వివేకానందా రెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు నిన్న స్టే విధించింది. ఈ సందర్భంగా హైకోర్టు తీరును సుప్రీంకోర్టు తప్పు పట్టింది కూడా. కనుక తెలంగాణ హైకోర్టు సుప్రీం ఆదేశాలు పాటిస్తూ నేడు ఆయన బెయిల్ పిటిషన్‌ను కొట్టివేస్తుందని అందరూ భావిస్తే దానిపై రేపు విచారణ జరుపుతామని ప్రకటించడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. హైకోర్టు ఆ ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేయనందున, సీబీఐ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయలేదు. కనుక ఆయనకు మరో 24 గంటలు ఉపశమనం లభించింది.
ఈ కేసుకు సంబందించి సీబీఐ కూడా నిన్న సుప్రీంకోర్టుకు ఓ నివేదిక సమర్పించింది. దానిలో అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డికి ఈ హత్యతో ప్రమేయం ఉందని, వారు ఆరోపిస్తున్నట్లుగా వివేకా కూతురు, అల్లుడికి ఎటువంటి సంబందమూ లేదని తెలియజేసింది. కనుక నేడు హైకోర్టు అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కొట్టివేయగానే సీబీఐ ఆయనను అరెస్ట్ చేస్తుందని అందరూ భావిస్తే, తెలంగాణ హైకోర్టు ఈ కేసును రేపు విచారిస్తామని చెప్పడం ఆశ్చర్యకరమే.
కాకినాడలో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు చేతిలో దారుణహత్యకు గురైన దళిత యువకుడు సుబ్రహ్మణ్యం హత్యకేసులో బాధితుడి కుటుంబం తరపున వాదించిన సీనియర్ న్యాయవాది శ్రవణ్ ఈ కేసు విచారణ జరుగుతున్నా తీరుపై స్పందిస్తూ, “సుప్రీంకోర్టు ఇంత స్పష్టంగా ఆదేశాలు ఇచ్చినప్పటికీ తెలంగాణ హైకోర్టు ఇంకా ఈ కేసును రేపు విచారిస్తామని చెప్పడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. ఈ కేసులో సీబీఐ తీరు మొదటి నుంచే అనుమానాస్పదంగా ఉంది. ఒకే నేరం, ఒకే కేసులో భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డిలను సీబీఐ విచారిస్తున్నప్పుడు, వారిలో భాస్కర్ రెడ్డిని మాత్రమే అరెస్ట్ చేసి అవినాష్ రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేయలేదు?వేరే కేసులలో నిందితులను అరెస్ట్ చేయడానికి క్షణం ఆలోచించని సీబీఐ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసేందుకు ఎందుకు మీనమేషాలు లెక్కిస్తోంది?
అవినాష్ రెడ్డిపై సీబీఐయే నేరారోపణ చేస్తోంది కదా?ఆయనను అరెస్ట్ చేస్తామని హైకోర్టుకు చెప్పింది కూడా కదా? కానీ అవినాష్ రెడ్డి అరెస్ట్ చేయకుండా ఆయనకు ఉపశమనం కలిగిస్తోంది. అంటే సీబీఐయే ఆయనకు వీలైనంతగా సహకరిస్తోందని భావిస్తున్నాను. అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయకుండా సీబీఐ మీద ఎవరు ఒత్తిడి చేస్తున్నారు?” అని ప్రశ్నించారు.



