గత ఎన్నికలలో వైసీపికి ‘మేలు’ చేసిన వివేకానంద రెడ్డి హత్య కేసు ఈ ఎన్నికలలో వైసీపికే కీడు చేసేలా ఉంది. ముందుగా చెప్పుకోవలసింది కడప నుంచి వైఎస్ షర్మిల లోక్‌సభకు పోటీకి దిగడం. ఆమెకు వివేకా కుమార్తె సునీతా రెడ్డి పూర్తి మద్దతు పలుకుతుండటం.
ఇద్దరు చెల్లెమ్మలని ఇద్దరు అన్నదమ్ములు ఎదుర్కోవడం అంటే ఇంతకాలం వైసీపి కుటుంబంలో సాగిన అంతర్యుద్ధాలను అందరూ కలిసి బయటపెట్టుకొని ప్రజలను తీర్పు చెప్పమని కోరిన్నట్లే. వారి తీర్పు ఏవిదంగా ఉండబోతుందో ఊహించుకోవచ్చు.
ఎందుకంటే, మొదట చెల్లి షర్మిలని, తర్వాత తల్లి విజయమ్మని జగన్ బయటకు సాగనంపారు. తల్లిని, చెల్లిని బయటకు పంపించి వివేకా హత్యకేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డిని వెనకేసుకు వస్తున్నారు. మళ్ళీ ఆయననే వైసీపి అభ్యర్ధిగా ప్రకటించారు కూడా. ఎందుకు?అనే ప్రశ్నకు సమాధానం చెప్పడం లేదు.
వైసీపిని కలవరపెట్టే మరో అనూహ్య పరిణామం కూడా ఇటీవలే జరిగింది. ఇంతకాలం వివేకా హత్య కేసు విచారణని ముందుకు కదలకుండా కట్టడి చేశామని లోలోన సంతోషపడుతున్న వైసీపి మేధావులకి ఇప్పుడు అదే పెద్ద పొరపాటు అని తెలిసివస్తోంది.
ఈ నెల 18 నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలవుతుంది. సరిగ్గా ఈ సమయంలో తెలంగాణ హైకోర్టులో అవినాష్ రెడ్డి బెయిల్ పిటిషన్‌పై వాదనలు జరగడం, ఆయన బెయిల్ రద్దు చేయాలని సీబీఐ న్యాయవాది గట్టిగా వాదించడం అన్నదమ్ములకు ముఖ్యంగా అవినాష్ రెడ్డికి చాలా కలవరం కలిగించే విషయమే.
ఈ కేసులో ఆయన అప్రూవరుగా మారిన దస్తగిరిని ప్రభావితం చేసేందుకు ప్రయత్నించారనే దస్తాగిరి న్యాయవాది వాదన చాలా కీలకంగా మారనుంది.
తాను కడప జైల్లో ఉన్నప్పుడే శివశంకర్ రెడ్డి కుమారుడు చైతన్య రెడ్డి వచ్చి తనను కలిసి అనుకూలంగా సాక్ష్యం చెపితే రూ.20 కోట్లు ఇస్తానని చెప్పారని దస్తగిరి స్వయంగా చెప్పాడు. అదే విషయాన్ని అతని తరపు న్యాయవాది జడల శ్రావణ్ కుమార్ ఈ సందర్భంగా హైకోర్టుకి తెలియజేశారు. బెయిల్ షరతు ఉల్లంఘించినందుకు బెయిల్ రద్దు చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఇదో ప్రమాద హెచ్చరిక అనుకుంటే ఈ కేసుపై తదుపరి విచారణను ఏప్రిల్ 15కి వాయిదా వేయడం కూడా అవినాష్ రెడ్డికి మరో ప్రమాద హెచ్చరికగానే కనిపిస్తోంది. ఒకవేళ ఆ రోజు కోర్టు ఆయన బెయిల్ రద్దు చేస్తే… సీబీఐ వెంటనే అరెస్ట్ చేయవచ్చు.
అప్పుడు కూడా ఆయన మళ్ళీ సుప్రీంకోర్టుని ఆశ్రయించి అరెస్టు కాకుండా తప్పించుకున్నా ఈ పరిణామాలన్నీ ఎన్నికలలో కడప ఓటర్లని ఆలోచింపజేస్తాయి. ఒకవేళ చేయకపోతే వైఎస్ షర్మిల, సునీతారెడ్డి ఇద్దరూ కలిసి తప్పక ఆలోచింపజేయిస్తారు. కనుక ఈ విదంగానైనా అవినాష్ రెడ్డికి ఓటమి తప్పకపోవచ్చు.
అంటే ఇటు వివేకా హత్య కేసులో అరెస్ట్ ప్రమాదం, అటు కడపలో ఓటమి భయం రెండూ ఒకేసారిఅవినాష్ రెడ్డిని చుట్టుముట్టబోతున్నాయన్న మాట!
కనుక జగన్ ఆయనను మార్చే ఆలోచన చేయవచ్చు లేదా ఇంత జరిగినా జగన్ ఆయననే అభ్యర్ధిగా కొనసాగించవచ్చు.
ఒకవేళ అవినాష్ రెడ్డిని మార్చినా కడపలో వైఎస్ షర్మిలని ఢీకొని ఓడించగలవారు ఎవరూ వైసీపిలో లేరు. అలాగని అవినాష్ రెడ్డినే కొనసాగిస్తే ‘ఆయనను ఇంతగా ఎందుకు అంతగా వెనకేసుకు వస్తున్నారని ఇద్దరు చెల్లెళ్ళు అడిగే ప్రశ్నకు జగన్ సూటిగా సమాధానం చెప్పలేరు. కడప ప్రజలకు అన్ని తెలుసని మాత్రమే జగన్ చెప్తున్నారు. కనుక వారే తీర్పు చెపుతారు. తొలిసారిగా పూర్తి క్లీన్ రికార్డుతో తమ ముందుకు వచ్చి ఓట్లు అడుగుతున్న వైఎస్ బిడ్డని కడప ప్రజలు కాదనకపోవచ్చు. కనుక షర్మిల విజయం దాదాపు ఖాయమనే భావించవచ్చు. అంటే కడప ఎంపీ సీటు అప్పుడే వైసీపి చేజారిపోయిన్నట్లే కనిపిస్తోంది.
గత ఎన్నికలలో వైసీపికి మేలు కలిగించిన వివేకా హత్య కేసు, ఈ ఎన్నికలలో వైసీపికి ఈవిదంగా నష్టం కలిగిస్తుండటం విచిత్రమే కదా?






