రయించారు.
వాస్తవానికి ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సుప్రీంకోర్టు ఇదివరకే కొట్టివేసింది. ఆయన ముందస్తు బెయిల్ కేసు విచారణను వేసవి సెలవుల తరువాత చేపడతామని చెపుతూ, ఆలోగా సీబీఐ విచారణ, అరెస్టు విషయంలో జోక్యం చేసుకోబోమని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది.
ఇది జరిగి దాదాపు రెండు వారాలుపైనే అయినప్పటికీ సీబీఐ ఇంతవరకు ఆయనను అరెస్ట్ చేయలేదు. పైగా ఆయన సూచించినట్లు చనిపోయే ముందు వివేకానంద రెడ్డి వ్రాసిన్నట్లు చెప్పబడుతున్న లేఖ గురించి సునీతా రెడ్డి, ఆమె భర్త రాజశేఖర్ రెడ్డిని ప్రశ్నిస్తోంది. అంటే వివేకా హత్య కేసును సీబీఐ విచారణ చేస్తోందా లేక సీబీఐ ఏవిదంగా విచారణ జరపాలో అవినాష్ రెడ్డే సీబీఐకి మార్గదర్శనం చేస్తున్నారా? అనే సందేహం కలుగక మానదు.
మళ్ళీ రెండు వారాల తర్వాత సీబీఐ ఆయనకు నోటీస్ పంపించి మంగళవారం మద్యాహ్నం విచారణకు హాజరుకావలసిందిగా ఆదేశిస్తే, ఆయన నాలుగు రోజులు గడువు కోరారు. దానికీ సీబీఐ అంగీకరించి ఈ నెల 19వ తేదీన విచారణకు హాజరు కావాలని ఆదేశించింది.
కానీ ఈలోగా అవినాష్ రెడ్డి మళ్ళీ సుప్రీంకోర్టుని ఆశ్రయించి తన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై హైకోర్టు వెకేషన్ బెంచ్ తక్షణం విచారణ జరపాలని ఆదేశించాలని కోరుతూ పిటిషన్ వేశారు.
అయితే దానిని అత్యవసర విచారణ చేపట్టాలని కోరుకుంటే లిఖితపూర్వకంగా అభ్యర్ధన ఇవ్వాలని సీజేఐ చంద్రచూడ్ సూచించారు. కనుక అవినాష్ రెడ్డి ఆవిదంగా సుప్రీంకోర్టుని అభ్యర్ధించవచ్చు.
సీబీఐ ఆయనకు ఎప్పుడు నోటీసు పంపినా వెంటనే కోర్టులో పిటిషన్ వేస్తూ విచారణకు హాజరుకాకుండా, అరెస్ట్ కాకుండా తప్పించుకునేందుకు ప్రయత్నిస్తుంటారని కనుక హైకోర్టు దీనిని అనుమతించరాదని సీబీఐ ఇదివరకు వాదించింది. కానీ ఆయన మళ్ళీ అదేవిధంగా వ్యవహరిస్తుండటం విశేషం.
ఆయన సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు కనుక సీబీఐ విచారణ, ఆయన అరెస్ట్ కధ మళ్ళీ మొదటి నుంచి ప్రారంభం అయిందనుకోవచ్చు.
ఈ హత్యతో అవినాష్ రెడ్డికి ప్రత్యక్షంగా సంబంధం ఉందని, అయన విచారణలో తమకు సహకరించడంలేదని, ఆయన బయట ఉంటే సాక్షులను ప్రభావితం చేస్తారు కనుక అరెస్ట్ చేయవలసిన అవసరం ఉందని పదేపదే చెపుతున్న సీబీఐ, ఆయనను ఎందుకు ఆరెస్ట్ చేయడం లేదు? ఆయనను దోషి అని చెపుతూనే అరెస్ట్ చేయకుండా, అరెస్ట్ కాకుండా తప్పించుకునే అవకాశాలను సీబీఐయే కల్పిస్తోందా? అయితే ఎందుకు? అనే సందేహాలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి. కానీ సీబీఐ తీరు, నోటీసు వచ్చినప్పుడల్లా అవినాష్ రెడ్డి హైకోర్టు లేదా సుప్రీంకోర్టులో పిటిషన్లు వేస్తూ కాలయాపన చేస్తుండటం గమనిస్తే, ఈ కేసు విచారణ జూన్ నెలాఖరు కాదు కదా మరో ఏడాది గడువిచ్చినా పూర్తయ్యేది కాదని అర్థమవుతోంది.



